సెర్బియాకు చెందిన ప్రపంచ ఐదో ర్యాంకర్ నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 ఫైనల్లో గ్రీస్‌కు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ స్టెఫానోస్ సిట్సిపాస్‌పై విజయం సాధించి టైటిల్ గెలిచాడు. వరుస సెట్లలో 6-3, 7-6 (7-4),  7-6 (7-5) తేడాతో స్టెఫానోస్ సిట్సిపాస్‌పై జకోవిచ్ గెలుపొందాడు.


అభిమానులు ముద్దుగా ‘జోకర్’ అని పిలుచుకునే ఇది నోవాక్ జకోవిచ్‌కు పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. ఇది ఓవరాల్‌గా జకోవిచ్‌కు 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న ఆటగాడిగా రఫెల్ నాదల్ సరసన నిలిచాడు. నాదల్ ఖాతాలో కూడా 22 గ్రాండ్‌స్లామ్‌లే ఉన్నాయి.


మొదటి సెట్‌ను జకోవిచ్ సింపుల్‌గానే గెలిచాడు. స్టెఫానోస్ నుంచి ఎక్కువగా పోటీ ఎదురు కాలేదు. అయితే రెండు, మూడో సెట్లలో మాత్రం స్టెఫానోస్ గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో ఈ రెండు సెట్లూ టై బ్రేకర్ వరకు వెళ్లాయి. కానీ జకోవిచ్ గెలుపును మాత్రం అడ్డుకోలేకపోయాడు.


ఇదే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గతేడాది స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ గెలుచుకున్నాడు.  ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదేవ్‌పై 6-2, 7-6, 6-4, 6-4, 7-6తో విజయం సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు. అప్పటికి నాదల్ కెరీర్‌లో అది 21వ గ్రాండ్ స్లామ్. ఆ సమయానికి రోజర్ ఫెదెరర్, నోవాక్ జొకోవిచ్‌ల ఖాతాలో చెరో 20 గ్రాండ్ స్లామ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుని 22వ- గ్రాండ్‌స్లామ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు జకోవిచ్ 22 గ్రాండ్‌స్లామ్‌లతో నాదల్‌ను సమం చేశాడు.


ఇప్పటి వరకు అత్యధిక ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించిన ఆటగాడు రఫెల్ నాదలే. ఏకంగా 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను అతను సాధించడం విశేషం. 2005 నుంచి 2008 వరకు, 2010 నుంచి 2014 వరకు, 2017 నుంచి 2020 వరకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను అతను గెలుచుకున్నాడు. అలాగే 2022 ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో తనను ఓడించిన ఆటగాళ్లు రాబిన్ సోదర్లింగ్, నోవాక్ జొకొవిచ్  మాత్రమే.


ఇక నోవాక్ జకోవిచ్ అత్యధికంగా 10 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నాడు. తన తర్వాత రాయ్ ఎమర్సన్, రోజర్ ఫెదరర్ చెరో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో రెండు, మూడు స్థానాలతో ఉన్నాడు. రఫెల్ నాదల్ ఖాతాలో రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు మాత్రమే ఉన్నాయి.


జకోవిచ్ ఖాతాలో 10 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023), రెండు ఫ్రెంచ్ ఓపెన్ (2016, 2021), ఏడు వింబుల్డన్ (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022), మూడు యూఎస్ ఓపెన్ (2011, 2015, 2018) టైటిళ్లు ఉన్నాయి.


ఇక నాదల్ విషయానికి వస్తే... 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లతో పాటు, రెండు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌లు (2008, 2010), నాలుగు యూఎస్ ఓపెన్ టైటిళ్లు (2010, 2013, 2017, 2019), రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు (2009, 2022) కూడా సాధించాడు. 2005 నుంచి తను కేవలం మూడు సంవత్సరాల్లో మాత్రమే గ్రాండ్ స్లామ్ సాధించలేదు. 2015, 2016, 2021 సంవత్సరాల్లో తప్ప మిగతా అన్ని సంవత్సరాల్లో కనీసం ఒక్క సంవత్సరం అయినా నాదల్ గ్రాండ్ స్లామ్ కొట్టాడు.


నాదల్ కేవలం 24 సంవత్సరాల వయసులోనే కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్.. నాలుగు గ్రాండ్ స్లామ్‌లూ గెలిస్తే కెరీర్ స్లామ్ సాధించినట్లు. ఈ ఫీట్ సాధించిన అత్యంత చిన్న వయస్కుడు నాదలే.