Spiritual Names: సనాతన ధర్మంలో పిల్లలకు భగవంతుడి పేర్లు పెట్టడం సంప్రదాయం. కేవలం పేరు బావుందని కాదు దాని వెనుక భక్తి, సంస్కారం, స్మరణ, ఆశీర్వాదం అనే ముఖ్యమైన నాలుగు గొప్ప భావనలు ఉన్నాయ్. రామ, కృష్ణ, శివ, విష్ణు, నారాయణ, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గమేష్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్ ఇలాంటి పేర్లు పెట్టినప్పుడు ఆ బిడ్డను పిలిచిన ప్రతిసారీ అప్రయత్నంగా భవవంతుడిని స్మరించడమే. నిత్యం భగవంతుడి నామాన్ని పలకడం కూడా జపమే. అందుకే పిల్లలకు దేవుడి పేర్లు పెట్టమని ప్రోత్సహిస్తారు పెద్దలు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు
“యజ్ఞాలలో నేను జపయజ్ఞం”
అని చెబుతాడు..అంటే.. దేవుడి పేరు జపించడం ఎంతో పవిత్రమైన ఆరాధన అని. యజ్ఞం చేయాలంటే భారీ ఏర్పాట్లు కావాలి కానీ నామస్మరణకు పవిత్రమైన హృదయం చాలు. దేవుడి పేరు పదే పదే ఇంట్లో వినిపించడం అంటే ఆ ఇంట నిత్యం భగవన్నామస్మరణ జరుగుతున్నట్టే.
పురాణాల్లో భగవన్నామస్మరణ మహిమ
భాగవతంలో అజామిళుని కథ ఇందుకు ఉదాహరణగా చెబుతారు. అజామిళుడు ఎన్నో పాపాలు చేసి..తన కుమారుడిని నారాయణ అని పిలిచినంత మాత్రానే విష్ణులోకం పొందాడు. వాస్తవానికి చివరి నిముషాల్లో కూడా అజామిళుడు భగవంతుడిని ధ్యానించలేదు, పిలవలేదు.. కేవలం తన కొడుక్కి నారాయణ అనే పేరు పెట్టి పిలిచినంతమాత్రన ఈ భాగ్యం దక్కిందని భాగవతకథ చెబుతోంది. ఇందులో ముఖ్యమైన బోధన ఏంటంటే.. భగవంతుడి నామాన్ని తెలిసి పలికినా, తెలియక పలికినా దానివల్ల మనసు పవిత్రం అవుతుంది. అదే భాగవతంలో.. భగవంతుడి నామాన్ని నిర్లక్ష్యంగా పలికితే అది పాపక్షయానికి కారణం అవుతుందని ఉంది. పేరుకి తగ్గట్టు ప్రవర్తించకపోతే?
భక్తితో భగవంతుడి పేరు పెట్టడం వరకూ సరే.. మరి ఆ పేరుకి తగ్గట్టుగా ప్రవర్తించకపోతే అపచారం అవుతుందా? భగవంతుడిని అవమానించినట్టు అవుతుందా? ఆ పేరుని రకరకాలుగా పిలవడం మంచిది కాదా? వీటిని సమాధానం ఏంటంటే...దేవుడి పేరు పెట్టడం అంటే పిల్లలకు దేవతా గుణాలు నేర్పించడం, ఆ పేరు గొప్పతనం గురించి తెలియజేయడం.. రాముడి పేరైతే సత్యం ధర్మం, కృష్ణుడి పేరు పెడితే జ్ఞానం ప్రేమ కరుణ, శివుడి పేరు పెడితే శాంతి వైరాగ్యం దయ, దుర్గ అనే పేరు శక్తి ఇలా..వాటి అర్థాలు తెలియజేయాలి.
నామం అంటే సాధారణ శబ్ధం మాత్రమే కాదు!
నామం అంటే కేవలం సాధారణ శబ్ధం మాత్రమే కాదంటున్నాయ్ ఉపనిషత్తులు. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణ ద్వారానే సంసారాన్ని దాటవచ్చనే బోధ ఉంది. “హరే రామ హరే రామ, రామ రామ హరే హరే; హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే” అనే మహా మంత్రం చాలు.. సకల పాపాల నుంచి విముక్తి పొందడానికి అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. ఇది అత్యంత సులభమైన, శక్తివంతమైన మంత్రం.
విష్ణు సహస్రనామంలో భగవన్నామ మహిమ
భగవంతుడి నామ మహిమ గురించి విష్ణు సహస్రనామంలోనూ ఎంతో గొప్పగా చెప్పారు. మహాభారతం అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించినట్లు చెబుతుంది. ఇందులో భగవంతుని నామాలు కేవలం పేర్లు కాదు..అవన్నీ దవుడి గుణాలు, శక్తులు, తత్వాలు. అందుకే పిల్లలకు భగవంతుడి పేరు పెట్టడం అంటే ఆ బిడ్డ జీవితానికి మంగళకరమైన దిశను సూచించడమే.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
దేవుడి పేరు పెట్టినప్పుడు ఆ పేరును హేళనగా, కోపంతో, తిట్టేందుకు వినియోగించకూడదు. పిల్లలను మందలించాల్సి వచ్చినా అవమానకరంగా కాకుండా ప్రేమగా పలకాలి. దేవుడి పేరు పెడితే ఆ పిల్లలు భక్తులుగా మారిపోతారని కాదు..పేరు అనేది జీవితంలో ఓ మంచి విత్తనం లాంటిది. ఆ విత్తనానికి తల్లిదండ్రులు సంస్కారం, ప్రార్థన అనే నీరుపోస్తే మహావృక్షంగా పెరుగుతుంది.
పిల్లలకు భగవంతుడి పేర్లు పెట్టడం అనేది మూఢనమ్మకం కాదు..శాస్త్రసమ్మతం అయిన, ఆధ్యాత్మికమైన ఆచారం.
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.
