సాలగ్రామం (సాలిగ్రామం) గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సాలిగ్రామాన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిదని మన పెద్దలు చెబుతుంటారు. చాలా పవిత్రమైనదిగా, నియమ నిష్టలకు సంబంధించిన దైవంగా భావిస్తారు. అసలు సాలగ్రామం అంటే ఏమిటీ? దీన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎలాంటివి?
సాలగ్రామాన్ని రోజూ పూజించడం వల్ల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. దు:ఖాలు నశించి సుఖ సంతోషాలు లభిస్తాయని అంటారు. సాలగ్రామం నల్లని రాయిలా కనిపిస్తుంది. దీన్ని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తారు. సాలగ్రామ విగ్రహం గండకీ నదిలో లభించే రాయి. విష్ణువు మీద పూర్తి భక్తి విశ్వాసలతో వైష్ణవులు ఈ సాలగ్రామాన్ని ప్రతి రోజు పూజిస్తారు. సాలగ్రామాన్ని పూజించుకునే వారు సాత్వికాహారం తీసుకుంటూ సాత్వికమైన ఆలోచనలతో జీవితం సాగిస్తే ఆ పూజ ఫలప్రదం అవుతుందని నమ్మకం.
విష్ణు భక్తులకు సాలగ్రామ ఆరాధన మోక్షప్రదాయనిగా పరిగణిస్తారు. సాలగ్రామ పూజలో తులసి ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. శివ లింగానికి అభిషేకం చేసిన తర్వాత శివుడికి బిల్వపత్రాన్ని సమర్పిస్తే శివానుగ్రహ ప్రాప్తి లభిస్తుందన్నట్టుగానే సాలగ్రామ రూపంలో కొలువైన నారాయణుడికి తులసీ దళాన్ని సమర్పిండం ద్వారా ప్రసన్నుడిని చేసుకోవచ్చు.
సాలగ్రామ పూజ వల్ల సర్వరోగాలు నశించి ఆయురారోగ్యాలు కలుగుతాయి. దు:ఖాలు తొలగిపోయి ఆనందాలు సొంతమవుతాయి. అశాంతి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు తమ పూజా మందిరంలో సాలగ్రామాన్ని ప్రతిష్టించుకుని రోజు సేవించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. విష్ణుస్వరూపమైన సాలగ్రామాన్ని సూర్యుడు మకరంలో ప్రవేశించాక అంటే ఉత్తరాయణంలో మాఘ మాసంలో స్థిర లగ్నంలో ప్రతిష్టించుకోవచ్చు.
ముందుగా సాలగ్రామాన్ని శుభ్రమైన రాగి పాత్రలోకి తీసుకోవాలి. దానికి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత పంచామృతంతో అభిషేకించాలి. తర్వాత శుద్ధ జల స్నానం చేయాలి. తర్వాత సాలగ్రామానికి తులసీ దళాన్ని సమర్పించాలి. ఆ తర్వాత చందనం పూసి నేతి దీపం వెలిగించాలి. విష్ణుమూర్తికి ఇష్టమైన మిఠాయి, దక్షిణ సమర్పించుకోవాలి.
ఆ తర్వాత కర్పూర హారతితో నీరాజనం సమర్పించాలి. వీలును బట్టి ఒక పేదవాడికి అన్నదానం చేసి దక్షిణ ఇవ్వడం ద్వారా మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఆ తర్వాత సాలగ్రామాన్ని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ప్రతి రోజు దీనికి నీటితో అభిషేకం చేసుకొని, గంధం పూసి, తులసీదళాన్ని సమర్పించుకోవచ్చు. హారతి నీరాజనం, ప్రసాదం నైవేద్యంగా అర్పించి అది అందరికీ పంచాలి.
ఏదైనా ప్రత్యేక కోరిక తీరడం కోసం మీరు సాలగ్రామ పూజ చేస్తున్నట్టయితే పూజ అనంతరం ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. లేదా పురుషసూక్తం పఠించవచ్చు. లేదా వినవచ్చు. ఇలాచేస్తే తప్పకుండా మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. సాలగ్రామ పూజ చాలా శక్తిమంతమైందని నమ్మకం. దీన్ని పూర్తినమ్మకంతో, సమర్పణ భావంతో ప్రతిరోజూ పూజించుకునే వారికి ఎలాంటి లోటూ ఉండదని శాస్త్రం చెబుతోంది. వైష్ణవ ఆరాధాకులు సాలగ్రామ పూజను చాలా నియమనిష్టలోతో ప్రతిరోజు చేసుకుంటూ ఉంటారు. ఇది మోక్షానికి సులవైన మార్గంగా కూడా భావిస్తారు. సాలగ్రామం సాక్షాత్తు ఆ మహా విష్ణు ప్రతిరూపంగా పరిగణిస్తారు.
Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!