Batukamma 2023: రోజులు గడిచే కొద్దీ బతుకమ్మ సంబరాలు మిన్నంటుతాయి. మూడోనాటికి కోలాహలం రెట్టింపు అవుతుంది. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా అలంక‌రిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముద్దపప్పు, బెల్లం ఆప్యాయంగా ఇచ్చిపుచ్చుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో పెసరపప్పునకు ప్రాధాన్యం ఎక్కువ. అన్నప్రాశన మొదలు పిల్లలకు పెసరపప్పు, బియ్యంతో కలిపి ఉగ్గు వండి నెయ్యితో కలిపి పెడతారు. ముద్దపప్పు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. అమ్మను ‘ముద్గౌదనాసక్త చిత్తా’ అంటారు. అంటే అమ్మవారికి కూడా పెసరపప్పుతో చేసే పొంగలి, ఇతర వంటకాలంటే ప్రీతి అని చెబుతారు. బతుకమ్మ మూడోనాడు ముద్దపప్పులో బెల్లం వేసి అమ్మకు నైవేద్యంగా సమర్పించి.. పిల్లలకు ప్రసాదంగా పంచిపెడతారు. 


మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ
నైవేద్యం: ముద్దపప్పు
తయారీ: కుక్కర్లో కందిపప్పు, పసుపు, కరివేపాకులు, దంచిన జీలకర్ర, ఒక స్పూను నూనె, నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికాక ఉప్పు కలుపుకోవాలి. ముద్దప‌ప్పు ప్రసాదం సిద్ధమైనట్టే.


Also Read : రెండో రోజు బ‌తుక‌మ్మ‌కు స‌మ‌ర్పించే నైవేద్యం ఇలా చేసేయండి


ఎంగిలిపూల బతుకమ్మ నైవేద్యం వివ‌రాలు
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలిపడ్డాయని తలచి ఎంగిలిపూలుగా పరిగణిస్తారు. పితృ అమావాస్య రోజు స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకొని, వారిని దేవతలుగా ఆరాధిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో తెచ్చిన పూలన్నీ ఎంగిలిపడ్డట్టుగా భావిస్తారు.


మొద‌టి రోజు నైవేద్యం - నువ్వుల పిండి, బియ్యం పిండితో చేసే ప్రసాదం
తయారీ విధానం: కప్పు నువ్వులు తీసుకుని కడాయిలో వేయించాలి. గోధుమ‌ రంగులోకి వచ్చాక తీసి పంచదార వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో బియ్యంపిండి, నూకలు కూడా కలుపుకోవచ్చు. ఇదే ఎంగిలిపూల బతుకమ్మకు సమర్పించే నైవేద్యం. 


అటుకుల బతుకమ్మ
బతుకమ్మ వేడుకల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను ‘అటుకుల బతుకమ్మ’గా ఆరాధిస్తారు. ఈ రోజున ప్రధానంగా నివేదించేవి అటుకులు కాబట్టి ‘అటుకుల బతుకమ్మ’ అని పిలుస్తారు. వివిధ రకాల పూలతో రెండు ఎత్తులలో గౌరమ్మను పేరుస్తారు. ఆటపాటలతో వేడుక చేసుకుంటారు.


బతుకమ్మను పేర్చడానికి అవసరమైన పూలకోసం ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో నిమజ్జనం చేస్తారు. నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు. ఈ రోజు అటుకులను వాయనంగా ఇస్తారు.
నైవేద్యం: స‌ప్పిడి పప్పుతో పాటు బెల్లం - అటుకులు     
తయారీ: ముందుగా స‌ప్పిడి పప్పు తయారుచేసుకోవాలి. కందిపప్పుకు కాస్త పసుపు కలిపి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. నెయ్యితో ఆ పప్పును తాళింపు వేసుకోవాలి. ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేయకూడదు. ఇది చప్పిడి పప్పు కాబట్టి కారం ఉండకూడదు. 


ఇక బెల్లం-అటుకుల రెసిపీ కోసం ముందుగా కడాయిలో నెయ్యివేసి  జీడిపప్పులు, కిస్మిస్, బాదం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో బెల్లం వేసి కరిగించుకోవాలి. అవి కరిగాక అటుకులను శుభ్రం చేసి మరీ మెత్తగా నానిపోకుండా తీసి బెల్లంలో వేసి కలిపేయాలి. పైన ముందుగా వేయించిన డ్రైఫ్రూట్స్‌ను చల్లుకోవాలి. అంతే బెల్లం-అటుకుల ప్రసాదం రెడీ. 


నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మ
నైవేద్యం: బెల్లం అన్నం లేదా పరమాన్నం
తయారీ: ఒక కప్పు బియ్యాన్ని మూడు కప్పుల పాలలో ఉడికించాలి. పాలలో బియ్యం ఉడకవు అనుకుంటే రెండు ఒకటిన్నర కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు పోయచ్చు. మరో పక్క కడాయిలో బెల్లాన్ని కరిగించుకోవాలి. అలాగే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికాక చివర్లో కరిగించిన బెల్లం పాకాన్ని వేసి కలపాలి. స్టవ్ ఆపేయాలి. బెల్లంగా బాగా కలిశాక పైన ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే బెల్లం అన్నం సిద్ధం. 


ఐదో రోజు: అట్ల బతుకమ్మ
నైవేద్యం:  అట్లు లేదా దోశెలు
తయారీ: ఈ రోజు ప్రసాదం చేయడం చాలా సులువు. ఇంట్లో రోజూ చేసుకునే అట్లు లేదా దోశెలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే బియ్యంపిండితో చేసిన అట్లు పెడితే మంచిదని చెబుతారు. దీనికి ఒక గిన్నెలో  కప్పు బియ్యంపిండి, పావు కప్పు రవ్వ, పావు కప్పు పెరుగు, జీలకర్ర, తగినంత నీళ్లు వేసి బాగా కలపాలి. దోశె పిండిలా జారేలా కలుపుకోవాలి. పది నిమిషాలు పక్కన పెట్టాక ఆ పిండితో అట్లు లేదా దోశెలు వేసి అమ్మవారికి సమర్పించాలి. 


ఆరో రోజు: అలిగిన బతుకమ్మ
నైవేద్యం: ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు.


ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ
నైవేద్యం: బియ్యంపిండితో చేసే వేపకాయలు ప్రసాదం
తయారీ: ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యంపిండి, రెండు స్పూన్ల నువ్వులు, తగినంత ఉప్పు వేసి కలపాలి. అందులో గోరువెచ్చని నీళ్లు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ ముద్దను వేపకాయల్లా చేతితో నొక్కుకుని నూనెలో వేయించాలి. అంతే వేపకాయల ప్రసాదం సిద్ధం.


Also Read : బ‌తుక‌మ్మ‌ నైవేద్యాలు చాలా ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు!


ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ
నైవేద్యం: వెన్నముద్దలు
తయారీ: వెన్నముద్దలు చేసేందుకు గిన్నెలో అరకప్పు బియ్యంపిండి వేయాలి. అందులో రెండు స్పూన్ల వెన్న‌, కాస్త వేడి నీళ్లు పోసి చపాతీ పిండిలా వచ్చే వరకు క‌లపాలి. ఇప్పుడు చిన్న ముద్ద తీసి గులాబ్ జాముల్లా గుండ్రంగా చుట్టుకోవాలి. అలా గుండ్రని ముద్దలు త‌యార‌య్యాక వాటిని నూనెలో వేయించాలి. మరో పక్క పంచదార పాకం త‌యారుచేసుకుని, వేయించిన వెన్నముద్దలను తీసి ఆ పాకంలో వేయాలి. అంతే.. అమ్మవారికి తీయని వెన్నముద్దల నైవేద్యం సిద్ధ‌మైనట్టే. 


తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ
నైవేద్యం : కొబ్బరన్నం, నువ్వుల సద్ది, నిమ్మకాయ పులిహోర‌, చింతపండు పులిహోర, దద్దోజనం... ఇలా ఐదు రకాల నైవేద్యాలను తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.