Golden Temple-style law in Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం  పవిత్రతను కాపాడటంతో పాటు, పాలనలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తొలగించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమలకు కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత, పాలకమండలి నియామకాలపై అనేక వివాదాలు తలెత్తుతున్నందున టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకుండా అడ్డుకట్ట వేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. స్వర్ణ దేవాలయాన్ని నిర్వహిస్తున్న  శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ  తరహాలో టీటీడీకి పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పించే చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వాలు మారినా ఆలయ పవిత్రతకు, సంప్రదాయాలకు విఘాతం కలగకుండా ఉంటుంది.

Continues below advertisement

ఏమిటి ఈ స్వర్ణ దేవాలయ చట్టం? 

పంజాబ్‌లోని సిక్కుల పవిత్ర క్షేత్రమైన స్వర్ణ దేవాలయం నిర్వహణను 1925 నాటి  సిక్కు గురుద్వారా చట్టం ద్వారా పర్యవేక్షిస్తారు. ఈ చట్టం ప్రకారం, గురుద్వారాల నిర్వహణ బాధ్యతను రాజకీయ నాయకుల చేతుల్లో కాకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన సిక్కు ప్రతినిధుల  చేతుల్లో ఉంచుతారు. ఈ కమిటీకి సంబంధించి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. కమిటీ సభ్యులు కేవలం మతపరమైన అంశాలు, సామాజిక సేవ, ఆధ్యాత్మిక అభివృద్ధిపైనే దృష్టి సారిస్తారు.

Continues below advertisement

రాజకీయ జోక్యానికి శాశ్వత పరిష్కారం 

ప్రస్తుత టీటీడీ చట్టం ప్రకారం, పాలకమండలి సభ్యులను ప్రభుత్వం నియమిస్తోంది. దీనివల్ల అధికార పార్టీకి చెందిన నాయకులు, వ్యాపారవేత్తలు బోర్డులో చోటు సంపాదిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కానీ స్వర్ణ దేవాలయ తరహా చట్టం అమలులోకి వస్తే, టీటీడీ బోర్డు సభ్యులు ఎన్నికల ద్వారా లేదా నిర్ణీత అర్హతలు ఉన్న ఆధ్యాత్మిక వేత్తల ద్వారా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల రాజకీయ ఒత్తిళ్లకు తావుండదు.  పారదర్శకత పెరుగుతుంది.

 నిధుల వినియోగం - పారదర్శకత 

స్వర్ణ దేవాలయ కమిటీ తన నిధులను కేవలం విద్య, వైద్యం,   మత ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తుంది. నిధుల వ్యయంపై కఠినమైన ఆడిటింగ్ ఉంటుంది. తిరుమలలో కూడా భక్తులు సమర్పించే కానుకలు ఇతర ప్రభుత్వ అవసరాలకు కాకుండా, కేవలం ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు ,  సనాతన ధర్మ ప్రచారానికే వాడేలా కఠిన నిబంధనలు ఈ కొత్త చట్టంలో చేర్చే అవకాశం ఉంది. ఇది టీటీడీ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది.

 నిపుణుల కమిటీ కసరత్తు 

స్వర్ణ దేవాలయ చట్టం ఏపీలో అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం న్యాయ నిపుణులు , ఆధ్యాత్మికవేత్తలతో కూడిన కమిటీని నియమించే ఆలోచనలో ఉంది. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల నిర్వహణ విధానాలను అధ్యయనం చేసిన తర్వాత, ఏపీ కేబినెట్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. దేవాలయం పట్ల అచంచలమైన భక్తి, నిబద్ధత ఉన్నవారే బోర్డులో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.   కేవలం పరిపాలన మార్పులకే పరిమితం కాకుండా, లడ్డూ తయారీలో వాడే ముడి పదార్థాల సేకరణ నుండి దర్శనం వరకు ప్రతి స్థాయిలోనూ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ చట్టం ఆచరణలోకి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలకు తిరుమల ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.