Vijaya Ekadasi 2026: శత్రు నాశనం, రుణ నివారణ, ఉద్యోగ-వ్యాపార విజయం ఈ వ్రతం చేయండి!
Vijaya Ekadasi Significance : మాఘమాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ రోజు విశిష్టత ఏంటి? ఈ వ్రతం ఆచరిస్తే ఫలితాలేంటి తెలుసుకుందాం

Vijaya Ekadasi 2026 Date: మాఘమాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ రోజు విశిష్టత ఏంటి? ఈ వ్రతం ఆచరిస్తే ఫలితాలేంటి తెలుసుకుందాం
విజయ ఏకాదశి శ్రీ మహావిష్ణువుని పూజించే వ్రతం. ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఈ పేరులో ఉన్న విజయం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెబుతారు. విజయ ఏకాదశి నియమాలు పాటిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, ధన ధాన్య సంపదలు, మానసిక బలం లభిస్తాయని స్కాంద పురాణం, పద్మపురాణాలు చెబుతున్నాయి. మాఘమాసంలో కృష్ణ పక్షంలో మహా శివరాత్రి ముందు వచ్చే ఏకాదశి వ్రతాన్ని శ్రీరాముడు లంకా విజయం కోసం చేశాడని పురాణ కథనం.
2026లో విజయ ఏకాదశి తిథి ఫిబ్రవరి 13 శుక్రవారం వచ్చింది
ఏకాదశి ఉపవాసం ఆచరించాలి అనుకుంటే దశమి రోజు రాత్రి నుంచి నియమాలు పాటించాలి.. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. ద్వాదశి ఘడియలు దాటిపోకుండా ఉపవాసం విరమించాలి.
విజయ ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత
శత్రువులు నశిస్తారు.. అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది, ఉద్యోగం వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు
పాపాలు నశిస్తాయి..మోక్షం సిద్ధిస్తుంది
అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆర్థిక పరిస్థితి బావుంటుంది, మానసిక శాంతి లభిస్తుంది
ఏ పని ప్రారంభించినా విజయం సిద్ధిస్తుంది
ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి. శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మిని, విష్ణువును పూజించాలి.
విష్ణు సహస్రనామం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ జపించాలి
పంచామృతాలు, క్షీరాన్నం, ఫలాలు సమర్పించాలి.
ఉపవాసం ఉండేవారు సాయంత్రం ఫలాలు తీసుకుని మర్నాడు ఉపవాస విరమణ చేయాలి
ఏకాదశి ఉపవాసం చేసినప్పుడు ఉప్పు , కారం కలసిన పదార్థాలు తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి.
విజయ ఏకాదశి మహత్యం గురించి శ్రీ కృష్ణుడు..ధర్మరాజుకి చెప్పాడు.. మాఘమాసంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి విజయం వరిస్తుంది, పాపాలు తొలగిపోతాయి
నారదముని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి విజయ ఏకాదశి విశిష్టత చెప్పమని అడగగా బ్రహ్మ ఇలా చెప్పారు
పేరులో చెప్పిన విధంగా ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను చేకూరుస్తుంది. శ్రీరాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేసినప్పుడు , సీతను రావణుడు ఎత్తికెళ్లిపోయినప్పుడు..రాముడు దిగులుతో సీతను వెతికే క్రమంలో జటాయువు ద్వారా సమాచారం తెలుసుకుంటాడు. తన సీత కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి వైకుంఠలోకాన్ని ప్రసాదించాడు రాముడు. సీతాదేవిని వెతికే క్రమంలో కంబందుడిని సంహరించాడు, సుగ్రీవుడితో స్నేహం చేశాడు, హనుమంతుడి ద్వారా సీత జాడ తెలుసుకున్నాడు. లంకా నగరానికి వెళ్లడం అంత సులువు కాదని గ్రహించి బలదలబ్య అనే రుషి వద్దకు చేరి సహాయం చేయమని అడిగారు. బలదలబ్య రుషి రామలక్ష్మణులను కుశలప్రశ్నలు వేసి అనంతరం...రామా నీకు ఉపవాస దీక్షను వివరిస్తాను, దీనిని ఆచరించడం ద్వారా విజయం తప్పక లభిస్తుందని చెప్పారు.
ఏకాదశి ముందు రోజు దశమి రోజు వెండి, ఇత్తడి, బంగారం లేదా మట్టి కుండలో నీరు పోసి నవధాన్యాలు , పుసుపు కుంకుమ వేసి కుండకి తోరణం కట్టాలి. దీనిని నారాయణుడి దగ్గర ఉంచి ఏకాదశి రోజు స్నానమాచరించి శ్రీ మహావిష్ణువు పూజ చేయాలి. కుండకు పసుపు, కుంకుమ, అక్షతలు వేసి నమస్కరించాలి. ఏకాదశి రాత్రంతా జాగరణ చేసి ద్వాదశి తిథి రాగానే ఆ కుండకి మరోసారి పూజ చేసి ఏదైనా నదిలో కలిపేయాలి. ఆ తర్వాత ఉత్తముడైన బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన తర్వాత నువ్వు భోజనం చేయాలి. ఇలా చేస్తే విజయం తథ్యం అని చెప్పారు బలదలబ్య రుషి. అలా విజయ ఏకాదశి వ్రతం ఆచరించి ఆ తర్వాత లంకకు చేరుకుని రావణ సంహారం చేశాడు రాముడు.
ఇలా విజయ ఏకాదశి వ్రతం ఆచరించి ఈ కథ వింటారో వారికి అశ్వమేథ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని నారదుడికి చెప్పారు బ్రహ్మదేవుడు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
























