tholi ekadashi 2023: తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటిగా పరిగణిస్తారు. ఆషాఢ మాసం శుక్ల పక్షంలోని 11వ రోజును తొలి ఏకాద‌శిగా జరుపుకొంటారు. హిందూ గ్రంధాల ప్రకారం, విష్ణువు క్షీరసాగరంలో విశ్రమించే నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ స‌మ‌యంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. దృక్ పంచాంగ ప్రకారం, దేవశయన ఏకాదశి వ్రతాన్ని జూన్ 29, గురువారం నాడు ఆచరిస్తారు. అలాగే తొలి ఏకాదశి రోజు మనం కొన్ని పనులు చేయకూడదని అంటారు. తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి..? మరి ఏం చేయకూడదో తెలుసా..?


Also Read : తొలిఏకాదశి (జూన్ 29) శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!


ఉపవాసం పాటించండి                  
తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి. రోజంతా శ్రీ‌మ‌హా విష్ణువును ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.


తులసీ ద‌ళాల‌ను సమర్పించండి                  
విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిలో తులసీ ద‌ళాలు ఒకటి. తులసీ ద‌ళాలు సమర్పించకుండా విష్ణువు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. కాబట్టి మీరు శ్రీమహావిష్ణువును పూజించేటప్పుడు, పూజలో తులసీ ద‌ళాల‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని గుర్తుంచుకోండి.


జంక్ ఫుడ్ తినవద్దు              
తొలి ఏకాదశి నాడు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ రోజున మాంసం, ఉల్లి, వెల్లుల్లి మొదలైన తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఆహార ప‌దార్థాలు మనసులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. అలాంటి ఆలోచనలతో మనం భ‌గ‌వ‌దారాధ‌న‌పై దృష్టి పెట్టలేకలేము.


దానం                    
తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాస వ్ర‌తాన్ని పాటించినా, పాటించ‌క పోయినా డబ్బు, దుస్తులు, బియ్యం, నీరు దానం చేయాలి. ఎందుకంటే, తొలి ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు.


బ్రహ్మచర్యాన్ని పాటించండి
ఏకాదశి వ్రతం రోజున బ్రహ్మచర్యం పాటించాలి. భక్తులు తమ శరీరం, మనస్సుపై ఎల్లప్పుడూ నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు శ్రీ‌మ‌హా విష్ణు మంత్రాలను పఠిస్తూ ఈ రోజు గడపాలి.


Also Read : తొలి ఏకాదశి(జూన్ 29 ) ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!


మంత్రం                       
తొలి ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఇచ్చారు. ఈ రోజు మీరు పఠించే విష్ణు మంత్రం మీకు ఏకాదశి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. తొలి ఏకాదశి నాడు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయః అనే మంత్రాన్ని పఠించాలి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.