విశాఖ జిల్లాలో విశాఖ పట్టణానికి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది సింహాచలం. ఇక్కడి దేవుడు నారసింహుడు. సింహాద్రి అప్పన్నగా అందరూ ముద్దుగా పిలుచుకునే దేవుడు. తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి దాదాపుగా 250 మీటర్ల ఎత్తున ఉన్న సింహగిరి అనే పర్వతం మీద కొలువై ఉన్న విష్ణుస్వరూపం వరాహానరహింహ స్వామి ఈ అప్పన్న.


అయితే ఈ అప్పన్నకు సంవత్సరంలోని మూడు వందల అరవై నాలుగు రోజులు చందనం పూత పూసి ఉంచుతారు. నిజరూప దర్శనం కేవలం ఏడాదిలో పన్నెండు గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విగ్రహం ఎప్పడూ వేడిగా ఉంటుందని, కాబట్టి స్వామి వారిని చల్లబరిచేందకు చందనం పూత పూస్తూ ఉంటారని చెప్తారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగించి కేవలం 12 గంటల పాటు మాత్రమే స్వామి వారి నిజరూప దర్శనానకి అనుమతి ఇస్తారు. ఇలా ఏడాదికి ఒకసారి చందనం పూర్తిగా తొలగించి తిరిగి చందనం అలంకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని చందనోత్సవం అంటారు. ఈ సమయంలోనే స్వామి వారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతారు. వైశాఖ శుద్ధ తదియ నాడు ఉదయం స్వామి వారికి అలంకరించిన చందనం తీసేసి నిజరూపంలో ఆరోజు మధ్యాహ్నం అంతా కూడా భక్తులకు దర్శనం ఇస్తారు. ఆరోజు రాత్రి తిరిగి చందనం పూత వేస్తారు. ఏడాది పొడవునా ప్రతి రోజూ ఇక్కడి నరహింహ స్వామికి చందనలేపనం జరుగుతూనే ఉంటుంది.


నిజరూప దర్శనానంతరం మూడు మణుగులు అంటే దాదాపు 120 కేజీల చందనాన్ని మొదటగా సమర్పిస్తారు. తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి దినాల్లో కూడా మూడేసి మణుగుల చందనాన్ని స్వామి వారికి సమర్పిస్తారు. ఈ మొత్తం చందనాన్ని వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి తొలగించి మరునాటికి స్వామి వారిని నిజరూప దర్శనానికి సిద్ధం చేస్తారు.  ఈ కార్యక్రమాన్ని చందనోత్తరణ అంటారు.


ఎందుకీ చందనోత్తరణ? ఎందుకు చందనోత్సవం?


ఇక్కడ కొలువై ఉన్న దైవం మహా విష్ణువు రెండు అవతారాల కలయిక. ఇక్కడ విష్ణుమూర్తి వరహా నరసింహ రూపంలో వెలశాడు. మూల విరాట్టు కూడా అదే రూపంలో ఉండేదని స్థలపురాణం చెబుతోంది. చంద్రవంశానికి చెందిన పురూరవుడికి ఆకాశ వాణి ద్వారా సంవత్సరం పొడవుగా ఈ విగ్రహాన్ని చందన లేపనంతో కప్పి ఉంచాలనే అజ్ఞరావడం వల్ల అప్పటి నుంచి ఇలా చందనలేపనంతోనే స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వడం ప్రారంబించారని,  కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే ఈ చందనాన్ని తొలగించి స్వామి వారి నిజరూప దర్శన అవకాశం భక్తులకు కల్పించాలని కూడా ఆకాశవాణి చెప్పిందనే అంటారు. ఈ ఆలయాన్ని పురూరవడే నిర్మించాడని ప్రతీతి. నారసింహ అవతారం చాలా క్రొదిక్తమైన అవతారం కనుక ఆయనలోని క్రోదోష్ణాన్ని తగ్గించేందకు ఈ చందన లేపనం అవసరమని పండితులు చెబుతుంటారు. అందుకు తగినట్టుగానే ఈ విగ్రహం ఎల్ల వేళలా వేడిగా ఉంటుందని కూడా చెబుతారు. మరో విశేషం ఏమిటంటే.. అప్పన్న విగ్రహం నుంచి చందన లేపనం తీసే రోజు విశాఖ పరిసరాల్లో తీవ్రమైన ఉక్కపోత ఉంటుంది.


ఈ స్వామి వారి నిజరూపం త్రిభంగ ముద్రలోఉంటుంది. ఈ ముద్రకు యోగ శస్త్రంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గజపతులు, తూర్పు గాంగులు, రెడ్డి రాజులు, మత్స్య వంశీయులు ఇలా ఎన్నో రాజవంశాలు ఈ ఆలయాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారు.