దేవాలయం  పవిత్రమైన స్థలం. ఒక ప్రశాంత మందిరం.. ఆలయంలోకి అడుగుపెట్టగానే బాధలన్నీ మరచిపోయి భక్తులు ఆ దేవుని సన్నిధిలో తన్మయత్వం పొందుతారు. శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయం ఓ శక్తి కేంద్రం. ఆలయంలో ఎల్లప్పుడూ పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుంటాయి. అందువల్ల ఆలయం ఉన్న చోట, గుడినీడ ఇంటిపై పడే చోట ఇల్లు కట్టుకోకూడదంటారు శాస్త్రం తెలిసిన వారు.  కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు అందుకే  పురాతన గుళ్ల చుట్టూ పెద్ద ప్రహరీగోడలు నిర్మించి ఉంటాయి. అయితే గుడి సమీపంలో నివాస స్థలాలు  ఉంటే కొంత మంచి, కొంత చెడు రెండూ ఉంటాయంటాయంటాయి ప్రాచీన గ్రంధాలు.


గుడికి ఆనుకుని లేదా గుడి నీడ పడేలా ఇల్లు ఉంటే...



  • గుడికి ఆనుకొని ఏ ఇల్లు ఉండకూడదు. ఒకవేళ గుడికి దగ్గర ఇల్లు ఉంటే ఆ కుటుంబలో కలహాలు చోటు చేసుకుంటాయి

  • ఏ ఆలయానికి దగ్గరలో తీసుకున్నా కనీసం 200 అడుగుల దూరంలో ఉండేలా ఇల్లు తీసుకుంటే మంచిది

  • ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భ గుడిలో మూల విరాట్టు విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి

  • వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు, విష్ణు ఆలయాలకు ముందు వైపు ఇల్లు ఉండొచ్చట

  • శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రు భయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని పండితులు చెబుతారు

  • అమ్మవారి ఆలయానికి దగ్గర్లో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు, ఏ కార్యక్రమంలోనూ పురోగతి సాధించరని చెబుతారు

  • విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఉత్తరాన, వాయువ్యంలో ఉంటే అక్కడ ఉన్న వారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

  • ఏ ఆలయానికి అయినా కనీసం 100 అడుగుల దూరం తప్పనిసరి అని చెబుతారు వాస్తు పండితులు

  • ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదంటారు. దేవుడి ధ్వజము శక్తి సంపన్నం, ఉగ్రరూపం అందుకే ధ్వజస్తంభం ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది.


అందుకే పూర్వకాలంలో పర్వతాలు, నదీతీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి. పర్వతంపై దేవాలయాన్ని నిర్మించడం ఉత్తమం. నదుల వద్ద నిర్మిస్తే ఫలితం మధ్యమం. గ్రామం, నగరంలో అధమం అని మహర్షులు శ్లోక రూపంలో చెప్పారు. 


ఇప్పటికే ఆలయాల నీడ పడేచోట ఇల్లు ఉంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు.. వాస్తు పండితుల సలహామేరకు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుందంటారు. మరో విషయం ఏంటంటే...ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయ బద్ధంగా ఆలయాన్ని నిర్మిస్తారు. బీజాక్షరాలతో కూడిన దేవతా యంత్రాన్ని, అత్యంత పవిత్రమైన విగ్రహాన్ని గుళ్లో ప్రతిష్ఠిస్తారు. ఆలయాల్లో నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అయితే ఇళ్లలో అప్పుడప్పుడు అశుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం ఆలయ పవిత్రతపై, గుడికొచ్చే భక్తులపై పడొద్దనే ఉద్దేశంతో కూడా గుడి నీడ ఇంటిపై పడొద్దని చెబుతారు.