Pitru Paksha Telugu News: గణపతి ఉత్సవాలు ముగిసిపోయాయి. ఇక పితృపక్షాలు మొదలవుతాయి. ఈ పితృపక్షాల కాలాన్ని వంశంలోని పూర్వీకుల ఆశీస్సులను ఆశిస్తూ వారిని సంతృప్తి పరిచేందుకు అనువైన సమయంగా చెప్పవచ్చు. మరి పితృదేవతల ఆశీస్సులు లభించాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి పూజలు జరపాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పితృ పక్షాలను ప్రతి సంవత్సరం 16 రోజుల పాటు జరుపుకుంటారు. వంశంలో మరణించిన కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు గాను శ్రాధ్ధ కర్మలను నిర్వహించి తర్పణలు విడుస్తారు. ఈ సంవత్సరం పితృ పక్షాలు సెప్టెంబర్ 17 న ప్రారంభమై ఆక్టోబర్ 2 న ముగుస్తున్నాయి. ఈ సమయంలో పితృదేవతలను తృప్తి పరిచేందుకు, ఇంట్లోని ప్రతికూలతలను తొలగించుకునేందుకు తప్పకుండా చెయ్యాల్సిన కొన్ని పరిహారాల గురించి పండితులు వివరిస్తున్నారు.
పరిశుభ్రత
పితృపక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఇంటిని పూర్తి స్థాయిలో శుభ్రం చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది. శుభ్రమైన ఇంట్లో పితృదేవతల శక్తి ప్రసారానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతాయి. మురికిగా లేదా వస్తువులు గజిబిజిగా పడేసి ఉన్న ఇంట్లో ప్రతీకూల శక్తి పేరుకు పోతుంది. సంవత్సరంలోని ఈ పక్షకాలంలో వంశంలోని పూర్వీకూలైన పితృదేవతలు భూమిని సందర్శిస్తున్నారన నమ్మకం. కాబట్టి వారికి స్వాగతం పలికేందుకు అనువైన వాతావరణాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి.
కొన్ని వాస్తు చిట్కాలు
ఇంటి నైరుతి మూలను పితృస్థానంగా భావిస్తారు. అంటే ఈ దిశలో పితృదేవతలు కొలువుంటారని నమ్మకం. పితృదేవతల ఆశీస్సులను ఆశీస్తూ వారికి శాంతిని అందించేందుకు ప్రతిరోజూ సాయంత్రం ఈ దిశలో ఒక దీపం వెలిగించడం మంచిది. మీ పూర్వీకులను తలచుకొని వారిని ప్రార్థిస్తూ, వారి కోసం కొంచెం సమయం పాటు ధ్యానం చేస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి.
శ్రాద్ధ సమయానికి చిట్కాలు
శ్రాద్ధం, తర్పణ ఆచారాలను నిర్వహించే సమయంలో మీరు తప్పనిసరిగా అది దక్షిణాభిముఖంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. దక్షిణం వైపు ఈ పక్షకాలంలో పొరపాటున కూడా కాళ్లు ఉంచి పడుకోకూడదు.
పితృపక్షాల సమయంలో ఆవు, కాకి, కుక్కకు ఆహారం ఇవ్వాలి. ఆవులు, కాకులు, కుక్కల వంటి జంతువులకు ఆహారం అందించడం పితృకార్యాలలో ఒకటిగా సనాతన ధర్మం భావిస్తుంది. ఈ పక్షకాలం పాటు ఇంట్లో వండిన ఆహారంలో కొంత తప్పకుండా కాకులకు,కుక్కలకు తప్పకుండా పెట్టాలి.
పూర్వీకుల ఆత్మ శాంతికై వారి జ్ఞాపకార్థం ఏదైనా సేకవా కార్యక్రమం నిర్వహించవచ్చు.
ఇంటి మరణించిన పెద్దలను తలచుకుని వారి శ్రేయస్సుకై పేదలకు, బ్రాహ్మణులకు, అవసరంలో ఉన్నవారికి వీలైనంత దానం చెయ్యాలి.
వీలైన వారు ఏదైనా నదీ పరివాహక ప్రాంతంలో పితరుల ఆత్మ శాంతి కోసం తర్పణలు వదలవచ్చు.
చాలా మంది పూర్వీకుల గౌరవార్థం ఇంట్లో లేదా ఏదైనా పుణ్య క్షేత్రంలో తప్పకుండా పిండప్రధానం కూడా చేస్తారు.
మరి కొంత మంది ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు.
మొత్తానికి ఈ 16 రోజుల పాటు పితృదేవతలను తృప్తి పరిచేందుకు రకరకాల పద్ధతులను మన శాస్త్రాలు సూచించాయి. వాటిలో మీకు అనువైనవి ఎంచుకుని పాటించడం లేదా మీ కుంటుంబ ఆచారాలను అనుసరించి ఆ కర్మలను నిర్వహించడం చాలా అవసరం.