Solar Eclipse 2025 : గ్రహణం ఏర్పడే సంఘటనను మతపరంగా, జ్యోతిష్య శాస్త్రపరంగా, శాస్త్రీయంగా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. గ్రహణం గురించి ఆసక్తి కొందరికి ఉంటే..భయం కొందరికి ఉంటుంది.
సూర్య గ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది .. చంద్ర గ్రహణం పౌర్ణమి తిథి నాడు ఏర్పడుతుంది. అందువల్ల, పౌర్ణమి లేదా అమావాస్య తిథి వచ్చినప్పుడల్లా, ఈ పౌర్ణమి లేదా అమావాస్య నాడు ఏదైనా గ్రహణం ఉందా అని తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఉంటారు.
నవంబర్ 19 లేదా 20న సూర్య గ్రహణం ఏర్పడుతుందా?
నవంబర్ 19 20 తేదీల్లో కార్తీక అమావాస్య ఉంది. నవంబర్ 19 న ఉదయం 08.33 వరకూ చతుర్థశి తిథి ఉంది. అంటే బుధవారం మాస శివరాత్రి. అమావాస్య తిథి సూర్యోదయానికి ఉన్న రోజు నవంబర్ 20 గురువారం. ఈ రోజు ఉదయం పదిన్నర గంటల వరకూ అమావాస్య తిథి ఉంది. అయితే పితృకార్యాలు నిర్వహించేవారు, తర్పణాలు విడిచేవారు మధ్యాహ్నం తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి నవంబర్ 19న అమావాస్య నియమాలు పాటిస్తారు. కార్తీకమాసం చివరి రోజు అంటే మాత్రం నవంబర్ 20 గురువారమే. ఈ రోజుతో కార్తీకమాసం పూర్తవుతుంది.
అమావాస్య తిథి స్నానం, దానం, పూజలు ఇవన్నీ నవంబర్ 20నే ఆచరిస్తారు. కార్తీక అమావాస్య రోజు స్నానం ఆచరించేందుకు ముఖ్యమైన సమయం వేకువజాము 05.01 నుంచి 05.54 వరకు. ఇంతకీ సూర్య గ్రహణం ఉందా?
కార్తీక అమావాస్య నాడు అంటే నవంబర్ 19 లేదా 20న ఎటువంటి గ్రహణం ఏర్పడటం లేదు. నవంబర్ 19న సూర్యుడు నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి పరివర్తనం చెందుతున్నాడు. సూర్య భగవానుడు...తన పుత్రుడైన శని దేవుడి నక్షత్రం అయిన అనూరాధ లోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ మొదటివారం వరకూ ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. కార్తీకమాసం ఆఖరి రోజు అమావాస్య మాత్రం నవంబర్ 20 గురువారమే. ఈ రోజు ఎలాంటి గ్రహణం ఏర్పడడం లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు ప్రతి అమావాస్య నాడు గ్రహణం ఎందుకు ఏర్పడదు?
సూర్య గ్రహణం అమావాస్య రోజున మాత్రమే ఏర్పడుతుంది. కానీ ప్రతి అమావాస్య నాడు సూర్య గ్రహణం ఏర్పడదు. దీనికి కారణం ఏంటంటే, చంద్రుని కక్ష్య భూమి కక్ష్య తలం నుంచి దాదాపు 5 డిగ్రీల వంపు కలిగి ఉంటుంది. అందువల్ల చాలా సమయం చంద్రుని నీడ భూమి పైన లేదా క్రింద నుంచి వెళుతుంది. సూర్య గ్రహణం ఏర్పడటానికి అవసరమైన సరైన అమరిక జరగదు. సూర్య, చంద్రుడు .. భూమి ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మాత్రమే సూర్య గ్రహణం ఏర్పడుతుంది, ఇది ప్రతి అమావాస్య నాడు జరగదు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?
'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన 'చినమస్తా దేవి' ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?