Adudam Andhra Tournament : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(Andhra Pradesh Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర(Adudam Andhra Tournamen) తొలి ఎడిషన్‌ ముగిసింది. విశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమం‍లో పాల్గొన్న సీఎం జగన్‌(Cm Ys Jagan)గ్రామ స్థాయి నుంచి ఎవరు కూడా ఎప్పుడూ ఊహించని పద్దతిలో మన మట్టిలోని మాణిక్యాలను గుర్తించేందుకు ఈ ఆడుదాం ఆంధ్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని తెలిపారు. రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేశామని అన్నారు. ఇందులో దాదాపుగా 25 లక్షల 40 వేల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారని తెలిపారు.దాదాపు 47 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3లక్షల 30 వేల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయని చెప్పారు. లక్షా 24 వేల పోటీలు మండల స్థాయిలో జరిగితే.. 7వేల 346 పోటీలు నియోజకవర్గ స్తాయిలో జరిగాయని పేర్కొన్నారు. 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే.. 260 రాష్ట్ర స్థాయిలో నిర్వహించామని ఈ రోజు ఫైనల్స్‌తో ముగించుకున్నామని సీఎం జగన్‌ తెలిపారు. విశాఖలోని ఉత్తరాంధ్ర మన కోడి రామమూర్తిగారి గడ్డమీద ఈ ముగింపు కార్యక్రమాన్నినిర్వహించుకున్నామని సీఎం జగన్‌ అన్నారు. 






 

ఎంతమంది పాల్గొన్నారంటే..

ఆడుదాం ఆంధ్ర తొలి ఎడిషన్‌లో భాగంగా గ్రామ,వార్డు సచివాలయ స్థాయిలో మొత్తం 3.30 లక్షలు, మండలస్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గస్థాయిలో 7,346, జిల్లాస్థాయిలో 1,731, రాష్ట్రస్థాయిలో 260 మ్యాచ్‌లు నిర్వహించారు. క్రీడాకారులకు దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందించడమే గాకుండా.. రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు.. మరెన్నో ఆకర్షణీయమైన బహుమతులను అందించేందుకు ప్రణాళికలు రచించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,40,972 మందిక్రీడాకారులు ఈ క్రీడా యజ్ఞంలో భాగం అయ్యారు. ఈ పోటీలను 80 లక్షల మంది వీక్షించారు.  మొత్తంగా 17,59,263 మంది పురుష, 7,81,709 మంది మహిళా ప్లేయర్లు ఈ క్రీడా సంబరంలో పాలుపంచుకున్నారు.  ఆడుదాం ఆంధ్రా మొదటి సీజన్‌ విజయవంతంగా పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ మెగా టోర్నీని నిర్వహించాలని నిర్ణయించింది. 

 

తప్పని తిప్పలు

సీఎం సభ కోసం తీసుకొచ్చిన బస్సులు జాతీయ రహదారిపై పార్కింగ్ చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పీఎంపాలెం స్టేడియం సమీపంలో జాతీయ రహదారిపై రెండువైపులా సుమారు 4 గంటలు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్‌ కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ట్రాఫిక్‌లో అంబులెన్స్‌ చిక్కుకుపోయినా.. పోలీసులు ఆ వాహనానికి దారి చూపించే ప్రయత్నం చేయలేదు. జగన్‌ సాయంత్రం 5 గంటల సమయంలో ఐటీ హిల్స్‌ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఐటీ సంస్థల నుంచి విధుల ముగించుకుని ఇళ్లకు వెళ్లాల్సిన ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.