Lokesh Serious: తిరుమల(Tirumala) ప్రతిష్ఠ దెబ్బతీసేలా వైసీపీ నాయకులు చేస్తున్న ఆకృత్యాలు బయటపెట్టడమే రమణ దీక్షితులు(Ramana Dekshitulu) చేసిన నేరమా అంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Lokesh) ప్రశ్నించారు. శ్రీవారి ఆలయంలో దశాబ్దాలుగా పనిచేసిన అనుభవం ఉన్న పండితులు చెప్పే సూచనలు పరిగణలోకి తీసుకుని తప్పులు సరిదిద్దుకోవాలే తప్ప..కక్షసాధింపు చర్యలకు దిగకూడదన్నారు. తిరుమలేశుడితో పెట్టుకుని మహామహులే గాలిలో కలిసిపోయారని లోకేశ్ గుర్తుచేశారు. 
లోకేశ్ ఆగ్రహం
నియంత జగన్(Jagan) పాలనలో ప్రశ్నించడమే పాపమన్నట్లు తయారైందని నారా లోకేశ్(Lokesh) మండిపడ్డారు. ఆయన పాలనలో లోపాలు ఎత్తిచూపిన వారిని శిక్షించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తిరుమల(Tirumala) ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేయడం దారుణమని మండిపడ్డారు. కొండపై వైకాపా నేతలు, కొంత మంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాలను.. ఆ కలియుగ దైవమే రమణ దీక్షితులు(Ramana Dekshitulu) నోటి నుంచి భక్తులకు తెలిసేలా చేశారన్నారు. చేసిన తప్పులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి ఆయనపై కేసు పెట్టడం, అరెస్ట్ చేయాలని చూడటం జగన్ అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
దేవుడి జోలికి వెళ్లిన వారెవరూ బాగుపడినట్టు చరిత్రలో లేదని, దైవంతో ఆటలొద్దని జగన్ (Jagan)ను హెచ్చరించారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినట్లుగా  ఉన్న ఓ విడీయో వైరల్ అవ్వడంతో దీనిపై టీటీడీ పాలకమండలి చర్యలు చేపట్టింది. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై తిరుమల వన్ టౌన్ స్టేషన్ లో రెండురోజుల క్రితమే కేసు నమోదు అయ్యింది.అయితే ఆ వీడియో తనది కాదని రమణదీక్షితులు వివరణ ఇచ్చినా....టీటీడీ(TTD) బోర్డు చర్యలు చేపట్టడం విశేషం. 
వీడియోలో ఏముందంటే
టీటీడీ(TTD), రాష్ట్ర ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయర్లను రమణదీక్షితులు విమర్శిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. తిరుమల(Tirumala)లో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపిస్తోందని ఆయన ఆరోపించారు. గుప్త నిధుల కోసమూ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు.  ఈవో ధర్మారెడ్డి(Dharama Reddy) క్రిస్టియన్, సీఎం జగన్‌(Jagan) మోహన్‌రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్దసమస్యగా తయారైందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఈవో(EO) కుమారుడు చనిపోతే...హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయన్ను దహనం చేయకుండగా ఖననం చేశారని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోపై తీవ్ర దుమారం రేగడంతో....ఇవాళ సమావేశమైన టీటీడీ పాలకమండలి బోర్డు రమణదీక్షితులను ఆలయ ప్రధాన అర్చకుల పోస్టు నుంచి తొలగించారు. 
విచారణ లేకుండానే వేటు
అయితే ఈ వీడియోలో మాట్లాడిన వ్యాఖ్యలు తనవి కాదని...ఎవరో కావాలని సృష్టించారని రమణదీక్షితులు వివరణ ఇచ్చారు, ఈ మేరకు టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఆ వీడియోలో ఉన్న గొంతు కూడా తనది కాదని చెప్పారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా తాను ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. అయినా ఏకపక్షంగా  రమణదీక్షితులపై వేటు వేయడాన్ని లోకేశ్ ఖండించారు. నిజంగా రమణదీక్షితులు చెప్పినట్లుగా వీడియోలో ఉన్న ఆరోపణలు నిజమే ఆయితే విచారణ జరపాలని..అలా కాకుండా తిరుమలలో జరుగుతున్న ఘోరాలను వెలికితీసే వారిపై చర్యలు తీసుకోవడం ఏంటని లోకేశ్ మండిపడ్డారు.