Karthika Puranam: కార్తీకమాసం DAY-10 అజామిళుడి పూర్వజన్మ రహస్యం! పాపాలు చేసినా మోక్షం ఎలా?
Karthika Puranam: కార్తీకమాసంలో కార్తీకపురాణం చదువుతారు. రోజుకో కథ చొప్పున 30 రోజులు 30 కథలు. పదవ రోజు చదువుకోవాల్సిన కథ ఇది

కార్తీకమాసం DAY-10 అక్టోబరు 31: కార్తీకపురాణం పదో అధ్యాయం
అజామిళుడి వృత్తాంతం కార్తీకపురాణం 8, 9 అధ్యాయాల్లో చెప్పుకున్నాం.. పదో అధ్యాయంలో అజామిళుడి పూర్వ వృత్తాంతం గురించి తెలుసుకుందాం.
జనక మహారాజు వశిష్ఠ మహర్షని ఇలా అడిగారు
మునిశ్రేష్ఠా! సకల పాపాలు చేసి నారాయణ అని స్మరించినంతనే వైకుంఠానికి వెళ్లిన అజామీళుడు ఎవరు?
తన పూర్వ జన్మ ఎలాంటింది? గత జన్మలో ఎలాంటి పాపాలు చేశాడు?
విష్ణు దూతలు వైకుంఠానికి తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగింది?
మళ్లీ చెప్పడం ప్రారంభించారు వశిష్ఠ మహర్షి
ఓ మహారాజ్! అజామీళుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్లిన తర్వాత యమ కింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి "ప్రభూ! తమ అజ్ఞ ప్రకారం అజామీళుని తీసుకుని వచ్చేందుకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమానమెక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు. మేం చేసేదిలేక విచారిస్తూ ఇక్కడకు వచ్చాం అని భయపడుతూ విన్నవించుకున్నారు.
ఎంతపని జరిగింది? ఎప్పుడూ ఇలా జరగలేదు..దీనికి బలమైన కారణం ఉండి ఉండొచ్చన్నారు యమధర్మరాజు. అప్పుడు తన దివ్యదృష్టిలో అజామిళుడి పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని "ఓహో! అదీసంగతి! తన అవసానకాలమున 'నారాయణ' అని వైకుంఠవాసుని నామస్మరణ చేశాడు. అందుకే విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకెళ్లారు. తెలియకగాని, తెలిసిగాని మృత్యుసమయమున హరి నామస్మరణ చేస్తే వారికి వైకుంఠప్రాప్తి తప్పక కలుగును. అందుకే అజామీళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అనుకున్నాడు.
అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఓ శివాలయంలో అర్చకుడుగా విధులు నిర్వర్తిస్తుండెను. అందంగా , బలంగా ఉన్న తనని తాను చూసుకుని మురిసి..గర్వంతో శివారాధన చేయక..ఆలయ ధనాన్ని అపహరిస్తూ శివుడి పూడను వదిలేసి దుష్టులతో సహవాసం చేసేవాడు. విచ్చలవిడిగా తిరిగేవాడు. శివాలయంలో స్వామికి ఎదురుగా కాళ్లు పెట్టిమరీ నిద్రించేవాడు. ఓసారి ఓ బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడింది. ఆమె కూడా అందమైనది..ఆమె భర్త బీదరికంతో భిక్షాటనకు వెళ్లి వచ్చేవాడు. భర్తలేని సమయం చూసి అజామిళుడుని ఇంటికి ఆహ్వానించేది ఆమె. ఒకరోజు పొరుగూరుకి వెళ్లి భిక్షాటన చేసి పెద్దమూటతో బియ్యం తలపై పెట్టుకుని ఎండలో నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు ఆ బీద బ్రాహ్మణుడు. ఆకలిగా ఉంది త్వరగా వంటచేసిపెట్టమని అడిగాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. కాళ్లు కడుక్కునేందుకు నీళ్లివ్వలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కోపం పట్టలేక మూలనున్న కర్రతీసుకుని ఆమెను కొట్టాడు..ఆమె అదే కర్రను లాక్కుని తిరిగి కొట్టడంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు ఆ బీద బ్రాహ్మణుడు.సంతోషించిన ఆమె ఆ రాత్రి అందంగా అలంకరించుకుని అరుగుపై కూర్చుంది. ఆ వీధిన వెళుతున్న వారిని ఇంటికి పిలవడం ప్రారంభించింది. అలాంటి పాపం తాము చేయమని చెప్పి వారంతా వెళ్లిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి ఆ గ్రామంలో శివార్చన చేసే బ్రాహ్మణుడి వద్దకు వెళ్లి రాత్రంతా ఉండి వచ్చింది. తెల్లవారేసరికి తాను చేసిన తప్పు తెలుసుకుంది. అయ్యో ఎంత పాపం చేశాను అని పశ్చాత్తాపంతో ఒక కూలి వానిని పిలిచి, కొంత డబ్బు ఇచ్చి..తన భర్తను వెతికి తీసుకురమ్మని చెప్పి పంపించింది. కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగివచ్చిన భర్త కాళ్లపై పడి తప్పు ఒప్పుకుని, క్షమించమని వేడుకుంది.
ఆ శివార్చకుడికి కొంతకాలానికి వ్యాధి సక్రమించి మరణించిన తర్వాత నరకంలో నానా బాధలు అనుభవించి సత్యవ్రతుడు అనే బ్రాహ్మముడి ఇంట అజామిళుడిగా జన్మించాడు. కార్తీకమాసంలో నదీ స్నాన ఆచరించడం..అంతిమ క్షణాల్లో నారాయణ మంత్రం జపించడం వల్ల వైకుంఠానికి వెళ్లాడు.
ఇక ఆ బీద బ్రాహ్మణుడి భార్య కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది. ఆమె కూడా యమలోకంలో బాధలు అనుభవించి ఓ చంఢాలుడి ఇంట జన్మించింది. పుట్టిన వెంటనే తనకు గండం అని జ్యోతిష్యుడి ద్వారా తెలుసుకున్న తండ్రి ఆమెను ఓ అడవిలో వదిలిపెట్టాడు. ఆ దారిలో వెళుతున్న విప్రుడు ఆ చిన్నారిని తీసుకెళ్లి తన ఇంట పనిచేసే దాసికి ఇచ్చి పెంచమని చెప్పాడు. అజామిళుడు మనసుపడింది ఆమెనే. ఇద్దరి పూర్వజన్మ వృత్తాంతం ఇదే.
నిర్మలమైన మనసుతో శ్రీ మహావిష్ణువును ధ్యానించడం, దానధర్మలు చేయడం, కార్తీకమాసం స్నానం ప్రభావం వల్ల ఎలాంటి వారైనా మోక్షం పొందగలరు అని వశిష్ఠ మహర్షి జనకమహారాజుకి చెప్పారు
స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్యంలో పదవ అధ్యాయం సంపూర్ణం
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం






















