Lakshya Sen Enters Quarter-Finals, PV Sindhu Bows Out: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్( All England Open Badminton Championships ) లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్(Lakshy Sen) తప్ప మిగిలిన షట్లర్లు అందరూ ఇంటి దారి పట్టారు. రెండో రౌండ్లోనే ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో సింధు 19-21, 11-21తో టాప్‌సీడ్, ప్రపంచ ఛాంపియన్, కొరియాకు చెందిన అన్ సె యంగ్ చేతిలో వరుస గేముల్లో ఓడింది . అనవసర తప్పిదాలతో సింధు ఆట గాడి తప్పింది. కొరియా షట్లర్ అన్ సి యంగ్‌తో 42 నిమిషాలపాటు సాగిన పోరులో సింధు అటాకింగ్ గేమ్ ఆడే ప్రయత్నంలో పదేపదే తప్పులు చేయగా.. ప్రత్యర్థి మాత్రం విభిన్న గేమ్‌తో సింధును ఇబ్బందిపెట్టింది. యంగ్ చేతిలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని సింధుకు ఇది వరుసగా ఏడో పరాజయం. తొలి గేమ్‌లో సింధు 16-17తో గట్టిపోటీ ఇచ్చేలా కనిపించింది. సింధు మూడు గేమ్‌పాయింట్లు కాచుకున్నా.. యంగ్‌ను అడ్డుకోలేక పోయింది. ఇక, రెండో గేమ్‌లో కొరియన్ ఆధిపత్యం ముందు సింధు ఏమాత్రం నిలబడలేక పోయింది.
క్వార్టర్స్‌లో లక్ష్యసేన్
పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో అతడు 24-22, 11-21, 21-14తో నాలుగో సీడ్, డెన్మార్క్‌కు చెందిన ఆండ్రెస్ అంటోన్‌సెన్‌ను ఓడించాడు. తొలి గేమ్‌లో కష్టంగా గెలిచి.. పేలవ ఆటతో రెండో గేమ్‌ను చేజార్చుకున్న లక్ష్యసేన్.. మూడో గేమ్‌లోనూ తడబడ్డాడు. ఒక దశలో 2-8తో వెనుకబడ్డాడు. కానీ ఈ స్థితి నుంచి గొప్పగా పుంజుకున్న భారత షట్లర్ 25 పాయింట్లలో తానే 19 గెలిచి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను ఎగరేసుకుపోయాడు.
డబుల్స్‌లోనూ ఓటమి
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ ఓడిపోయింది. ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సాత్విక్ ద్వయం 16-21, 15-21తో ఫిక్రి మహ్మద్-మౌలానా (ఇండోనేషియా) జంట చేతిలో కంగుతింది. తొలి గేమ్ ఆరంభం నుంచే ఇరు జోడీలు హోరాహోరీగా తలపడడంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. 16-19 స్కోరు వద్ద తప్పిదాలు చేసిన సాత్విక్ జోడీ తొలి గేమ్‌ను చేజార్చుకొంది. ఇక, రెండో గేమ్‌లోనూ భారత జంట తడబడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇండోనేసియా జోడీ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంట 21-11, 11-21, 11-21తో చైనాకు చెందిన జాంగ్ షు జియాన్-జంగ్ యు చేతిలో పరాజయం పాలైంది.
చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్:
భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుతం చేసింది. గత ఏడాది అద్భుత ప్రదర్శనతో డబుల్స్ విభాగంలో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్న ఈ జోడీ.. 2024 సీజన్‌లో మేజర్ టైటిల్ సాధించింది. సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి 2024 విజేతలుగా అవతరించి చరిత్ర సృష్టించారు.