Shiva: శివాలయాన్ని సందర్శించే భక్తులు శంకరుడి ముందు కళ్లమూసుకుని నిలబడి ప్రార్థించి.. ఆ తర్వాత నంది కొమ్ముల మధ్యనుంచి దర్శనం చేసుకుని.. నంది చెవిలో గుసగుసలాడుతారు. తమ మనసులో ఉండే కోర్కెలు నంది చెవిలో చెబితే..భోళా శంకరుడు తీర్చుతాడని భక్తుల విశ్వాసం. ఈ సంప్రదాయం ఎంతోకాలం నుంచి కొనసాగుతోంది. 

Continues below advertisement

ఓసారి శివుడు , పార్వతి, నంది ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో జలంధరుడు అనే రాక్షసుడు పార్వతిని అపహరించాలని ప్రయత్నం చేశాడు. ఈ చర్య ముందుగానే తెలుసుకున్న వినాయకుడు తండ్రికి చెప్పాలి అనుకున్నాడు. కానీ వినాయకుడు, ఇతర దేవతలు ఎవ్వరూ కూడా ధ్యానంలో ఉన్న రుద్రుడి దగ్గరకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. అప్పుడు నంది చెవిలో ఆ విషయం చెబితే కచ్చితంగా శివుడిని చేరుతుందని భావించాడట వినాయకుడు. అలా జలంధరుడి విషయం నంది ద్వారా శివుడికి చేరవేశాడు వినాయకుడు, అప్పటి నుంచి నందిచెవిలో ఏం చెప్పినా శివయ్యను చేరుతుందనే నమ్మకం బలపడిందనే పురాణ కథ ప్రచారంలో ఉంది

నంది చెవిలో చెబితే కోర్కెలు నిజంగా నెరవేరుతాయా?

Continues below advertisement

ఆధ్యాత్మిక దృక్పథంలో చూస్తే ఇందులో లోతైన అర్థం దాగిఉంది. నంది శివుడి వాహనం మాత్రమే కాదు పరమేశ్వరుడికి అత్యంత సన్నిహిత భక్తుడు, ద్వారపాలకుడు, నమ్మకమైన దూత. పురాణాల ప్రకారం నంది..శివుడు ధ్యానం చేసే సమయంలో భక్తుల ప్రార్థనలు అందించే మద్యవర్తి. సదా ధ్యానంలో మునిగిఉండే శివుడికి భంగం కలిగించకుండా భక్తులను నిరాశపర్చకుండా ఆ సందేశాలను నంది చేరవేరుస్తాడని నమ్మకం. 

ఆధ్యాత్మికంగా చూస్తే నంది..జీవాత్మకు ప్రతీక. ఎప్పుడూ శివుడివైపే చూస్తూ కనిపించే నంది ఏకాగ్రతకు ప్రతీక. 

మన కోర్కెలు నంది చెవిలో చెప్పడం అంటే.. మన అస్థిరమైన మనస్సును స్థిరమైన భక్తి వద్ద ఉంచి దైవసన్నిధికి సమర్పించడమే

శివుడు అగ్నితత్వం..ఆయన ధ్యానం లోకకళ్యాణం కోసం.. అందుకే భక్తులు నేరుగా ఆయన్ను భంగపరచకుండా నందిద్వారా సందేశం పంపించడం సంప్రదాయమైన మర్యాద. నంది కథ అత్యంత ప్రేరణాత్మకం.. ఎందుకంటే నంది మొదట్లో సాధారణ జీవి. కానీ శివుడి పట్ల అపారమైన భక్తి, సేవ, విధేయతతో దైవిక స్థాయికి ఎదిగాడు. శివుడు నందిని తన వాహనంగా, గురువుగా, సహచరుడిగా ఆశీర్వదించాడు. నిజమైన భక్తి, సమర్పణతో ఏ జీవి అయినా దైవ సన్నిధికి చేరవచ్చని సూచించే పాఠం ఇది.

నంది చెవిలో కోర్కెలు చెబితే నెరవేరుతాయా అంటే అది రహస్యంగా, భక్తితో చేయాలి. పరీక్ష పెట్టేందుకో, యాంత్రికంగానో చేస్తే ఆ కోర్కె నెరవేరదు. పూర్తి విశ్వాసంతో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ చర్య మనలో అహంకారాన్ని వదిలించి..దైవంపై ఆధారపడడానికి సహాయపడుతుంది. మన కోర్కెలు నెరవేరడం అంటే ఆచారం మాత్రమే కాదు..కర్మ, ప్రయత్నం, సమయం దైవానుగ్రహంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనసును శాంతపరిచి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది విజ్ఞానం, ఆధ్యాత్మికత కలయిక. నమ్మకం మన మనసును బలోపేతం చేసి కోర్కెలు సాధించడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ హందూ ధర్మం ప్రకారం భక్తి ద్వారా మనం దైవంతో ఏకం అవుతాం. నంది అనే గురువుద్వారా శివతత్వాన్ని అర్థం చేసుకుంటాం.  

ఆధ్యాత్మికవేత్తలు చెప్పేదేంటంటే.. నిజమైన ఫలితం భక్తి, నిస్వార్థ సేవ, ధర్మం నుంచి వస్తుంది. కోరిన కోర్కెలు నెరవేరడం అంటే ఆ కోర్కెలను దైవం చేతుల్లో పెట్టడం ద్వారా మనం పొందే శాంతి, సంతృప్తి గొప్పది.  

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.