కార్తీకమాసం DAY-8 అక్టోబరు 29:  కార్తీకపురాణం  ఎనిమిదవ అధ్యాయం 

Continues below advertisement

వశిష్ఠ మహర్షి  చెప్పినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నీ శ్రద్దగా విన్నాను. ఆ ప్రకారం.. ధర్మం సుక్షమని, పుణ్యం సులభంగా కలుగుతుందని ... నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని చెప్పారు. ఇంత  స్వల్ప ధర్మములతోనే మోక్షం  లభించినప్పుడు వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని కూడా చెబుతారు కదా? మరి మీరు  సూక్ష్మములో మోక్షంగా కనబరచినందుకు ఆశ్చర్యం కలుగుతోంది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక, మహాపాపాలు చేసినవారంతా తేలికగా మోక్షం పొందడం అంటే వజ్రపు కొండను గోటితో పెకిలించటం లాంటిదే..దీన్ని వెనుకున్న మర్మమును మరింత వివరంగా చెప్పమని అడిగాడు జనకమహారాజు

వశిష్ఠమహర్షి చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు

Continues below advertisement

"జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే, నేను వేదవేదాంగాలను పఠించాను. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవేంటంటే  సాత్త్విక, రాజస, తామసములు అనే మూడు రకాల ధర్మాలు సాత్విక ధర్మం

మనోవాక్కాయ కర్మలతో ఆచరించేదే సాత్విక ధర్మం. సాత్త్విక ధర్మము సమస్త పాపాలను నశింపచేసి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణనది సముద్రంలో కలిసే మార్గంలో స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమయ్యే విధంగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాల సమయంలో స్నానమాచరించడం... దేవాలయముల్లో వేదాలు పఠిస్తూ, సదాచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు దానధర్మాలు చేసినవారు విశేష ఫలం పొందుతారు. 

రాజస ధర్మం

 ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులను విడిచి చేసినదే రాజస ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగిస్తుంది

తామస ధర్మం

శాస్త్రోక్త విధులను విడిచి  డాంబికం కోసం చేసేదే తామస ధర్మం. ఇలాంటి ధర్మం ఫలాన్నీయదు 

పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణంతో భస్మం అయినట్టు  శ్రీ మన్నారాయణుని నామం, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి  పొందుతారు. ఇందుకు ఓ  ఇతిహాసం ఉంది చెబుతాను విను రాజా.. అజామిళుని కథ

పూర్వ కాలం కన్యాకుబ్జమనే నగరంలో నాల్గువేదములు చదివిన ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన పేరు సత్యవ్రతుడు. సకల సద్గుణరాశి   హేమవతి ఆయన భార్య. ఆ దంపతుల అన్యోన్య ప్రేమకు గుర్తుగా చాలా కాలానికి లేక లేక కుమారుడు జన్మించాడు. అతి గారాబంగా పెంచి అజామిళుడు అనే పేరు పెట్టారు. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాబంతో పెద్దల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు.  దుష్ట సావాసాలు చేస్తూ, విద్య నేర్చుకోక, బ్రాహ్మణ ధర్మాలు పాటించక రోజులు గడిపేసేవాడు. కొంత కాలానికి యవ్వనుడు కాగానే మంచి చెడ్డలు మరిచి, కామాంధుడై, మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితాన్ని తెంచి..మద్యం సేవిస్తూ..పర స్త్రీలతో కామక్రీడల్లో తేలేవాడు. ఇంటికి రాకుండా తల్లిదండ్రులను కూడా మర్చిపోయి అక్కడే ఉండిపోయేవాడు. 

అతిగారబం ఎంతపని చేసిందో విన్నావా జనకరాజా! తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా పైకి తెలియక చిన్నప్పటి నుంచి అదుపు  ఆజ్ఞలతో నుంచకపోతే ఇలాగే జరుగుతుందని చెప్పారు వశిష్ఠమహర్షి.

అలా అజామిళుడు కులభ్రష్టుడిగా మారడంతో బంధుమిత్రులు కూడా విడిచిపెట్టేశారు. మరింత రెచ్చిపోయిన అజామిళుడు వేటాడుతూ..కిరాతకుడిగా మారాడు. తాను కలసి ఉండే స్త్రీతో అడవికి వెళ్లాడు. కాసేపు వేయాడిన తర్వాత పండ్లు కోసేందుకు చెట్టెక్కిన ఆ స్త్రీ ... పక్కనే ఉన్న తేనెపట్టు తీయబోతూ జారిపడి మరణించింది. ఆ స్త్రీపై పడి ఏడ్చిన అజామిళుడు.. అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి చేరుకున్నాడు. ఆమెకు అప్పటికే ఓ కుమార్తె ఉండేది. ఆమె యుక్తవయసుకి రావడంతో అజామిళుడు ఆమెను కూడా వీడలేదు. వారిద్దరికీ ఓ కొడుకు కలిగాడు. ఆ బాలుడికి నారాయణ అనే పేరు పెట్టారు. అప్పటికే అయినవారంతా దూరం పెట్టేయడంతో కొడుకే ప్రాణంగా మారిపోయాడు. నారాయణ నారాయణ అంటూ అజామిళుడు కొడుకుని ‍ఒక్క క్షణం కూడా వీడకుండా ఉండేవాడు. కాని 'నారాయణ'యని స్మరిస్తేనే మోక్షం అని తనకు తెలియదు..కొంతకాలానికి శరీరపటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టాడు. నిత్యం నారాయణ అని స్మరిస్తూనే.. చావు అంచున ఉన్నప్పుడు కూడా నారాయణ నారాయణ అని ప్రాణం విడిచాడు. 

 అజామిళుడు చేసిన పాపాలకు నరకానికి తీసుకెళ్లేందుకు యమభటులు వచ్చారు. నారాయణ నారాయణ అని స్మరిస్తూ ప్రాణం వీడడంతో విష్ణు దూతలు వచ్చారు. అత్యంత దుర్మార్గుడు అయిన అజామిళుడిని వైకుంఠానికి ఎలా తీసుకెళ్తారని యమభటులు ప్రశ్నించారు. ఎన్ని పాపాలు చేసినా నారాయణ మంత్రం జపిస్తూ వచ్చాడు..ప్రాణం పోయే క్షణంలోనూ నారాయణ అంటూ ప్రాణం విడిచాడు.. అందుకే ఇతడిని వైకుంఠానికి తీసుకెళ్తామని చెప్పారు విష్ణుదూతలు

 స్కాంద పురాణం వశిష్ఠప్రోక్త కార్తిక మహాత్మ్యంలో ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం