Commonwealth Games 2022: కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత సాక్షి మలిక్ (Sakshi Malik) భావోద్వేగానికి గురైంది! పోడియం పైకి ఎక్కి పతకం ధరించిన తర్వాత ఆనంద బాష్పాలు కార్చింది. జాతీయ గీతం వస్తున్నంత సేపూ ఆమె కళ్లలో నీటిచెమ్మ కనిపించింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు జరుగుతుండటం, చాన్నాళ్ల తర్వాత పతకం గెలవడంతో సాక్షి తీవ్ర భావోద్వేగం చెందింది.


శుక్రవారం రోజు కుస్తీ వీరులు అదరగొట్టాడు. బరిలోకి దిగిన ఆరుగురికీ పతకాలు వచ్చాయి. ముగ్గురు పసిడి పతకాలను ముద్దాడగా ఒకరు రజతం కైవసం చేసుకున్నారు. మరో ఇద్దరు కాంస్యం కొల్లగొట్టారు.


మహిళల 62 కిలోల ఫైనల్లో సాక్షి మలిక్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెనడా రెజ్లర్‌ గోంజాలెజ్‌ను కిందపడేసి గెలుపు తలుపు తట్టింది. మొదట్లో ప్రత్యర్థిని పడగొట్టేందుకు విఫల యత్నం చేసిన సాక్షి అనూహ్యంగా కింద పడటంతో ప్రత్యర్థికి రెండు పాయింట్లు వచ్చాయి. దీంతో పాయింట్లు సమం చేసేందుకు ఆమె తీవ్రంగా పోరాడింది. తొలి మూడు నిమిషాలు ముగిసే సరికి 0-4తో వెనకబడినా విరామం తర్వాత చెలరేగింది. గోంజాలెజ్‌ను ఎత్తిపడేసి, పైకి లేవకుండా అలాగే మ్యాట్‌కు అదిమి పట్టి బంగారు పతకం గెలిచేసింది.






రియో ఒలింపిక్స్‌ 2016లో సాక్షి మలిక్‌ కాంస్య పతకం సాధించింది. రెపిఛేజ్‌ పోరులో గెలిచి దేశ ప్రజలను ఆనందంలో ముంచెత్తింది. ఈ విజయం తర్వాత సాక్షి నుంచి ఇలాంటి ప్రదర్శన రాలేదు. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పతకాలేమీ సాధించలేదు. ఇన్నాళ్లకు కామన్వెల్త్‌ రూపంలో స్వర్ణ పతకం రావడంతో ఆనందంలో తేలిపోయింది. పోడియం మీదకు రాగానే గాల్లో తేలినట్టుగా అనిపించింది. పతకం ధరించాక కళ్లు మూసుకొని సేద తీరింది. మువ్వన్నెల జెండా పైకి ఎగురుతోంటే, జాతీయ గీతం వినిపిస్తుంటే ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. గీతం వస్తున్నంత సేపూ ఆమె కళ్ల నుంచి నీటి బిందువులు రాలుతూనే ఉన్నాయి.


Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతూ పతకాల వేట కొనసాగిస్తున్నారు. మొదట భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల భారాన్ని మోయగా, ప్రస్తుతం రెజ్లర్లు బంగారం కుస్తీ పడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు చేరగా, అవన్నీ రెజ్లింగ్ లోనే రావడం విశేషం. నిన్న మొదట బజరంగ్‌ పునియా పురుషుల 65 కిలోల విభాగంలో స్వర్ణాన్ని నెగ్గగా, అనంతరం సాక్షి మాలిక్, దీపక్ పునియాలు సైతం కోట్లాది భారతీయుల ఆశల్ని నిజం చేస్తూ బంగారు పతకం నెగ్గారు. దివ్య కాక్రన్, మోహిత్ గ్రేవాల్ కాంస్య పతకాలు సాధించారు.