Mahabharat: అర్జునుడి పేరెత్తితే పిడుగుల భయం పోతుందా..
అర్జునుడిని తలుచుకుంటే భయ పారిపోతుందా
అర్జునుడికి పిడుగులకు ఏంటి సంబంధం..అంటే..మహాభారతంలో ఓ సందర్భాన్ని చెప్పుకోవాలి
అర్జునః ఫాల్గుణః పార్థా కిరీటీ శ్వేతవాహనా
బీభత్స విజయః కృష్ణ సవ్యసాచి ధనుంజయః “
ఇవన్నీ అర్జునుడి బిరుదులే. ఇవి పిడుగు పడినప్పుడే కాదు భయాందోళనలు కలిగినపుడు కూడా జపించవచ్చు. మహాభారతం లో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది.
పాండవులు అరణ్యవాసం పూర్తైన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాటరాజు కొలువులో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ అజ్ఞాతవాసాన్ని గడుపుతుంటారు. విరాటుడి కొలువులో అర్జునుడు విరాట మహారాజు కూతురికి నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు. పాండవులు అక్కడ ఉన్నారని తెలుసుకుని వారి అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి విరాటరాజు రాజ్యంపై దండయాత్ర చేస్తారు. అప్పుడు ఉత్తరకుమారుడు యుద్ధానికి బయలుదేరగా..బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు రథసారథిగా వ్యవహరిస్తారు. అయితే కౌరవ సైన్యం లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు ఉత్తరుడు. అప్పుడు ఉత్తరుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి..శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకు రమ్మని చెబుతాడు.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
అప్పటికే పూర్తిగా భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు. నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు. అర్జునుడికి కిరీటి, సవ్యసాచి, ఫాల్గుణ, పార్థ, విజయుడు ఇలా ఎన్నో నామాలున్నాయి.. ఒకదాని తరవాత ఒకటి, అర్జునుడు తన నామాల వెనక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు.
- గాండీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారని
- ఎంతటి వీరుడి నైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అంటారని
- దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరీటి అంటారని
- కుంతీ దేవి అసలు పేరు పృథ.. ఆమెకు జన్మించడం వలన పార్ధ అంటారని
- ఉత్తర ఫల్గునీ నక్షత్రం - పూర్వ పాల్గుని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల తనని ఫాల్గుణ అంటారని అర్జునుడు తన నామాలకు అర్ధాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడికి అర్థమయ్యేలా చెప్పి భయం పోగొడతాడు.
- ఫాల్గుణ నామం వెనుక ఉన్న అర్థం ఇదే. ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే ఆ ప్రభావం, ఆ భయం ఉండదని ధైర్యం వస్తుందని చెబుతారు.
Also Read: మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.