Spirituality:  ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు   మూడో రోజు నుంచి 11 రోజుల వరకూ కాకులకు పిండాలు పెడతారు. ఆ తర్వాత ఏడాది గడిచేవరకూ నెలకోసారి మాసికం, ఆ తర్వాత ఏడాదికోసారి తద్దినం పెడతారు. ఇవేమీ తెలియని వారు పుష్కరాల్లో (ప్రస్తుతం గంగా పుష్కరాలు జరుగుతున్నాయి) పిండ ప్రదానం చేస్తారు. ఇలా చేస్తే పెద్దల ఆత్మ శాంతిస్తుందని..ఆత్మ ఇహలోకం నుంచి పరలోకం చేరుతుందని విశ్వసిస్తారు. ఇంతకీ పిండాలను కాకులకే ఎందుకుపెడతారన్నదే ఇప్పుడు చర్చ.


Also Read: ఇంటి ముందు కాకులు గుంపులుగా అరుస్తున్నాయా? ఏం జరుగుతుందో తెలుసా?


పిండాలను కాకులకే ఎందుకు పెడతారు


సాధారణంగా కాకులు వాలితే దోషమని, కాకి  తంతే అరిష్టం అని భయపడతారు. మరికొందరైతే కాకి ఇంటిముందు అరిస్తే చుట్టాలొస్తారని నమ్ముతారు. ఇవన్నీ మూఢ నమ్మకాలా, నిజాలా అన్నది పక్కనపెడితే చాలామంది విశ్వసిస్తారన్నది మాత్రం నిజం. చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని నమ్మకం. అందుకే వారిని తలుచుకుని కాకికి పిండం పెడతారని అంటారు. కాకులు పూర్తిగా తింటే మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని.. ఒకవేళ కాకులు ముట్టుకోకుంటే వారి కోరికలు ఏవో మనం నెరవేర్చలేదని, అందుకే అసంతృప్తితో ఉన్నారని భావిస్తారు. 


Also Read: ఒక్క స్తోత్రంతో పేదరాలి ఇంట బంగారువర్షం కురిపించిన ఆది శంకరాచార్యులు


కాకికి యముడు ఇచ్చిన వరం


రావణుడి అరాచకాలకు భయపడిన దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో  జంతువులోకి ప్రవేశించారట. తొండలోకి కుబేరుడు,  లేడి లోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, యుముడు కాకిలోకి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలోంచి బయటు వచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు.



  • లేడికి వళ్లంతా కళ్లున్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు..అందుకే లేడి ఒళ్లంతా కళ్లున్నట్టు కనిపిస్తుంది

  • వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా ఫించం ఇచ్చాడు వరుణుడు

  • కాకికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. ఇక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు. అప్పటి నుంచీ పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

  • రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తుంటారు, కాకులకి ఆహారం పెడితే నీ పూర్వికులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు, రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది.


పక్షులకు ఆహారం అందించాలన్న పరమార్థం


పితృకర్మలు, కర్మకాండల సమయంలోనే కాకుండా మిగిలిన సమయంలో కూడా పక్షులకు ఆహారం అందించాలంటారు పెద్దలు. అప్పట్లో కాకులు ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా ఎవరి పెరట్లో చూసినా కాకులే ఎక్కువగా ఉండేవి. అందుకే పిండాలు కాకులకు పెట్టేవారు.


నీటిలో ఎందుకు వదులుతారు


పిండాలను నీటిలో కూడా వదులడం చూస్తుంటారు..ముఖ్యంగా సినిమాల్లో ఇది ఎక్కువగా చూపిస్తుంటారు..ఎందుకంటే నీటిలో ఉండే జలచరాలకి ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం. 


హిందూ ధర్మంలో ప్రతి ఆచారం వెనుక సైన్స్ తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయంటారు పెద్దలు.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.