ఆచార్య చాణక్యుడు గొప్ప విద్యావేత్త మాత్రమే కాదు, రాజకీయ వేత్త కూడా. ఆయన బోధలు ఇప్పటికీ జీవితానికి ఒక మంచి దారి చూపి దిక్సూచిగా పనిచేస్తాయని అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. జీవితాన్ని విజయపథంలో నడిపించేందుకు చాణక్య బోధలు చాలా ఉపయోగకరం. విజయం అందించే అనేకానేక రహస్యాలు చాణక్యనీతి పేరుతో నేటికీ ప్రాచూర్యంలో ఉన్నాయి. జీవితంలోని ప్రతి సందర్భంలో ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో తన నీతి శాస్త్రంలో చర్చించాడు చాణక్యుడు.
ఆయన చెప్పిన ఆర్థిక నియమాలు, దౌత్య వ్యూహాలు ప్రతి ఒక్కరి రోజువారీ జీవితాన్ని విజయపథంలో నడిపించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నేటికి చాణక్య నీతి అనుసరణీయమేనని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది. ఆయన సూచించిన విధానాలను అనుసరించిన వారు తప్పకుండా ఆర్థికంగా విజయవంతంగా ఉంటారు. ఎందుకంటే చాణక్యుడు మన దేశానికి చెందిన పెద్ద ఆర్థికవేత్త కూడా. సంపదల దేవత లక్ష్మీ కటాక్షానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన చక్కగా వివరించారు. కొన్ని చిన్నచిన్న నియమాలే లక్ష్మీ దేవిని ప్రసన్నం చేస్తాయి. ఆయన చెప్పిన కొన్ని సూచనలు పాటించి ఆర్థిక కష్టాలు మన దరికి చేరకుండా జాగ్రత్త పడవచ్చు.
కష్టే ఫలి
అంకిత భావంతో కష్టపడే వారికి తప్పక విజయం సిద్ధిస్తుంది. నిజాయితీగా కష్ట పడి సంపాదించే వారికి ఎప్పుడూ డబ్బుకు కొదవ ఉండదు. కష్టపడి పనిచే వారికి ఎప్పుడూ ఆ లక్ష్మీ దేవి ఆశీస్సులు ఉంటాయి. అంతేకాదు తినే ఆహారం పట్ల గౌరవం కలిగిన వారికి కూడా ఎప్పుడూ డబ్బుకు కొదవ ఉండదు. ఆహారం, డబ్బు నిజాయితిగా సంపాదించుకోవడం చాలా అవసరం అని చాణక్య నీతి చెబుతోంది. ఇలాంటి వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది.
ఇంట్లో ప్రశాంతత
కొంత మంది దేనికి కొదవ లేకపోయినా చీటికీ మాటికీ గొడవలు పడుతుంటారు. అలా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తుంటే ఆ ఇంట్లోకి లక్ష్మీ రావడానికి సంకోచిస్తుంది. నిశ్శబ్ధంగా, ప్రశాంతంగా ఉండే నెలవులు లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రదేశాలట. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అలా ప్రశాంతంగా ఉండే ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండడానికి ఇష్ట పడుతుంది. శుచి శుభ్రతలతో పాటు ప్రశాంతమైన ఇంటి వాతావరణం ఇంట్లోకి లక్ష్మిని ఆహ్వానిస్తుంది. శుభ్రంగా లేని ఇంట్లోనూ, నిరంతరం కీచులాటలు జరిగే ఇంటిలోనూ లక్ష్మీ నివాసం సాధ్యం కాదు. కనుక ఇంటి వాతావరణం అందంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని చాణక్య నీతి వివరిస్తోంది.
స్త్రీకి గౌరవం
ఎక్కడైతే స్త్రీలు పూజింప బడతారో అక్కడే దేవతలు నివసిస్తారని ఒక నానుడి. ఆ విషయాన్ని మరోసారి చాణక్య నీతి దృవీకరిస్తోంది. ఏ ఇంట్లో స్త్రీలు సుఖ సంతోషాలతో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీ తాండవిస్తుందట. ప్రేమతో, సహనుభూతితో ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు మసలుకుంటారో ఆ కుటుంబం సమృద్ధిగా ఉంటుందట. ఎక్కడయితే మహిళలు అవమానాల పాలవుతారో, కష్టపడుతుంటారో, నిర్లక్ష్యం చెయ్యబడతారో అక్కడ లక్ష్మీ క్షణకాలం పాటు కూడా నిలిచి ఉండదని చాణక్యనీతి చెబుతోంది. స్త్రీ కన్నీళ్లు పెట్టే చోటుకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు.