Asia Cup 2025 Ind Vs Ban Latest News: సూపర్ ఫామ్ లో ఉన్న భారత విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకున్నాడు. బుధవారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన అర్ధ సెంచరీ (37 బంతుల్లో 75, 6 ఫోర్లు, 5 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో అసియాకప్ ఒక ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా కొత్త రికార్డును నెలకొల్పాడు. కేవలం 5 మ్యాచ్ ల్లోనే తను ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన ఓపెనర్ సనత్ జయసూర్య పేరిట ఉంది.2008 ఎడిషన్ లో తను 14 సిక్సర్లు బాదడం విశేషం. అప్పుడు ఈ టోర్నీ వన్డే ఫార్మాట్ లో జరిగింది.
బంగ్లాపై 5 సిక్సర్లు..టోర్నీ ఇప్పటివరకు 16 సిక్సర్లు బాదిన అభిషేక్.. బంగ్లాపై మ్యాచ్ లో ఐదు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తన జోరుతో మైదానంలోని ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగి చూస్తూ ఉండి పోయారు. భారీ సిక్సర్లతో తన జోరును కొనసాగిస్తూ, కేవలం 25 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అభిషేక్.. సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశించారు. గత మ్యాచ్ లో కూడా 70+ స్కోరు చేసిన అభిషేక్.. ఈసారి కూడా ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూ మళ్లీ 70+ స్కోరుపైనే ఔటయ్యాడు. అయితే ఈసారి రనౌట్ రూపంలో తను ఔటవడం అభిమానులను షాక్ కు గురిచేసింది. ఇక సూపర్-4లో శ్రీలంకతో చివరి లీగ్ మ్యాచ్ తోపాటు ఫైనల్ (అర్హత సాధించడం దాదాపు ఖాయమే) మ్యాచ్ ఉండటంతో తన సిక్సర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని శర్మ అభిమానులు కోరుకుంటున్నారు. ఈనెల 26న లంకతో, ఫైనల్ మ్యాచ్ ఈనెల 28న జరుగుతుంది.
భారీ స్కోరు..ఇక ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ బెర్తు సాధిస్తుందన్న అంచనాతో బరిలోకి దిగిన భారత్.. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసి, భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. నిజానికి ఇన్నింగ్స్ ఆరంభంలో అభిషేక్ చేసిన విధ్వంసంతో ఇండియా భారీ స్కోరు సాధిస్తుందని భావించినా, మిడిలార్డర్ విఫలం కావడంతో అనుకున్నదానికంటే చాలా తక్కువ స్కోరుకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38, 4 ఫోర్లు, ఒక సిక్సర్)తో సమయోచిత బ్యాటింగ్ తో జట్టుకు మంచి స్కోరును అందించే ప్రయత్నం చేశాడు. మరో ఓపెనర్ శుభమాన్ గిల్ (29) కూడా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఇక బౌలర్లలో రిషాద్ హుస్సేన్ రెండు వికెట్లతో రాణించాడు. ముస్తాఫిజుర్ రహ్మాన్ టీ20ల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి బంగ్లా దేశీప్లేయర్ గా తను రికార్డులకెక్కాడు.