Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌ పడిసి పతకం ముద్దాడింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సింగపూర్‌ను 3-1 తేడాతో ఓడించింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో వికాస్ ఠాకూర్ రజతం గెలిచాడు. దాంతో భారత్‌ ఖాతాలో 12 పతకాలు చేరాయి.






టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్లో మొదట సాతియన్‌ గుణశేఖరన్‌, హర్మీత్ దేశాయ్ తలపడ్డారు. అద్భుతమైన విజయంతో టీమ్‌ఇండియాకు 1-0 ఆధిక్యం అందించారు. అయితే పురుషుల సింగిల్స్‌లో అనుభవజ్ఞుడైన శరత్‌ కమల్‌ను క్లియరెన్స్‌ చెవ్‌ ఓడించాడు. దాంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత సాతియన్‌, హర్మీత్‌ పురుషుల సింగిల్స్‌తో తమ మ్యాచులు గెలవడంతో భారత్‌ 3-1 తేడాతో స్వర్ణం ముద్దాడింది.




పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు రజత పతకం వచ్చింది. 96 కిలోల విభాగంలో అతడు 346 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 155, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 191 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ క్రీడల్లో వికాస్‌కు వరుసగా ఇది మూడో పతకం. ప్రస్తుత పోటీల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఎనిమిదో పతకం కావడం గమనార్హం. అంతకు ముందు లాన్‌ బౌల్స్‌లో అమ్మాయిల జట్టు బంగారు పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇప్పటి వరకు 12 పతకాలు అందాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, కెనడా, దక్షిణాఫ్రికా మనకన్నా ముందున్నాయి.