Mahashivratri 2026: మహాశివరాత్రి ఆధ్యాత్మిక శోభ! తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమాలు - భక్తులకు అద్భుత అవకాశం!
TTD News: మహా శివరాత్రి సందర్భంగా తిరుపతిలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏఏ ప్రాంతాల్లో ఏ కార్యక్రమాలు జరుగుతాయో వివరంగా చూద్దాం...

Mahashivratri 2026: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15 ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలో ఉన్న మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి రోజు సాయంత్రం 06 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించున్నారు. ఈ సందర్భంగా HDPP, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో పలు ప్రదేశాల్లో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.
ఒకప్పుడు మహాశివరాత్రి వచ్చిందంటే చాలు.. సాయంత్రం అయ్యేసరికి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిపోయేవి. సాయంత్రం నుంచి రాత్రంతా జాగరణ, భజనలు, శివనామస్మరణ చేసేవారు. పెద్దలంతా పంచాక్షరి నామస్మరణలో మునిగితేలితే...పిల్లలంతా ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. పూర్వకాలం శివరాత్రి అంటే అదో పెద్ద వేడుక. ఈ మధ్యకాలంలో మిగిలిన రోజులకు శివరాత్రికి వ్యత్యాసం లేకుండా మారిపోయింది. అందుకే మళ్లీ అలాంటి రోజులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తిమార్గంవైపు నడిపించేందుకు..తిరుపతిలో పలు కేంద్రాల్లో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులంతా ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లింగోద్భవ సమయం వరకూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు , భజనలు నిర్వహించి.. అనంతరం ప్రసాద వితరణ చేయనున్నారు
తిరుపతి మహతి క్షేత్రం
ఎం.సరళ బృందంతో శివస్తోత్ర పారాయణం, జి. ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో పురాణ ప్రవచనం, జయంతి సావిత్రి నేతృత్వంలో భక్త శిరియాళ హరికథ, సి. హరనాథ్ ఆధ్వర్యంలో మోహినీ భస్మాసుర నృత్య రూపకం, సంప్రదాయ పాఠశాల విద్యార్థినుల ఆధ్వర్యంలో శివ భజనామృతం ఉంటుంది
కపిలతీర్థం
వి. ప్రసన్న లక్ష్మీ బృందం ఆధ్వర్యంలో శివస్తోత్ర పారాయణం,ఆముదాల మురళి ఆధ్వర్యంలో పురాణ ప్రవచనం, వై. వేంకటేశ్వర్లుచే సతీ తులసి హరికథ, సి. హెచ్. జగదీష్ ఆద్వర్యంలో లింగోద్భవ వైభవం నృత్య రూపకం, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆధ్వర్యంలో శివ భజనామృతం చేపట్టనున్నారు.
అన్నమాచార్య కళామందిరం
జి. ఇందిరారాణి బృందంతో శివస్తోత్ర పారాయణం, వి. నిర్మలా బాయ్ తో పురాణ ప్రవచనం, సి.హెచ్. అజయ్ కుమార్ బృందం ఆధ్వర్యంలో పార్వతి పరిణయం నృత్య రూపకం, జె. కృష్ణ కుమారితో పార్వతి పరిణయం హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులుచే శివ భజనామృతం కార్యక్రమాల నిర్వహిస్తారు
రామచంద్ర పుష్కరిణి
జె. రాజకుమారి బృందంతో శివస్తోత్ర పోరాయణం, కె. నారాయణ రావు తో పురాణ ప్రవచనం, సి. సాయి కిషోరి బోస్ ఆధ్వర్యంలో శివ లీలలు నృత్య రూపకం, ఎం. రాముడు ఆధ్వర్యంలో భక్త కన్నప్ప హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులచే శివ భజనామృతం నిర్వహిస్తారు.
శివ పంచాక్షరి స్తోత్రం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమః శివాయ ॥
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ" కారాయ నమః శివాయ ॥
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై "శి" కారాయ నమః శివాయ ॥
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమః శివాయ ॥
యజ్ఞ-స్వరూపాయ జటాధరాయ [యక్ష-]
పినాక హస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమః శివాయ ॥
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥























