కార్తీకపురాణం ఐదవ అధ్యాయం జనకమహారాజా! శ్రద్ధగా విను... మనం చేసిన పాపాలన్నిటినీ నశింపచేయగల శక్తి   కార్తీకమాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీకమాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణ చేస్తారో.. వారి పాపాలన్నీ పాము కుబుసంలా తొలగిపోతాయి. వైకుంఠానికి క్షేత్ర పాలకులుగా మారిపోతారు.  ఎవరైతే కార్తీకమాసంలో తులసీదళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలు అనుభవిస్తారు. ఈ నెలలో హరిహరుల సన్నిధిలో పురాణ ప్రవచనం చెప్పేవారు కర్మబంధ విముక్తులవుతారు కార్తీక వనభోజనాలు 

Continues below advertisement

యః కార్తీకే సైట్ వనభోజన మాచరేత్ | నయాతి వైష్ణవం ధామ సర్వ పాపైః ప్రముచ్యతే|| 

కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు పాప విముక్తులవుతారు.  జపం, హోమం, పూజ, భోజనం, తర్పణ ఫలాలతో... చెడు సంభాషణలు విన్న పాపం తుడిచిపెట్టుకుపోతుంది. 

Continues below advertisement

కనుక...ఓ మహారాజా..కార్తీకమాసం శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటూ ఉసిరిచెట్టు కూడా ఉన్న తోటలో వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరిచెట్టు కింద సాలగ్రామం ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను గౌరవించి ఆ తర్వాత భోజనం చేయాలి. ఇలా  కార్తీకమాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వారు ఆయా కాలాల్లో చేసిన సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. దీనికి సంబంధించిన ఓ కథ చెబుతాను విను.. దేవదత్తోపాఖ్యానం 

పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు పరమ దుర్మార్గుడైన కొడుకు పుట్టాడు. పేరు దేవదత్తుడు. ఆ  దుష్ట ప్రవర్తనలను గుర్తించిన  పాపవిముక్తుడిని చేయాలని సంకల్పించిన తండ్రి... 'నాయనా! రోజూ కార్తీక  స్నానాన్ని ఆచరించు. సాయంకాలం హరి సన్నిధిలో దీపారాధన చేస్తూఉండు అని చెప్పాడు. కానీ ఆ కొడుకు తాను అటువంటి కట్టు కథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని చేయనని చెప్పాడు.  ఆగ్రహించిన దేవశర్మ ... అడవిలో చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ కొడుకు తండ్రి కాళ్ళమీద పడి శాపవిమోచనం చెప్పమని అడిగాడు. నువ్వు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని పూర్తిగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని చెప్పాడు దేవశర్మ. శాపం కారణంగా అడవిలో మర్రిచెట్టులో ఎలుకరూపంలో ఉన్నాడు దేవదత్తుడు.ఆ అడవి కావేరి నదీతీరంలో ఉంది. స్నానం ఆచరించేందుకు నదికి వెళ్లేవారంతా ఆ వటవృక్షం కింద లోకాభిరామాయణం చర్చించుకుని వెళ్లేవారు. ఇలా కొంతకాలం అయిన తర్వాత కార్తికమాసంలో ఓరోజు  మహర్షియను విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరినదిలో స్నానమాచరించేందుకు వెళ్లారు. అనంతరం మర్రిచెట్టుదగ్గర కూర్చుని కార్తీకపురాణం పఠనం ప్రారంభించారు. పూజాద్రవ్యాల్లో ఏదైనా తినేందుకు దొరుకుతుందేమో అని మర్రిచెట్టులో ఉన్న ఎలుక బయటకు వచ్చింది. అక్కడకు వచ్చిన కిరాతకులు కొందరు వారిని దోచుకోవచ్చని వచ్చి..మహర్షిని చూసి బుద్ధిమార్చుకుని నమస్కరించారు. మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగారు. కార్తీకమాసం కావడంతో కావేరి నదిలో స్నానమాచరించి కార్తీకపురాణం పఠించేందుకు వచ్చాం..మీరుకూడా శ్రద్ధగా వినండి కార్తీక మహత్యం చెబుతాను అని  ఆ కిరాతకులను కూడా కూర్చోబెట్టారు విశ్వామిత్రులవారు. ఇదంతా విన్న ఎలుక కూడా తన పూర్వరూపం పొంది.. తన పూర్వజన్మగురించి చెప్పి వెళ్లిపోయింది.  ఓ జనకా! ఇహములో సిరి సంపదలు, పరలోకంలో మోక్షం కోరువారు తప్పకుండా ఈ కార్తీక పురాణమును చదివి, ఇతరులకు వినిపించవలెను అని చెప్పారు వశిష్టులవారు.

స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యంలో ఐదవ అధ్యాయం సమాప్తం

గమనిక: పండితులు చెప్పినవివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

( రోజుకో కథ చదువుకుంటే మంచిది..ముందు రోజు కథ చదువుకోవడానికి ఆటంకం వస్తే.. ఆ తర్వాత రోజు అన్ని కథలు కలిపి చదువుకోవచ్చు)