కార్తీకమాసం DAY-12 నవంబర్ 2 కార్తీకపురాణం 12వ అధ్యాయం
జనక మహారాజా! కార్తీకమాసం కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరిస్తాను అని వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభించారు కార్తీక సోమవారం ఉదయాన్నే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానం ఆచరించి ఆచమనము చేయాలి. ఆ తర్వాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి, సాయంకాలము శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసికుని ఉపవాసం విరమించాలి. ఈవిధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి, మోక్షము కూడా పొందుదురు.
కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినప్పుడు వ్రతం ఆచరిస్తే నూరు రేట్లు ఫలితము కలుగును.
కార్తీక శుద్ధ ఏకాదశిరోజు ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువు ఆలయానికి వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మర్నాడు బ్రాహ్మణ సమారాధన చేసిన, కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటిమంది బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికన్నా అధిక ఫలము కలుగును.
కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రం. ఈ రోజు శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రహ్మణునకు దానిమిస్తే ఆ ఆవు శరీరానికి ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాలు స్వర్గ సుఖాలు పొందుతారు.
కార్తీకశుద్ధ పాడ్యమి రోజున ,కార్తిక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును.
ద్వాదశి రోజు యజ్ఞోపవీతాలు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని, సాలగ్రామాన్ని కానీ ఒక బ్రాహ్మణునకు దానమిస్తే నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.
దీనికి ఉదాహరణముగా ఒక కథ ఉంది.. సాలగ్రామ దానమహిమ
పూర్వం అఖ౦డ గోదావరి నదీ తీరంలో ఓ పల్లెలో ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు దురాశపరుడై నిత్యం ధనమును కూడా బెడుతూ..తాను అనుభవించక, ఇతరులకు పెట్టక, బీదలకు దానధర్మములు చేయక, ఎప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగేవాడు. పరుల ధనాన్ని ఎప్పడు అపహరిద్దామా అని అనుకునేవాడు. అతడు తన గ్రామానికి సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును వడ్డీకి అప్పుయిచ్చాడు. కొంత కాలానికి తన సొమ్ము తనకిమ్మనిని అడుగగా ఆ బ్రాహ్మణుడు "అయ్యా! తమకీయవలసిన ధనం ఒక నెలరోజుల గడువులో ఇస్తాను..మీ రుణం ఉంచుకోను అని వేడుకుననాడు. ఆ మాటలకు మండిపడిన కోమటి. నాసొమ్ము నాకిప్పుడే ఇవ్వాలంటూ ఆవేశంతో వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుక కోశాడు. భయపడిన కోమటి రాజభటులు వస్తానే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం..అప్పటి నుంచి వైశ్యుడికి బ్రహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడి కొన్నాళ్లకు మరిణించాడు. యమదూతలు వచ్చి తీసుకెళ్లి రౌరవాది నరకకూపంలో పడేశారు.
ఆ వైశ్యుడికి ఓ కుమారుడున్నాడు..తన పేరు ధర్మవీరుడు. పేరునకు తగినట్లుగానే తండ్రి స౦పాదించిన ధనాన్ని దానదర్మాలు చేసేవాడు. చెట్లు నాటించడం, చెవువులు తవ్వించడం, సకలక జనులు సంతోషంగా ఉండేలా ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. కొంతకాలానికి నారదులవారు యమలోకం దర్శించి అక్కడినుంచి భూలోకానికి వచ్చారు. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి...నాపుణ్యం కొద్దీ తమ దర్శనం లభించింది..తాము వచ్చిన కార్యం చెప్పమని అడిగాడు. నారదుడు చిరునవ్వు నవ్వి "ఓ ధర్మవీరా! నీకోక హితవు చెప్పాలని వచ్చాను అన్నాడు. శ్రీమహావిష్ణువుకి కార్తీకమాసంలో వచ్చే శుద్ధద్వాదశి మహాప్రీతికరమైనది. ఆ రోజు స్నాన, దాన, జపాదులు ఏం చేసినా అత్యంత ఫలం కలుగును.
ఏ జాతివారైనాస్త్రీ అయినా పురుషుడు అయినాచోరుడైన, పతివ్రతమైనా, వ్యభిచారిణి అయినాకార్తీకశుద్ద ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసం ఆచరించి సాలగ్రామదానం చేస్తే వెనుకటి జన్మలందూ, ఈ జన్మమందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించేందుకునీవు సాలగ్రామదానము చేయక తప్పదని చెప్పాడుయ. ధర్మవీరుడు "నారద మునివర్యా! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహాదానాలు చేశాను. ఆ దానాలతో నా తండ్రికి కలగని మోక్షం "సాలగ్రామ" దానంతో ఎలా అని అడిగాడు. ఆకలిగొన్నవాని ఆకలితీరునా! దాహంగొన్న వానికి దాహం తీరునా? ఎందుకు ఈ దానం అని ప్రశ్నించాడు. ఓ వైశ్యుడా! సాలగ్రామం శిల మాత్రమే అనుకుంటున్నావు..అది శిలకాదు. శ్రీహరి రూపము. అన్నిదానాలకన్నా సాలగ్రామదానం చేస్తే కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుంచి విముృక్తి కల్పించేందుకు ఈ దానం తప్ప మరొకటి లేదని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండి కూడా సాలగ్రామ దానం చేయలేదు. నారదుడు చెప్పిన హితభోధను పెడచెవిని పెట్టడంతో మరణం అనంతరం 7 జన్మలు పులిగా, 3 జన్మలు వానరంగా, 5 జన్మలు ఎద్దుగా, 10 జన్మలు పందిగా జన్మించాడు. పదకొండో జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టాడు. ఆమెను ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి వివాహం చేశాడు. కొంత కాలానికే భర్త మరణించాడు. చిన్నప్పటి నుంచి అష్టకష్టాలు అనుభవించడంతో తల్లిదండ్రులు బంధుమిత్రులు బాధపడ్డారు. ఆమెకు ఈవిపత్తు ఎందువల్ల వచ్చిందా అని దివ్యదృష్టితో చూసిన తండ్రి సాలగ్రామ దానం గురించి తెలుసుకున్నాడు. అప్పుడు సాలగ్రామ దానం చేయించి బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పి దాన ఫలం దారపోశాడు. ఆ దాన ఫలంతో ఆమె కోల్పోయిన సౌభాగ్యాన్ని తిరిగి పొందింది. కొంతకాలానిక మరణించి ఆ తర్వాత ఓ బ్రాహ్మణుడి ఇంట కుమారుడిగా జన్మించి సాలగ్రామ దానం చేసి ముక్తి పొందాడు ఓ జనక మహారాజా! కార్తీకశుద్ద ద్వాదశిరోజు సాలగ్రామ దానం చేసిన దాన ఫలం ఎంతో ఘనమైనది. కావున నీవు ఆ సాలగ్రామ దానమును చేయమని చెప్పారు వశిష్ఠ మహర్షి
స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మాహత్యం ద్వాదశ అధ్యాయం సంపూర్ణం - కార్తీకమాసం పన్నె౦డో రోజు పారాయణము సమాప్తం
గమనిక: పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
2025 నవంబర్ 02 క్షీరాబ్ధి ద్వాదశి! లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం సులువైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి