Akshaya Tritiya Shopping Time : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు ప్రధానంగా జరుపుకునే పండుగ అక్షయ తృతీయ. ఇది వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ నాడు చేసుకునే పండుగ. మూహుర్తంతో సంబంధం లేకుండా ఈరోజులోని ప్రతి నిమిషం పవిత్రమైందే. అందుకే ఈ రోజున కొత్తగా ఏదైనా పని ప్రారంభించడాన్ని శుభసూచకంగా భావిస్తారు. ఈరోజు మొదలు పెట్టిన పని విజయవంతంగా ఉంటుందని నమ్మకం. ఈరోజున ప్రత్యేకంగా కుబేరుడు, లక్ష్మీ నారాయణులకు పూజలు చేస్తుంటారు. కొంత మంది దానధర్మాలు కూడా చేస్తారు. గొడుగు, చెప్పులు, బట్టలు, అన్నదానం చెయ్యడం వల్ల ఈరోజు చేసన పాపాలు క్షయమై పుణ్యకార్యాలు అక్షయంగా నిలుస్తాయని ప్రతీతి. శుభకార్యాలు చెయ్యడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.  అందుకే ఈ రోజున కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం, ఆస్తులు కొనుగోలు చెయ్యడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు.


ఈ ఏడాది ఏప్రిల్ 22 శనివారం నాడు ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఈ రోజున బంగారం కొనుగోలు చెయ్యడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీ ప్రతీక అయిన బంగారం ఈరోజున ఇంట్లోకి తెచ్చుకుంటే అది లక్ష్మీదేవికి పలికే స్వాగతంగా భావిస్తారు. అదీ కాక ఈరోజు ఏపనిచేస్తే ఏడాదంతా ఆ పని చేస్తుంటారని నమ్మకం. అందువల్ల కూడా ఇవ్వాళ బంగారం కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కొంత మంది ఆస్తులు కొనుగోలు చేస్తారు. మరికొందరు షేర్స్ లో కూడా పెట్టుబడి పెడతారు.


అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి కొన్ని ప్రత్యేకమైన మంచి సమయాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. ధృక్పాంచాంగాన్ని అనుసరించి అక్షయ తృతీయ నాడు రోజులో సూచించిన ప్రత్యేక సమయాల్లో  బంగారం కొనుగోలు చెయ్యవచ్చు. ఇలా బంగారం కొనుగోలు చేస్తే శుభప్రదం అని ఈ పంచాగం చెబుతోంది. ఆసమయాలను తెలుసుకుందాం. 



  • ఉదయ ముహూర్తం (శుభ) – ఉదయం 7.49 గం. నుంచి 09-23 గం. వరకు

  • మధ్యాహ్న ముహూర్తం (చర,లాభ, అమృత) మధ్యాహ్నం 12.33 గం. నుంచి 5.18 గం. వరకు

  • సాయంత్ర ముహూర్తం (లాభ) 6.53 గం. నుంచి 08.18 గం. వరకు

  • రాత్రి ముహూర్తం (శుభ, అమృత, చర) 09.43 గం. నుంచి 01.58 గం (ఏప్రిల్ 23)

  • ప్రదోశ ముహూర్తం (లాభ) 04.48 గం. నుంచి 06.13 గం. వరకు (ఏప్రిల్ 23)


అక్షయ తృతీయ జరుపుకునేది శనివారమే అయినప్పటికీ తెల్లవారి ఆదివారం ఏప్రిల్ 23 న కూడా బంగారం కొనుగోలు చెయ్యవచ్చు. ఆదివారం రోజున ఉదయం 6.13 గం. నుంచి 07.4గం. వరకు బంగారం షాపింగ్ చేసేందుకు అనువైన కాలంగా చెప్పవచ్చు. ఈ సమయాల్లో షాపింగ్ చేసుకుని లక్ష్మీదేవికి మీ ఇంట్లోకి స్వాగతం పలకండి. 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


Also Read: అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా? దానం చెయ్యాలా?