Koil Alwar Thirumanjanam in Tirumala | తిరుమల: సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేది వరకు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దాంతో ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

Continues below advertisement

ప్రాముఖ్యత: తమిళంలో కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’ అని అర్థం. ఆళ్వార్ అంటే “భక్తుడు”, తిరు అంటే “శ్రేష్టం”, మంజనం అంటే  “స్నానం” లేదా శుద్ధి చేయడం అని అర్థం వస్తుంది.  కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడితో పాటు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం. ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో తిరుమల శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు.

ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల ఇతర పరివార దేవతలు, దీపం మరియు పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు.

Continues below advertisement

ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించనున్నారు. కాగా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది పండుగ, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పండుగలతో పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సెప్టెంబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

టీటీడీ సెప్టెంబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను (ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా) రద్దు చేసింది. కావున సెప్టెంబర్ 15న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టీడీపీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.