జీవితంలో అందం, ఆనందం, సిరిసంపదలు అందించే అనేక విషయాలు సనాతన దర్మంలో వివరించారు. అదొక జీవన విధానం. వీటిని పాటించడం ఆనందమయ జీవితానికి సులువైన మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. రోజులో తొలి సంధ్య నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి సందర్భంలో పాటించాల్సిన నియమాలను, చిన్నచిన్న సంప్రదాయాలను గురించి చాలా విపులంగా వివరించారు. అందులో ఒకటి సంధ్యాదీపం.


దీపజ్యోతి పరబ్రహ్మ అని వేదం చెబుతోంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీప కాంతి జ్ఞాన సూత్రం. ఇది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనం చేసే ఏ కర్మకైనా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా సాగాల్సిన అవసరం ఉంటుంది. అందుకే దీపం వెలిగించకుండా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టరు. సంప్రదాయ బద్ధంగా నూనె దీపం వెలిగించడం అనేది ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించినపుడు దీప జ్వాల ఎల్లప్పుడు ఊర్ద్వముఖంగా సాగుతుంది. ఇది జ్ఞానం ఉన్నత స్థితికి దారి ఏర్పరుస్తుందనేందకు ప్రతీక. దీపానికి వాడే నెయ్యి లేదా తైలము మనలోని కోరికలకు ప్రతీక అయితే దీపంలో వేసే వత్తి అహంకారానికి ప్రతీక. అహంకారాన్ని కాల్చేసి, కోరికలను ఆవిరి చేయడానికి ప్రతీకగా దీపాన్ని వెలిగిస్తాము. దీప కాంతిలో భగవంతుని దర్శించడం గురువు ద్వారా దైవాన్ని తెలుసుకోవడం వంటిదని అర్థం. దీప కాంతిలో చేసే దైవ దర్శనం గురువుకు ఇచ్చే గౌరవంగా భావించాలి. అందుకే దీపానికి సనాతన ధర్మంలో అత్యంత ప్రాధాన్యత ఉంది.  


లక్ష్మీదేవికి ప్రీతి పాత్రం


ప్రతి రోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీ దేవి ప్రసన్నమవుతుంది. లక్ష్మీ దేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టవుతుంది. దేవి తప్పకుండా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడవు.


రాహు దోషం నుంచి విముక్తి



  • రోజూ సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల జాతకంలో ఉన్న రాహు దుష్ఫలితాలు తగ్గుముఖం పడతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ కూడా పారద్రోల బడుతుంది. ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి.

  • ప్రధాన ద్వారం దగ్గర నిత్యం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది. ఆఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అనారోగ్యాలు, కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది.

  • సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం దగ్గర సంధ్యా దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు. ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.


దీపం జోతి పరబ్రహ్మ దీపం సర్వం తమోపహ:


దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే


అజ్ఞానాన్ని హరించి, జ్ఞానాన్ని ఇచ్చి అన్నింటిని సిద్ధింప చేసుకొనే శక్తినచ్చే సంధ్యా దీపానికి ప్రణామాలు అని ఈ ప్రార్థన అర్థం.   


సైంటిఫిక్ రీజన్


ఇంటి ప్రదాన ద్వారం దగ్గర సంద్యా దీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంట్లోకి హానికారక కీటకాలు, పురుగులు వెలుగు ఉండడం వల్ల రావు. ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపును దీపం వెలిగించడం ఎప్పుడూ శుభప్రదం. ఈ దీపాన్ని నెయ్యితో లేదా నూనెతో వెలిగించవచ్చు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు. 


Also Read : ఈ సంకేతాలు ఎదుర‌వుతున్నాయా - అదృష్టం మీ ఇంటి త‌లుపు త‌ట్టిన‌ట్టే!