Bindyarani Devi Wins Silver Medal: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత్ ఇదివరకే మూడు పతకాలు సాధించగా, అర్ధరాత్రి మరో పతకం తన ఖాతాలో వేసుకుంది భారత్. మహిళల 55 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణి దేవి రజతం సాధించింది. దాంతో శనివారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 4 పతకాలు చేరాయి. 


ఒక్క కేజీ తేడాతో చేజారిన స్వర్ణం.. 
మహిళల 55 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి, మణిపూర్‌కు చెందిన బింద్యారాణి ఏకంగా   మొత్తం 202 కిలోలను ఎత్తి రికార్డును సృష్టించింది. అయితే కేవలం 1 కేజీ తేడాతో స్వర్ణాన్ని కోల్పోయింది దేవి. నైజీరియాకు చెందిన ఆదిజత్ అడెనికే ఒలారినోయే 203 కేజీలు ఎత్తి బంగారం ఎగరేసుకుపోయింది. 23 ఏళ్ల భారత వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణి దేవికి ఇది తొలి కామన్ వెల్త్ గేమ్స్. అయినా అత్యుత్తమ ప్రదర్వన కనబరిచింది. ఫ్రెయిర్ మారో 198 (స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ లో 109kg) కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది.






రెండో ప్రయత్నంలో క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 114 కేజీలను ఎత్తాలని యత్నించి ఫెయిలయింది. అయితే చివరి ప్రయత్నంలో 116 కేజీలు ఎత్తి రజత పతకం (Silver Medal) సాధించింది దేవి. స్నాచ్ రౌండ్ లో 86 కేజీలు ఎత్తింది. దీంతో మొత్తం 202 కేజీల బరువులెత్తి 1 కేజీ తేడాతో స్వర్ణం కోల్పోవడం కాస్త బాధాకరమే. 


కామన్ వెల్త్ రికార్డ్, నేషనల్ రికార్డులు బద్దలు..
స్వర్ణ పతకాన్ని 1 కేజీతో కోల్పోయినా భారత వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి దేవి రెండు రికార్డులు నెలకొల్పింది. స్నాచ్ విభాగంలో 86 కేజీలు ఎత్తి నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. క్లీన్ అండ్ జర్క్ లో 116 కేజీలు ఎత్తి జాతీయ రికార్డుతో పాటు కామన్వెల్త్ గేమ్స్ లోనూ ఈ విభాగంలో అత్యధిక బరువు ఎత్తిన వెయిట్ లిఫ్టర్ గా చరిత్ర సృష్టించింది బింద్యారాణి దేవి. 






కామన్వెల్త్‌లో భారత్ సాధించిన పతకాలు.. 
వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల 49 కేజీల విభాగంలో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణం సాధించింది. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్‌ రజతం, మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్య పతకం అందుకున్నారు.