ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వంద పతకాలు సాధించాలన్న లక్ష్యాన్ని సాధించింది. ఆసియా గేమ్స్ 2023లో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోన్న భారత్.. అందరి అంచనాలను నిజం చేస్తూ శత పతకాలు సాధించింది. చైనాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో ఆర్చరీ విభాగం భారత్‌ను వంద పతకాల లక్ష్యం దిశగా నడపించగా.. అథ్లెటిక్స్ విభాగంలోనూ టీమిండియా పతక గర్జన చేసింది. బాక్సర్లు, రెజ్లర్లు కొంచెం నిరాశపరిచినా భారత్ మాత్రం వంద పతకాల లక్ష్యాన్ని సాధించింది. అథ్లెటిక్స్ విభాగంలోనూ సత్తా చాటి.. ఒలింపిక్స్ పతకాలపై ఆశలను రెట్టింపు చేసింది. ప్రపంచ క్రీడా వేదికపై భారత ప్రస్థానం ప్రారంభమైందనడానికి ఆసియా క్రీడలే ప్రత్యక్ష సాక్ష్యమని పలువరు ప్రముఖ క్రీడాకాలు కొనియాడుతున్నారు.
శుక్రవారం 95 పతకాలతో రోజును ముగించిన భారత్... ఆసియా గేమ్స్ చివరి రోజు వేగంగా మరో అయిదు పతకాలు కైవసం చేసుకుంది. భారత స్టార్, తెలుగమ్మాయి జ్యోతి సురేఖ భారత్‌కు మరో పసిడి పతకాన్ని అందించి సత్తా చాటింది. ముచ్చటగా మూడో స్వర్ణం సాధించి భారత కీర్తి పతాకను చైనా గగనతలంపై రెపరెపలాడించింది. భారత మహిళల కబడ్డీ ఫైనల్‌లో చైనీస్ జట్టును చిత్తు చేస్తూ స్వర్ణంతో మెరిసింది. అలాగే ఆర్చరీ ఈవెంట్‌లో ఇవాళ(శనివారం) మొత్తం నాలుగు పతకాలను భారత్ కైవసం చేసుకుంది. అర్చరీ విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యం సాధించింది. మరోవైపు ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ స్వర్ణం గెలుచుకోగా.. అభిషేక్ రజతం సాధించాడు. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కి చేరింది. ఇందులో స్వర్ణం- 25 రజతం- 35 కాంస్యం- 40 పతకాలు ఉన్నాయి.
ఈసారి ఆసియా గేమ్స్‌లో అద్భుత అథ్లెట్ మాత్రం జ్యోతి సురేఖ. మూడు స్వర్ణాలతో జ్యోతి...ఈ గేమ్స్‌లో అద్భుతమే చేసింది. అలాగే అథ్లెట్లు గొప్పగా రాణించారు. అందరి అంచనాలను నిజం చేస్తూ... జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 88.88 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి పసిడిని ముద్దాడాడు. ఇదే విభాగంలో నీరజ్‌కు గట్టిపోటీ ఇచ్చిన కిశోర్ కుమార్ జెనా.... కెరీర్ బెస్ట్ నమోదు చేస్తూ రజత పతకం కైవసం చేసుకున్నాడు. 86.77 మీటర్ల దూరం బల్లెం విసిరిన కిశోర్ చివరి వరకూ నీరజ్‌కు గట్టిపోటీనిచ్చాడు. వీరిద్దరూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి భారత్‌కు పతక ఆశలను రెట్టింపు చేశారు.
ఫోర్ ఇన్‌టు 400 మీటర్ల రీలేలో భారత పురుష అథ్లెట్లు స్వర్ణంతో సత్తా చాటగా.... ఇదే విభాగంలో మహిళా అథ్లెట్లు రజత పతకం సాధించారు. లాంగ్ డిస్టాన్స్ రన్నింగ్‌లో అవినాశ్ ముకుంద్ సాబలే రెండు పతకాలు సాధించి సత్తా చాటాడు. 3 వేల మీటర్ల పరుగులో పసిడి గెలుచుకున్న సాబలే, 5 వేల మీటర్ల పరుగులో రజతం పతకం అందుకున్నాడు. మహిళల 1500 మీటర్లలో రజతం గెలుచుకున్న హర్మిలన్ 800 మీటర్లలోనూ మరో రజతం సాధించింది. పురుషుల గ్రీకో-రోమన్ రెజ్లింగ్ విభాగంలో తొలిసారి భారత్‌కు పసిడి దక్కింది. హాకీ, కబడ్డీ జట్లు స్వర్ణంతో మెరిశాయి.
చాలా పతకాలు అందినట్లే అంది చేజారాయి. లేకపోతే భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగేది. బాక్సర్లు, రెజ్లర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే టీమిండియా పతకాల సంఖ్య 110 కూడా దాటేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఆసియా గేమ్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్లు ఒలింపిక్స్‌లోనూ భారత కీర్తి పతాకను రెపరెపలాడించాలన్న కసితో ఉన్నారు.