Mahabharat Hidden Facts In Telugu

Continues below advertisement

ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో మహాభారత గమనం మారిపోయింది. మహాభారతంలో మహిళ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా అందరకీ ద్రౌపది మొదటగా గుర్తొస్తుంది కానీ..మేం చెబుతున్నది ద్రౌపది గురించి కాదు..

సత్యవతి, యోజన గంధి, మత్స్య గంధి...ఈ పేర్లు గుర్తున్నాయా?

Continues below advertisement

మహాభారత గమనాన్ని మార్చేసిన అతిముఖ్యమైన పాత్ర ఇది 

పడన నడిపే మత్సకార కుటుంబం నుంచి మహాసామ్రాజ్ఞి వరకూ..

మహాభారతం వెనుకున్న నిజమైన శక్తి సత్యవతి

ఎవరీ సత్యవతి?

దాసరాజు అనే మత్స్యకారుడు, పడవనడిపే వ్యక్తి కుమార్తె సత్యవతి. యమునా నదిలో పడవ నడుపుతుంటాడు దాసరాజు. తండ్రికి సహాయంగా ఉంటుంది సత్యవతి. ఓ రోజు పరాశర మహర్షి నదిని దాటేందుకు వస్తారు. దాసరాజు అప్పుడే భోజనానికి కూర్చోవడంతో కుమార్తెను పడవ నడపమని చెప్పి పంపిస్తాడు. నది మధ్యలోకి వెళ్లేసరికి సత్యవతి అందానికి మోహితుడవుతాడు పరాశర మహర్షి. వారిద్దరికీ జన్మించిన వ్యక్తే వ్యాస మహర్షి. ఆయనే అష్టాదశ పురాణాలు రచించిన వేద వ్యాసుడు. మహాభారతానికి మూలపురుషుడు. పుట్టగానే తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోతాజడు. అయితే.. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని తల్లికి మాటిస్తాడు. 

శంతనమహారాజుతో సత్యవతి వివాహం

పరాశర మహర్షి, వ్యాసుడు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ తండ్రితో పాటూ పడవనడిపే పనిని కొనసాగిస్తుంది సత్యవతి.  ఓ రోజు వేటకు వచ్చిన శంతనమహారాజు సత్యవతిని చూసి వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అప్పటికే శంతనమహర్షికి గంగాదేవితో వివాహం, అష్ట వసువుల జననం, వారిని నదిలో పడేయడం , ప్రశ్నించిన శంతనుడి చేతిలో ఆఖరి కుమారుడిని పెట్టేసి వెళ్లిపోవడం..ఇదీ కథ. ఆ కుమారుడే భీష్ముడు (శంతనుడు-గంగాదేవి- సత్యవతి-భీష్ముడు వీరి గురించి మహాభారతంలో ఏముందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి). శంతనుడికి-గంగకు జన్మించిన భీష్ముడికి కాకుండా.. తన కుమార్తె సత్యవతితో జన్మించిన సంతానానికి రాజ్యపాలన అప్పగించాలని షరతు విధిస్తాడు దాసరాజు. శంతనుడు సంకోచించినా తండ్రికోసం భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుగా బాధ్యతలు తీసుకోను అని మాటిస్తాడు. అలా సత్యవతి-శంతనమహారాజు వివాహం జరుగుతుంది.

చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడి జననం

శంతనుడు-సత్యవతికి... చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మిస్తారు. శంతనుడి మరణం తర్వాత చిత్రాంగదుడు సింహాసనం అధిష్టిస్తాడు. గంధర్వరాజులతో జరిగిన భీకరయుద్ధంలో ఈయన మరణించడంతో.. విచిత్రవీర్యుడు రాజ్యపాలన బాధ్యతలు చేపడతాడు. కాశీరాజు సంతానం అయిన అంబ, అంబాలికను వివాహం చేసుకుంటాడు. భోగాల్లో మునిగితేలి కొంతకాలానికి మరణించాడు విచిత్రవీర్యుడు. 

మహాభారత కథలో కీలక మలుపు

తనయులు ఇద్దరూ మరణించడంతో పాలనా బాధ్యతలు చేపట్టమని భీష్ముడిని అడుగుతుంది సత్యవతి. సవతి తల్లి మాటను నిరాకరించిన భీష్మడు తాను చేసిన ప్రతిజ్ఞను గుర్తుచేస్తాడు. అప్పుడిక తన మొదటి సంతానం అయిన వేద వ్యాసుడి గురించి చెబుతుంది సత్యవతి. తల్లి తలుచుకోగానే ప్రత్యక్షమైన వేదవ్యాసుడికి హస్తినాపుర భవిష్యత్ మొత్తం నీ చేతుల్లో ఉందని చెబుతుంది.  నియోగ సంప్రదాయం ప్రకారం వంశాన్ని కొనసాగించమని తనయుడిని కోరుతుంది సత్యవతి. వ్యాసుడు మొదట సంకోచించినప్పటికీ, తన తల్లి ఆజ్ఞను పాటించడానికి , రాజ్య శ్రేయస్సు కోసం అంగీకరిస్తాడు. రాణి అంబికను మొదట వ్యాసుని వద్దకు పంపుతుంది సత్యవతి. వ్యాసుని కఠినమైన సన్యాసి రూపాన్ని చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంటుంది... ఫలితంగా ఆమెకు అంధుడు జన్మిస్తాడు..ఆయనే ధృతరాష్ట్రుడు. ఆందోళన చెందిన సత్యవతి..అంధుడైన రాజు సరిగా పాలించలేడని భావించి మరో కుమారుడి జననం అవసరం అని చెబుతుంది. అంబాలికను పంపగా..వ్యాసుడి రూపం చూసి అంబాలిక ముఖం పాలిపోవడంతో.. పాండు రాజు జన్మిస్తాడు. అంధపుత్రుడికి జన్మనిచ్చిన అంబికకు మరో సంతానం కావాలని కోరుకుంటుంది సత్యవతి. అయితే అంబిక బదులు దాసి వెళుతుంది. ప్రశాంత హృదయంతో వ్యాసుడిని స్వీకరించిన దాసికి జన్మించిన వాడే విదురుడు

 ధృతరాష్ట్రుడు బలవంతుడుపాండురాజు గొప్ప యోధుడు విదురుడు రాజనీతి, ధర్మంపై తనకున్న జ్ఞానంతో ప్రసిద్ధి చెందాడు. 

హస్తినాపురం భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమని సత్యవతి భావించింది.ఆ తర్వాత ధృతరాష్ట్రుడి సంతానం కౌరవులు, పాండురాజు సంతానం పాండవులు. అలా సత్యవతి నిర్ణయం, వ్యాసుడి జననం - పునరాగమనం...ముగ్గురి జననం మహాభారత కథకు మూలం అయ్యాయ్.  

 సత్యవతి లేకపోతే?

మహాభారత కథలో సత్యవతి లేకపోతే.. భీష్ముడు రాజయ్యేవాడు, ధృతరాష్ట్రులు-పాండురాజు-విదురుడు జన్మించేవారే కాదు. పాండవులు కౌరవులు లేకపోతే మహాభారత యుద్ధం, భగవద్గీత లేనే లేదు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.