Nellore News : ఆలయాలయినా, దర్గాలయినా, ఇతర ప్రార్థనా మందిరాలయినా.. రోడ్డుకి, రైల్వే ట్రాక్ కి అడ్డుగా వస్తే.. వాటిని కాస్త పక్కకు జరపాలని ప్రయత్నిస్తుంటారు. నిర్వాహకులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ అలాంటి ప్రయత్నం చేసినా సాధ్యపడకపోవడంతో నెల్లూరులో రైల్వే ట్రాక్ రూట్ నే మార్చేశారు. నెల్లూరు రైల్వే స్టేషన్ చివరిలోనే ఈ దర్గా ఉంటుంది. రైల్వే ట్రాక్ కి అడ్డుగా ఉందని ఆనాటి బ్రిటిషర్లు దర్గాని తరలించే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. దీంతో వారే పక్కకు తప్పుకున్నారు. దర్గాకు అటు, ఇటు రైల్వే ట్రాక్ లను ఏర్పాటు చేశారు. దర్గా మాత్రం ఈ రెండు ట్రాక్ ల మధ్య ఇలా మిగిలిపోయింది. 




హజరత్ సయ్యద్ మొహిద్దిన్ షావలి ఖాదరి దర్గా. కేవలం రైల్వే ట్రాక్ ల మధ్య ఉండటమే కాదు, దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. భూమికి సుమారు 15 అడుగుల లోతులో ఈ దర్గా ఉంటుంది. దర్గా లోపలికి వెళ్లాలంటే మెట్లు దిగి కిందకు వెళ్లాలి. భూమిపైకి చాలా చిన్నదిగా కనిపించే ఈ దర్గా.. లోపల మాత్రం పెద్దదిగా కనిపిస్తుంది. భూమి లోపలే సమాధులుంటాయి. ఆ సమాధులపై పవిత్ర వస్త్రాన్ని పరుస్తారు. దీపాలు వెలిగిస్తారు. భక్తులు లోపలికి దిగి వెళ్లి సమాధులను దర్శించుకుని వస్తుంటారు. 



నెల్లూరు పెన్నా నది దాటిన వెంటనే రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యే దగ్గర ఈ దర్గా ఉంటుంది. నెల్లూరు ప్రతిష్టాత్మక రంగనాయకుల స్వామివారి గుడికి అతి సమీపంలోనే ఈ దర్గా ఉంటుంది. ఇక్కడి రైల్వే గేట్ ని రంగనాయకుల గేట్ అంటారు. రైల్వే గేట్ ద్వారా వెళ్లే రోడ్ దర్గా ముందునుంచి వెళ్తుంది. బ్రిటిష్ వారు రైల్వే ట్రాక్ వేయడానికి ముందే ఇక్కడ సయ్యద్ మొహిద్దీన్ షావలి ఇక్కడ చిన్న స్థావరం ఏర్పాటు చేసుకుని భక్తులకు ఆశీస్సులు ఇస్తుండేవారని అంటారు. కాలక్రమంలో ఆయన సమాధిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ సమాధిని దర్శించడానికి వచ్చే భక్తులు ఇక్కడ మొక్కుకుంటారు. తమ కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ దర్గాను దర్శిస్తుంటారు. ప్రతి ఏడాదీ గంధ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. 



విశేషాలివే?


దర్గా పక్కనే రైల్వే గేట్ ఉంటుంది. రైల్వే గేట్ అంటే ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరగకమానదు. కానీ ఇక్కడ దర్గాను దర్శించుకోడానికి వచ్చేవారెప్పుడూ ఈ రైల్వే గేట్ వద్ద ప్రమాదానికి గురి కాలేదని చెబుతుంటారు. అసలీ గేట్ వద్ద ప్రమాదాలు కూడా ఎప్పుడూ జరిగిన సందర్భాలు లేవంటారు. దర్గా 15 అడుగుల లోపల ఉన్నా కూడా వర్షం పడినప్పుడు చుక్కనీరు లోపల నిలబడదని చెబుతుంటారు దర్గా పీఠాధిపతులు. పెన్నా నదికి వరదలు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాలు నీటమునిగినా దర్గా వద్దకు మాత్రం నీరు రాదు. అదే ఇక్కడి మహిమగా చెబుతుంటారు. పిల్లలు లేనివారు ఈ దర్గాకు వచ్చి వెళ్లిన తర్వాత సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడివారి నమ్మిక. ఈ దర్గాకు సమీపంలోనే.. షావలి వంశస్ధుల సమాధులున్నాయి. దర్గాను దర్శించిన భక్తులు.. షావరి వంశస్థుల సమాధులను సందర్శించడం ఆనవాయితీ. రైల్వే ట్రాక్ ల మధ్య, భూమిలోపలికి ఉన్న ఇలాంటి అరుదైన దర్గా బహుశా మనదేశంలో నెల్లూరులో మాత్రమే ఉంది.