Maha Shivaratri 2023: అర్థ-నారి-ఈశ్వర..అంటే సగం స్త్రీ-సగం పురుషుడు....ఇద్దరూ కలిస్తే అర్థనారీశ్వరుడు. ఆధునిక శాస్త్ర పరిశోధన చెబుతున్నది ఏంటంటే పదార్థం-చైతన్యం కలయికే సృష్టి. రెండింటినీ తీసుకుని చక్కనైన దేవతా స్వరూపాలను కల్పన చేసుకుని ఆరాధిస్తాం. అదే అర్థనారీశ్వర తత్వం. అయితే ఫొటోల్లో చూస్తుంటే రెండు ముక్కలు కలిపినట్టు దేహం కనిపిస్తుంది. మనకు క్లియర్ గా అర్థం అయ్యేందుకు ఇలా రూపకల్పన చేశారు కానీ అర్థనారీశ్వర తత్వం అంటే స్త్రీ-పరుషులు కలసి ఒక్కటే అనే అర్థం. అంటే భర్త ప్రవర్తన, అవసరం, ఆపదను ముందుగానే గ్రహించి ఆయనకు అనుకూలంగా మారడమే అర్థనారీశ్వర తత్వం అని చెబుతున్నాయ్ పంచభూతలింగాలు కొలువైన క్షేత్రాలు. 


Also Read: మహాశివరాత్రి రోజు ఉపవాసం-జాగరణ చేసేవారు చేయాల్సినవి, చేయకూడనివి


అరుణాచలం- అగ్నిలింగం
ఇక్కడ స్వామివారు ఆగ్రహంతో ఉంటారు అందుకే అమ్మవారు అత్యంత శాంత స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. 


జంబుకేశ్వరం- జలలింగం
ఇలా అంటే అలా కరిగిపోయేంత శాంతస్వరూపంతో ఉంటారు స్వామివారు. అందుకే ఇక్కడ అఖిలాండేశ్వరిగా కొలువైన అమ్మవారు ఆగ్రహంగా ఉంటారు. స్త్రీ ఆగ్రహం తగ్గాలంటే అది కేవలం పిల్లల వల్లే సాధ్యం..అందుకే అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఎదురుగా తన తనయుడైన వినాయకుడి విగ్రహం ఉంటుంది. 


కంచి - పృథ్వి లింగం
ఇక్కడ సైకత లింగాన్ని అమ్మవారు ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది. అంటే సున్నితమైన శివుడన్నమాట. సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు కావడంతో సైకత లింగంపై అభిషేకం చేస్తే కరిగిపోతుందనే ఆలోచనతో..భర్తను రక్షించుకునేందుకు అమ్మవారు జాగ్రత్తగా పొదివి పట్టుకుంటుంది.


Also Read: మహా శివరాత్రి రోజు ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలంటే!


చిదంబరం - ఆకాశలింగం
చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ ఆలయంలో మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం ఉంటుంది.  అందుకే ఇక్కడ అమ్మవారు దృష్టితో నిలబడి ఉంటుంది. అంటే నా భర్త విశ్వమంతా వ్యాపించి ఉన్నారని చెప్పే సంకేతం.


శ్రీకాళహస్తి - వాయులింగం 
వాయువు వేగానికి ప్రతీక..ఆ వేగాన్ని నియంత్రించడం సాధ్యం కాదు..అందుకే ఇక్కడ అమ్మవారు ప్రశాంతంగా  జ్ఞానప్రసూనాంబగా కొలువై ఉంటుంది. 


సృష్టిలో ప్రతీది రెండుగా ఉంటుంది....
పగలు-రాత్రి
చీకటి-వెలుగు
సుఖం-దుంఖం
విచారం-సంతోషం
వీటిలో ఏ రెండూ ఒకేసారి ఉండవు. ఒకటి లేకుండా మరొకటి ఉండవు. రెండింటి సమ్మేళనం ఒకటవుతుంది.  పగలు రాత్రి కలిస్తే రోజు, సుఖం-దుంఖం కలిస్తే జీవితం, బొమ్మ-బొరుసు ఉంటే ఓ నాణెం. ఇలా స్త్రీ-పరుషుడు కలిస్తే సృష్టి అని చెబుతుంది అర్థనారీశ్వరతత్వం. ఒక్కచోటే ఉంటారు ఒకరికొకరు కనపడరు. కానీ ఇద్దరూ కలిస్తేనే విశేషం. అదే అర్థనారీశ్వర తత్వం. 


తల ఆలోచనకి , పాదం ఆచరణకు సంకేతాలైతే , పార్వతీపరమేశ్వరులు తలనుంచి కాలివరకు..ప్రతి చర్య-ఆలోచనలోనూ సమానంగా ఉంటారని అర్థం. భార్యా భర్త అన్యోన్యంగా ఉంటూ... తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ ,ఆలోచనలోనూ కర్మలలోను , కార్యాలలోను , నిర్ణయాలలోనూ , నిర్మాణాలలోనూ ఒకటిగా  ఉండాలని సూచించే హిందూ ధర్మమే అర్థనారీశ్వర తత్వం.


సాధారణంగా ఈశ్వరుడు స్థిరస్వభావం...తనలో మార్పులుండవు. అమ్మవారు మాయా స్వరూపం అంటే మారుతూఉంటుంది. సృష్టిలో రెండే శాశ్వతం ఒకటి మారేది మరొకటి మారనిది. స్థిర తత్వం పురుషతత్వం అయితే...మాయా తత్వం స్త్రీ సొంతం. మళ్లీ మాయాతత్వం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో....పురాణాల ఉద్దేశం అది కాదు. మార్పు అంటే పురుషుడి చతుర్విద ఆశ్రమాల్లో స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుందని అర్థం.



  • బ్రహ్మచర్యం స్త్రీ చేయి పట్టుకోవడంతో ముగుస్తుంది

  • ఆమెను భార్య కింద మార్చుకుని గృహస్థ ఆశ్రమాన్ని పూర్తిచేస్తాడు పురుషుడు

  • వానప్రస్థంలో అంటే 60 ఏళ్ల వయసులో అదే భార్యను తల్లిగా భావిస్తాడు

  • చివరిగా సన్యాస ఆశ్రమం....అంటే సన్యాస ఆశ్రమంలో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు. కానీ నాతిచరామి అన్న భార్య చేయి విడిచిపెట్టడం భావ్యం కాదు. అందుకే తన జీవితానికి పరిపూర్ణనతను కల్పించిన భార్యకు సన్యాస ఆశ్రమంలో అమ్మవారిగా భావిస్తాడు.


అంటే పురుషుడు ఒక్కడే...కానీ ఒకే స్త్రీ మారుతూ వచ్చింది....అందుకే స్త్రీని మాయాస్వరూపం అంటారు. భార్యగా ఆమెకున్న ఘనతను గుర్తించే తనలో సగభాగం చేసుకుని అర్థనారీశ్వరడుగా మారాడు పరమశివుడు.