Tirumala Latest News: గతంలో స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేది కానీ ఇప్పుడు తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో నేరుగా పరీక్షలు నిర్వహించగలిగే విధంగా ల్యాబ్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు TTD చైర్మన్ బీ.ఆర్.నాయుడు.
ఇప్పటివరకు తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదు ఫస్ట్ టైమ్.. నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతాన్ని తక్షణమే విశ్లేషించే సామర్థ్యంతో కూడిన పరికరాలు ఏర్పాటు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. 75 లక్షలు విలువైన ఈ పరికరాలను గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) విరాళంగా ఇచ్చిందన్నారు. ల్యాబ్ సిబ్బంది, పోటు కార్మికులు మైసూర్‌లోని CFTRIలో ప్రత్యేక శిక్షణ పొందారని, ఇకపై స్వామివారి ప్రసాదాల నాణ్యతను ఇదే ల్యాబ్‌లో పరిశీలించి వెంటనే ఫలితాలు అందించేలా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.
ఇంకా... తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణానికి కమిటీ వేశామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో నిరంతరాయంగా అన్నప్రసాదం అందించనున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ వ్యయం రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచామమన్నారు. TTDలో 142 కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేశామని చెప్పారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు..ఈ మేరకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవకాశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో మౌలిక వసతులు పెంచేందుకు, ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ రూపొందించనున్నామని తెలిపారు. ఇతర దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ సమర్పించింది నివేదికపై TTD సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. భక్తులకు స్వచ్ఛంద సేవను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. శ్రీవారి భక్తులు సైబర్ మోసాలకు గురికాకుండా చూసుకునేలా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు. తిరుమల కళ్యాణకట్టలో మెరుగైన సౌకర్యాలు, పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకేచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలనా భవనం నిర్మించాలని నిర్ణయించారు. పాత బడిన హెచ్వీడీసీలోని 6 బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల సూచన మేరకు తొలగించాలనుకున్నారు. తాళ్లపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. వేద పారాయణదారులకు దేవదాయశాఖ ద్వారా నిరుద్యోగ భృతి చెల్లించేందుకు నిధులు మంజూరు చేసేందుకు ఆమోదించారు. వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే స్వామివారి ఆలయాలకు నిధులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేటగిరీల్లో మార్పులు చేశారు. మరోవైపు AP హైకోర్టు తీర్పు మేరకు TTDలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి ఆమోదానికి పంపించాలని నిర్ణయించారు.