Kedarnath Dham Doors Open: ఉత్తరాఖండ్‌లో పవిత్ర చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. బుధవారం (ఏప్రిల్ 22) భక్తుల కోసం కేదార్‌నాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి. "హర్ హర్ మహాదేవ్" అనే నామస్మరణలతో ధామ్ మొత్తం మారుమోగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు.
భక్తుల ఆరు నెలల సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ముగిసింది. బద్రీ-కేదార్ ఆలయ కమిటీ అధికారులు, యాత్రికులైన పురోహిత సంఘం వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ బాబా కేదార్ ద్వారాలు తెరిచారు. తలుపులు తెరిచే సమయంలో సీఎం ధామి హాజరయ్యారు.బాబా కేదార్‌నాథ్ ద్వారాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు. కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణం "జై శ్రీ కేదార్" నినాదాలతో మారుమోగింది. కేదార్‌నాథ్‌లో సైన్యం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
వేద మంత్రాల పఠనం, సాంప్రదాయ ఆచారాలతో కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు భక్తుల కోసం అధికారికంగా తెరుచుకున్నాయి. భారతదేశం , ప్రపంచం నలుమూలల నుంచి వేలాది యాత్రికులు ఈ పవిత్ర స్థలానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేదార్‌నాథ్ కమిటీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
తలుపులు తెరవడం గురించి సీఎం ధామి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు "ఈ రోజు, పూర్తి ఆచారాలు వేద మంత్రోచ్ఛారణలతో, శ్రీ కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు భక్తుల కోసం తెరుస్తారు. ఈ శుభ సందర్భంలో, దేవభూమి ఉత్తరాఖండ్‌లో పవిత్ర చార్‌ధామ్ యాత్ర చేస్తున్న మీ అందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, అభినందనలు తెలియజేస్తున్నాను. బాబా కేదార్ ఆశీస్సులు యాత్రికులందరికీ సుఖసంతోషాలతో కూడిన యాత్రను ప్రసాదించుగాక." అని పోస్ట్ చేశారు
ప్రధాని నరేంద్రమోదీ కూడా కేదార్‌నాథ్ ద్వారాలు తెరుచుకోవడంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.. దేవభూమి ఉత్తరాఖండ్ లో చార్‌ధామ్ యాత్ర దేశ విశ్వాసం, ఐక్యత, సుసంపన్నమైన సంప్రదాయలకు ప్రతీక..భక్తులంతా సురక్షితమైన యాత్ర చేయాలి, బాబా కేదార్ ఆశీస్సులు మీ అందరిపైనా ఉండాలి..మీ యాత్ర శుభప్రదం కావాలి.. జై శ్రీ కేదార్, హర హర మహాదేవ్ అని పోస్ట్ పెట్టారు మోదీ
మోదీ కేదార్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణంపైనా ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల సౌకర్యార్థం రహదారులు, వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు. మోదీ తన పదవీకాలంలో పలుమార్లు కేదార్ నాథ్ ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ధ్యానం చేశారు. ఏటా దీపావళి తర్వాత వచ్చే రెండో రోజు భాయ్ దూజ్ నాడు శీతాకాలం ప్రారంభంకాగానే కేదార్‌నాధ్ ద్వారాలు మూసివేస్తారు. మళ్లీ ఏప్రిల్ మే నెలల్లో ఆలయాన్ని తెరుస్తారు..ఆరు నెలల పాటూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.
2026లో కేదార్‌నాథ్ దర్శనం కోసం సుమారు 4 లక్షల 50వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తం చార్ ధామ్ యాత్రకు 14 లక్షల 50వేల మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారిని మాత్రమే చార్ ధామ్ యాత్రకు అనుమతిస్తారు. హెలికాఫ్టర్ బుకింగ్, ట్రెక్కింగ్ నియమాలు, కొత్త ధరలకు సంబంధించిన అన్ని వివరాలు అధికారిక వెబ్ సైట్ లో ఉన్నాయి.
