Tirumala : భక్తులందరికీ సంతృప్తికరంగా తిరుమల బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం స్థానిక అన్నమ్మయ్య భవన్ లో ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ వల్ల రెండేళ్లుగా నాలుగు మాడవీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేక పోయామని, కానీ ఈసారి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు తిరుమల నాలుగు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.  


బ్రహ్మోత్సవాల నిర్వహణ 


 సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌ 26న రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుందన్నారు. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేషవాహన సేన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయని, అయితే గరుడ వాహన సేవ రాత్రి 7 నుంచి తెల్లవారుజామున  2 గంటల  వరకు నిర్వహిస్తామన్నారు.  అక్టోబర్‌ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, అదేవిధంగా రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తామన్నారు. 


సామాన్య భక్తులకు పెద్ద పీట 


శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించిందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.   భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనం వంటి ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేశామన్నారు. ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు రద్దు చేశామని స్పష్టం చేశారు. వసతి గదులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచామన్నారు. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోనే గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేశారు.  


1342 ఆలయాల నిర్మాణం  


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1342 ఆలయాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మొదటి దశలో 502 ఆలయాల నిర్మాణం పూర్తయిందన్నారు. ఇక్కడ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నామని వివరించారు. రెండో దశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో 111 ఆలయాలను నిర్మిస్తున్నామని చెప్పారు.  టీటీడీ అగరబత్తులను భక్తులు విశేషంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. పంచగవ్య  ఉత్పత్తులు, అగరబత్తుల విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని గోశాల అభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. 


హైదరాబాద్ లో వేంకటేశ్వర వైభవోత్సవాలు 


"తిరుమలకు వచ్చే భక్తులందరూ స్వామివారికి జరిగే నిత్య, వారోత్సవాలు, సేవలు తిలకించడం సాధ్యంకాదు. వయోభారం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనేక మంది స్వామివారిని ఎక్కువ సార్లు చూసి తరించే అవకాశం ఉండదు. భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో  నిర్వహించే నిత్య, వార సేవలు , ఉత్సవాలు ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టీటీడీ పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తోంది. ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు నెల్లూరులో వైభవోత్సవాలు నిర్వహించాం. అక్టోబరు 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్‌ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తాం" - టీటీడీ ఈవో ధర్మారెడ్డి