శ్రావణ మంగళగౌరీ వ్రతకథ పూర్వం ధర్మపాలుడను ఒక వైశ్యుడు ఉండేవాడు. అత్యంత ధనవంతుడు, భక్తివంతుడైన తనకి పెళ్లి జరిగింది కానీ సంతానం కలుగలేదు. భార్యతో కలసి ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఓ రోజు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చారు. ధర్మపాలుని భార్య బంగారు పళ్లెంలో బిక్ష తీసుకొచ్చింది.. కానీ ఆ సాధువు ఆ భిక్షను స్వీకరించకుండా వెళ్లిపోయాడు. కారణం ఏంటో చెప్పమని అడిగగా ... పిల్లలు లేని ఇంట భిక్షస్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపస్సు చేయమని చెప్పి వెళ్లిపోయాడు. ఆ సాధువు సూచనల మేరకు ఆ దంపతులు చేసిన తపస్సుకి ప్రశన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడగు పుత్రుడు కలుగగలడని వరమిచ్చి, ఊరిబయట ఉన్న ఆలయము వద్ద మామిడి చెట్టుకి ఉన్న ఒకే ఒక ఫలము నీ భార్యకు ఇవ్వు అని చెప్పెను. సరే అని చెప్పిన ధర్మపాలుడు ఆ వృక్షము వద్దకు వెళ్ళి అత్యాశతో చాలా ఫలాలు మూటగట్టుకుని వచ్చాడు. కానీ పరమేశ్వరుడు ఆజ్ఞాపించనట్టు ఆ మూడలో ఒక్క ఫలమే మిగిలింది. అదే భుజించింది ధర్మపాలుడి భార్య. వారికి ఓ పుత్రుడు జన్మించాడు. వారదత్తుడనే పేరు పెట్టి పెంచి పెద్దవాడిని చేశారు. ఓ రోజు తల్లిదండ్రులు బాధపడుతుండగా కారణం ఏంటని అడిగాడు వారదత్తుడు. పరమేశ్వరుడు ఇచ్చిన వరంతో పాటూ అల్పాయుర్దాయము గల విషయమును చెప్పారు. యమభటులు వచ్చి తీసుకెళ్తారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదివిన్న వారదత్తుడు అమ్మా నేను బ్రతికి ఉండగనే కాశీయాత్ర చేసి వస్తానని చెప్పి మేనమామతో కలసి కాశీయాత్రకు వెళ్లిపోయాడు.
కాశీకి వెళుతున్న మార్గమధ్యలో ఓ నగరానికి చేరుకుని అక్కడ పూతోటలో బసచేశారు.ఆ పూతోటలో సుశీల అనే రాజకుమారి తన చెలికత్తెవతో ఆడుకునేందుకు వచ్చింది. మధ్యలో తగవు వచ్చి ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. విధవా అని తిట్టుకున్నారు. స్పందించిన సుశీల తన ఇంట తన తల్లి మంగళకరమైన గౌరీ దేవీ వ్రతము చేసి తనకు వాయనం ఇచ్చింది..ఆ వ్రతమహిమతో తన ఇంట వైధవ్యము ఉండదని చెప్పింది. ఇదివిన్న వారదత్తుడి మేనమమా తన మేనల్లుడికి సుశీలను ఇచ్చి వివాహం చేస్తే మంచిదని భావించి..ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి వివాహం చేశాడు. వివాహం జరిగిన రోజు సుశీల మంగళగౌరి దేవి పూజ చేసింది. ఆ రాత్రి సుశీల కలలో గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేను సర్పంతో ప్రాణగండం ఉందని చెప్పింది. సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త సమీపంలో సర్పం కనిపించింది. ఆ పాముని పట్టుకున్న సుశీల తన తల్లి వాయనం ఇచ్చిన మట్టికుండలో బంధించి మూటగట్టింది. తెల్లవారేసరికి వారదత్తుడి మేనమామ వచ్చి తనతో పాటూ కాశీకి తీసుకెళ్లాడు. సుశీల లేచి తన భర్త కనబడుటలేదనే విషయాన్ని తలిదండ్రులకు చెప్పింది. పాముని ఉంచిన కుండ తెరిచి చూడగా అందులో ముత్యాల హారం కనిపించింది. తల్లిదండ్రులు తనకు మారు వివాహం జరిపించేందుకు చేసిన ప్రయత్నాలు తిరస్రించి తన భర్తకోసం వేచి చూస్తానని చెప్పింది. మంగళగౌరీ పూజచేయుచూ బాటసారులకు అన్నదానం చేస్తూ తాంబూలం ఇస్తూ ఉండేది.
ఏడాది గడిచేసరికి కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగివస్తూ సుశీల ఉన్న నగరంలో బసచేశాడు. ఆ రాత్రి కలలో మంగళగౌరీ దేవి యమభటులతో యుద్ధం చేసి ఓడించినట్టు కనిపించింది. ఈ కలను తన మేనమామకు చెప్పగా..ఆ మంగళగౌరి నీ అపమృత్యు దోషాన్ని పోగొట్టిందని చెప్పాడు. ఆ మర్నాడు జరుగుతున్న అన్నదానంలో వారదత్తుడిని చూసి సుశీల గుర్తుపట్టింది. అల్లుడిని గుర్తుపట్టిన సుశీల తల్లిదండ్రులు సకల మర్యాదలు చేసి సుశీలను సారెతో పాటూ అత్తవారింటికి సాగనంపారు. అత్తవారింట అడుగుపెట్టిన సుశీల.. తన అత్తమామలు అంధులయ్యారని తెలిసి..శ్రావణ మంగళవారం నోము చేసుకున్న కాటుక వారికి పెట్టగా దృష్టి వచ్చింది. మంగళగౌరి దేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇదంతా జరిగిందని గ్రహంచి అప్పటి నుంచి శ్రావణమంగళగౌరివ్రతాన్ని ఆచరిస్తూ అంతా సుఖసంతోషాలతో వర్థిల్లారు. సుశీల వంటి పతివ్రత వల్ల వారదత్తుడి ప్రాణం నిలిచిందని గ్రహించిన బంధువులంతా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించారు.
శ్రావణ మంగళగౌరి వ్రతకథా సంపూర్ణం |
ప్రార్థనశ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం యః పూజయే చేతసాసంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాన్మనః చిత్తాంభోరుహమంటపే గిరిసుతా నృత్తం విధత్తే రసా--ద్వాణీ వక్త్రసరోరుహే జలధిజా గేహే జగన్మంగళా పుత్రాన్దేహి ధనం దేహి సౌభాగ్యం సర్వమంగళేసౌమాంగళ్యం సుఖం జ్ఞానం దేహి మే శివసుందరీ
క్షమాప్రార్థనమంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ తత్సర్వం క్షమ్యతాం దేవి కాత్యాయని నమోఽస్తు తే సర్వం శ్రీమంగళగౌరీ దేవతార్పణమస్తు
అనయామయా కృతపూజయా శ్రీమంగళగౌరీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదాభవతుమమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు
వాయనదాన శ్లోకం కాత్యాయనీ శివా గౌరీ సావిత్రీ సర్వమంగళా సువాసినిభ్యో దాస్యామి వాయనాని ప్రసీదతు