వైష్ణవులు తమ దేవుడి గొప్ప అంటూ.. శైవులు తమ దేవుడే గ్రేట్ అంటూ వాదించుకుంటారు. అయితే పురాణాలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. శివుడు, విష్ణువు వేరు వేరు కాదని చెబుతూనే ఒకరు స్థితి కారుడైతే మరొకరు లయ కారుడిగా అభివర్ణించాయి.
శివుడి నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ ఆవిర్భివించారని శివపురాణం చెబుతోంది. బ్రహ్మ సృష్టి ప్రారంభిస్తే, విష్ణువు ఆ సృష్టిని నడిపితే, శివుడు దాన్ని అంతం చెస్తాడని సృష్టి, స్థితి, లయలకు వీరు అధిదేవుళ్లని పురాణాలు ఘోషిస్తున్నాయి. దీని అర్థం దేని నుంచైతే ఆవిర్భివించామో తిరిగి అక్కడికే చేరడం పూర్తి జీవిత సారం.
పోతన వంటి మహా విష్ణు ఆరాధకుడు భాగవత రచనలో చిన్ని కృష్ణుడిని అభివర్ణిస్తూ చిన్నారి కృష్ణుడు ఒళ్లంతా మట్టి పూసుకుంటే విభూతి ధరించిన శివుడి వలే ఉన్నాడని, కొప్పువేసి ముత్యాల సరాలు ఆ కొప్పుకు చుట్టినపుడు చంద్ర వంక సిగను ధరించిన ఈశ్వరుని పోలి ఉన్నాడని, నీలమణి హారం మెడలో ధరించిన తర్వాత నీలకంఠుని తలపింపజేస్తున్నాడని రాసుకున్నాడు. నిజమైన భక్తిలో జీవితాలను తరింప జేసుకున్న వారికి వారిరువురిలో పెద్దగా తేడాలు కనిపించలేదు.
శివోహం
శివుడు స్మాశాన వాసి, శరీరమంతా భస్మం పూసుకుని ఉంటాడు. జడలు కట్టిన జుట్టుతో, మూడు కన్నులు కలిగి ఉండే రూపం ఈరూపంలోనే ఎన్నో జీవన సందేశాలున్నాయి. చివరకు చేరేది స్మశానానికే అనేది ఆయన ఆవాసం తెలిపితే, ఎంత గొప్పగా బతికినా చివరకు మిగిలేది గుప్పెడు బూడిదగానే ఆయన ధరించే భస్మం తేటతెల్లం చేస్తుంది. ఆయన మూడు కళ్లు సూర్య, చంద్ర, అగ్నికి ప్రతీకలు, సూర్యుడు ఆరోగ్యానిక, చంద్రుడు జీవ కళలకు, అగ్ని తేజో గుణానికి ప్రతీకలు. ఈ మూడు ప్రతి మనిషిలో ఉండాలనేందకు సూచనలు.
అర్థ భాగాన్ని అమ్మవారికి పంచి అర్థనారీశ్వరుడైనాడు. దీని ద్వారా లింగబేధాలు వ్యర్థమైనవని తెలియజేస్తున్నాడు. నందిని అధిరోహించి జీవితం ప్రతి క్షణం ఆనంద వాహనం మీద సాగాలని బోధిస్తున్నాడు. సర్పాలు మెడలో ధరించి కష్టాలు, అపాయాలు జీవితంలో సాధారణమని వాటికి భయపడి పారిపోకూడదని, సర్పాలను ధరించి నిబ్బరంగా ఉండడం ద్వారా శివుడు ఆ విషయాలను బోధిస్తున్నాడు. మహా తపస్వి శంకరుడు. ఆయన తపస్సులో మనం చేసే ప్రతీ పని ఒక తపస్సులా చెయ్యాలనేది సందేశం.
విశ్వమే విష్ణువు
మెజారిటీ హిందువుల ఆరాధ్య దైవం విష్ణువు. రకరకాల రూపాలలో, రకరకాల అవతారాలలో సకల మానవాళి శ్రేయస్సుకోసం యుద్దాలు చేసి లోకాలను కాపాడిన వాడిగా ఆయన స్థానం ప్రత్యేకం. సృష్టి అంతటా వ్యాపించిన వాడు విష్ణువు. దశావతారాల వెనుక గొప్ప వైజ్ఞానిక భావన, ఎంతో విజ్ఞానం ఉన్నాయి. అసలు ఈ అవతారాల్లోనే సృష్టి మూల స్వరూపం దాగి ఉంది. అంతటా వ్యాపించి ఉన్నది విశ్వం, అదే మనకు విష్ణు స్వరూపం. అందుకే విష్ణువును అనంత శయనుడిగా అభివర్ణిస్తారు. కనుక విష్ణువే విశ్వము, విశ్వమే విష్ణువు. కనిపించని వ్యాపన రూపం అవతారం దాల్చి కనిపించడమే అవతార లక్ష్యం. అందుకే విశ్వరూపం చూపగలిగే వాడు విష్ణువు.
విష్ణువు నాభి నుంచి వచ్చిన కమలం నుంచే బ్రహ్మ అవతరించాడు. అంటే సృష్టిమూలం విష్ణువు నుంచే ప్రారంభమైందనేందుకు ఇదొక ప్రతీక. అదే అనంత పద్మనాభ స్వామి స్వరూపం. విష్ణు పాదాల చెంత ఉండే లక్ష్మీ దేవి ప్రకృతిలోని పాంచభౌతిక శక్తి, ఇహలోకంలో మనం అనుభవించే అన్ని ఐశ్వర్య, సౌఖ్యాలకు ప్రతీక. విష్ణు పాదల చెంతనే ఏ సౌఖ్యమైనా అని తెలిపే సంకేతం. మనకు నివాస యోగ్యమైన ఈ విశ్వాన్ని ఆరాధించే విధానమే విష్ణువుకు చేసే నిత్య సేవ. ఇలా శివకేవులిద్దరూ వేర్వేరు కారు, కలిసి సకల చరాచర సృష్టిని నడుపుతున్న శక్తిస్వరూపాలు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.