ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా బ్రిటీష్‌ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది కోహ్లీ సేన. లార్డ్స్‌ వేదికగా భారత్ X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు బస చేసిన హోటల్ వద్ద టీమిండియా స్వాతంత్య్ర వేడుకలు చేసుకుంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జట్టు సభ్యులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు, వారి కుటుంబసభ్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆటగాళ్లు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 






వేడుకల్లో పాల్గొన్న పృథ్వీ షా, సూర్యకుమార్‌
శ్రీలంక పర్యటన నుంచి ఇంగ్లండ్‌కు చేరుకున్న పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసోలేషన్ పూర్తి చేసుకున్నారు. దీంతో వారు కూడా స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ నెల 25 నుంచి 25 నుంచి ప్రారంభమయ్యే మూడవ టెస్ట్‌ సెలెక్షన్స్‌ కోసం అందుబాటులో ఉంటారు. 


ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు లంచ్ విరామానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానె (3), పుజారా(6) ఉన్నారు. 34 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్.