Babar Azam On World Cup 2023: 2023 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం పెద్ద ప్రకటన చేశాడు. తమ జట్టు దృష్టి భారత్‌లో జరిగే ప్రపంచకప్‌పైనే ఉందని బాబర్ ఆజం అన్నాడు.


నిజానికి బాబర్ ఆజం ప్రకటన ముఖ్యమైనది. ఎందుకంటే ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజామ్ సేథీ తన ప్రకటనలో ఆసియా కప్ ఆడటానికి టీమ్ ఇండియా పాకిస్తాన్‌కు రాకపోతే, తమ జట్టు ప్రపంచ కప్ ఆడటానికి భారతదేశానికి వెళ్లదని చెప్పాడు. అయితే ఇప్పుడు తమ జట్టు దృష్టి ప్రపంచకప్ 2023పైనే ఉందని, ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నామని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పాడు. కాబట్టి ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ వస్తుందని అనుకోవచ్చు.


మా జట్టు దృష్టి ప్రపంచ కప్ 2023పై ఉంది: బాబర్ ఆజం
ప్రపంచకప్‌కు తన ఫాం, మహ్మద్‌ రిజ్వాన్‌ ఫాం చాలా కీలకమని పాక్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజం అన్నాడు. క్రికెట్ అనేది టీమ్ గేమ్ అని తను, మహ్మద్ రిజ్వాన్ సహా మిగతా ఆటగాళ్లు కూడా తమ సత్తా చాటాలని కోరుకున్నాడు.


తనకు, మహ్మద్‌ రిజ్వాన్‌కు మధ్య భాగస్వామ్యం అద్భుతంగా ఉందని, అయితే అన్ని మ్యాచ్‌ల్లోనూ తమ భాగస్వామ్యం బాగా ఉండాల్సిన అవసరం లేదని బాబర్ ఆజం అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో కేవలం ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లపై ఆధారపడకూడదని, ఇది టీమ్ గేమ్ కాబట్టి మిగిలిన టీమ్ ప్లేయర్‌లు కూడా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పేర్కొన్నాడు.


ఇది కాకుండా పాకిస్తాన్ కెప్టెన్ తన పేలవమైన ఫామ్ గురించి కూడా మాట్లాడాడు. ఒక ఆటగాడిగా విమర్శలు ఎదుర్కోవడం సహజమని, అందరూ పొగిడే అవకాశం లేదని పేర్కొన్నాడు. కానీ తాను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తానని, తన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు. బాబర్ ఆజం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ టోర్నీలో బాబర్ అజామ్ ఇప్పటివరకు రెండుసార్లు అర్థ సెంచరీ మార్కును దాటాడు.


2022 సంవత్సరానికి గాను ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) తన ఉత్తమ వన్డే జట్టును ప్రకటించింది. 11 మందితో కూడిన జట్టును విడుదల చేసింది. పాకిస్థాన్ టీం కెప్టెన్ బాబర్ అజామ్ ఈ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. భారత్ నుంచి శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్ కు స్థానం లభించింది. 


గతంలో పాకిస్థాన్‌ కెప్టెన్‌, స్టార్‌ బ్యాట్స్‌మెన్ బాబర్‌ అజమ్‌ హనీ ట్రాప్‌లో కూడా చిక్కుకున్నాడు. అతను తన తోటి క్రికెటర్‌ గర్ల్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకరంగా ఛాటింగ్ చేసిన వీడియోలు బయటికొచ్చాయి. ఆ అమ్మాయితో నగ్నంగా వీడియో కాల్స్‌లో మాట్లాడినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


ప్రస్తుతం పాకిస్థాన్‌ క్రికెట్‌లో ఇది పెద్ద సంచలనంగా మారింది. దీంతో బాబర్‌ ఆజమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ‘నువ్వు నాతో ఇలాగే ఛాటింగ్ చేస్తేనే నీ బాయ్‌ ఫ్రెండ్‌ పాకిస్థాన్‌ టీమ్‌లో కొనసాగుతాడు.’ అని బాబర్‌ ఆజమ్ ఈ అమ్మాయితో అన్నట్లు వీడియోల్లో కనిపించింది.