Khairatabad Ganesh immersion completed :ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జన శోభాయాత్ర 2 భక్తి ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.  69 అడుగుల ఎత్తైన విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహం నిమజ్జన శోభాయాత్ర  నిర్విఘ్నంగా పూర్తి అయింది.  71వ ఏడాది జరుపుకుంటున్న ఈ గణేశోత్సవం, లక్షలాది భక్తులను ఆకర్షించింది. హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం కోసం ఈ శోభాయాత్ర ఉదయం 7:44 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో క్రేన్ నెంబర్ 4  వద్ద నిమజ్జనం పూర్తి అయింది. 

లక్షలాది మంది భక్తులు గణేశుడికి వీడ్కోలు పలికారు. గంగమ్మఒడికి సాగనంపారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు 69 అడుగుల ఎత్తుతో "విశ్వశాంతి మహాశక్తి గణపతి" థీమ్‌తో రూపొందించారు.  విగ్రహం చుట్టూ పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలు ఏర్పాటు చేశారు.   ఇవి శోభాయాత్రకు అదనపు ఆకర్షణను జోడించాయి. శోభాయాత్ర ఖైరతాబాద్ మండపం నుంచి సెక్రటేరియట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా హుస్సేన్ సాగర్‌లోని క్రేన్ పాయింట్ నంబర్ 4 వద్దకు చేరుకున్న తరవాత నిమజ్జనం  పూర్తి అయింది. 

శోభాయాత్ర ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, శుక్రవారం రాత్రి భక్తుల భారీ రద్దీ కారణంగా వెల్డింగ్ పనులు ఆలస్యమవడంతో గంట విళంబంగా 7:44 గంటలకు బయలుదేరింది. "గణపతి బప్పా మోరియా" నినాదాలు, డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ నృత్యాలతో శోభాయాత్ర ఉత్సాహకర వాతావరణంలో సాగింది. రోడ్ల వెంట, ఇళ్ల పైకప్పులపై భక్తులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే అనుకున్న సమయానికే నిమజ్జనం పూర్తి చేసేందుకు వేగంగా  యాత్రను కొనసాగించారు.  శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల దూరంలో హుస్సేన్ సాగర్‌లోని నిమజ్జన పాయింట్‌కు మధ్యాహ్నం 1 గంటలకు చేరుకుంది. ఒకటిన్నరకల్లా నిమజ్జనంపూర్తి అయింది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ విగ్రహం సహజ మట్టి, సేంద్రీయ రంగులు, గడ్డి ఊకతో రూపొందించారు. 

ట్యాంక్ బండ్ పై మొత్తం   134 స్టాటిక్ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జన ప్రక్రియ కోసం ఏర్పాటు చేశారు.  హుస్సేన్ సాగర్‌లో సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి, ఈ ప్రక్రియ 40 గంటలపాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేశారు.  హుస్సేన్ సాగర్‌తో పాటు 20 ప్రధాన సరస్సులు, 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం జరిగేలా GHMC ఏర్పాట్లు చేసింది, దీనివల్ల సహజ జలవనరులపై ఒత్తిడి తగ్గింది.  

ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జన శోభాయాత్ర హైదరాబాద్‌లో భక్తి, సాంస్కృతిక సంబరాలకు ప్రతీకగా నిలిచింది. లక్షలాది భక్తులు, భారీ భద్రత, పర్యావరణ హిత ఏర్పాట్లతో ఈ ఉత్సవం దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా మారింది. ఈ శోభాయాత్ర హైదరాబాద్ యొక్క సామాజిక, సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబిస్తూ, భక్తులకు మరపురాని అనుభవాన్ని అందించింది.