Rajahmundry Devi Chowk Dasara Celebrations:  ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో " దేవి చౌక్ " దసరా వేడుకలకు పెట్టింది పేరు. ప్రతీ ఏటా ఇక్కడ జరిగే దసరా వేడుకల పేరు మీదుగా ఆ ఏరియాకు  "దేవి చౌక్" అనే పేరు వచ్చింది. ప్రస్తుతం దేవి చౌక్ లో దసరా  ఉత్సవాలు 90వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాయి.. అంటే 90 ఏళ్ల నుండి ఇక్కడ దసరా ఉత్సవాలు  జరుగుతూ వస్తున్నాయి. 


ఒకప్పుడు రాజమహేంద్రవరం లోని ఈ  ప్రాంతానికి " మూడు లాంతర్ల జంక్షన్ " అనే పేరు ఉండేది. పూర్వకాలంలో  ఆ లాంతర్ల లో నూనె పోసి దీపాలు వెలిగించి ఆ వెలుతురులోనే దసరా జరుపుకునే వారట.అయితే 1934లో  రాజమండ్రి కి చెందిన బత్తుల మల్లికార్జునరావు, మునియ్య అనే అన్నదమ్ములు మూడు లాంతర్ల జంక్షన్లో  దసరా రూపురేఖలే మార్చేశారు. నూనె దీపాల స్థానం లో కరెంట్ లైట్లు వచ్చాయి. రోడ్లు కూడా విశాలమయ్యాయి. అక్కడ దసరా సమయంలో మూడు వేదికలు ఏర్పాటు చేసేవారట. ఒక వేదికపై బుర్రకథ, హారికథ లాంటి కార్యక్రమాలు, మరో వేదికపై  నాటకాలు జరిపితే మూడో వేదికపై భోగం మేళాలు నిర్వహించేవారట.


Also Read: దాండియా నృత్యాలతో కలర్ ఫుల్‌గా సాగే గుజరాతీ దసరా "గర్బా"


1963లో కలకత్తా నుంచి పాలరాతి తో తయారుచేసిన  చిన్న  సైజు బాలా త్రిపుర సుందరి విగ్రహాన్ని ఈ మూడు లాంతర్ల జంక్షన్లో  ప్రతిష్టించారు. ఆరోజు నుంచి  ఆ ప్రాంతం పేరు "దేవీ చౌక్ "గా మారిపోయింది. ఆ తర్వాత "దేవిచౌక్ " లో " భోగం మేళాలు" మానేశారు. అలాగే మూడు వేదికలకు  ఒకే వేదిక పై నాటకాలు వేయడం మొదలుపెట్టారు.



సినీ స్టార్స్ నాటకాలు ఆడిన ప్రాంతం 


 "దేవిచౌక్" వద్ద  దసరా రోజుల్లో నాటకం లో పాత్ర వేస్తే పెద్ద స్టార్ అయిపోతారని ఒక నమ్మకం ఉండేదట. అందుకే ఆ టైంలో మద్రాస్ నుంచి వచ్చి మరీ సినిమా వాళ్ళు ఇక్కడ నాటకాల్లో చిన్న పాత్ర అయినా వేసి వెళ్లేవారట. అలాంటి వారిలో  నట సామ్రాట్ అక్కినేని  నాగేశ్వరరావు, గిరిజ, SV రంగారావు, రేలంగి,గుమ్మడి, జి. వరలక్ష్మి లాంటి మేటినటులు ఉన్నారు.


ఇక్కడ దసరా ఉత్సవాల్లో  ప్రత్యేకంగా ఆహ్వానం పొంది సత్కారాలు అందుకున్న వారిలో సావిత్రి,- జెమిని గణేషన్, అంజలీదేవి - ఆది నారాయణ రావు,రాజ సులోచన-సి ఎస్ రావు దంపతులు ఉండడం విశేషం. అప్పట్లో ఇక్కడ వేదికపై రాజసులోచన నాట్యం చేస్తూ ఉండగా స్టేజ్ కూలిపోవడంతో ఆమె కింద పడిపోయి  కాలు విరిగింది.  అయినప్పటికీ కోలుకున్న తర్వాత మరుసటి ఏడాది తిరిగి వచ్చి  ఆమె మళ్ళీ నాట్యం చేయడం దేవి చౌక్ లోని  దసరా ఉత్సవాలను సినీ నటులు ఎంత సీరియస్ గా తీసుకునేవారో చెప్పుకోవచ్చు. 


Also Read: దేవీ నవరాత్రి ఆరో రోజు మహాలక్ష్మీ దేవిగా విజయవాడ కనక దుర్గమ్మ .. ఈ అలంకారం పరమార్ధం ఏంటంటే!



70వ దశకం తర్వాత  రద్దీ దృష్ట్యా సినీ నటులు దేవి చౌక్ లో ప్రదర్శనలు ఇవ్వడం తగ్గించారు. ఆ స్థానంలో  రికార్డింగ్ డాన్స్ లు ఊపందుకున్నాయి. కాకినాడ, రాజమండ్రి, నరసాపురం  లాంటి ప్రాంతాల్లో ఉండే రికార్డింగ్ డాన్స్ ట్రూపులు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చేవి. ఆ బృందాల్లోని హీరోల డూపులకు కూడా ఎంతో క్రేజ్ ఉండేది. టీవీల రాకతో  వాటి జోరు తగ్గినా ఇప్పటికీ  రాజమండ్రి "దేవిచౌక్ " లో జరిగే దసరా వేడుకలకు గోదావరి జిల్లాల్లో  పెద్ద క్రేజే ఉంది. చిన్ని గుడికి  ఈ స్థాయిలో ఉత్సవాలు జరగడం చాలా అరుదని  అంటుంటారు స్థానికులు.