Kailash Manasarovar Yatra 2025

కైలాస మానస సరోవర యాత్ర..

ఊహకు అందనంతగా 21,788 అడుగుల ఎత్తుకి సాగే అసాధారణ ఆధ్యాత్మిక ప్రయాణం

మానస సరోవర పవిత్ర జలాల్లో మునిగితేలే అద్భుత అవకాశం

సాక్షాత్తూ పరమేశ్వరుడు కొలువైన కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం

శరీరాన్ని-మనసుని శుద్ధిచేసి మరుజన్మ లేకుండా కైలాసవాసుడి అనుగ్రహం పొందే క్షణం

శివపార్వతులు కైలాస పర్వతంపైనే నివాసం ఉంటారని హిందువుల నమ్మకం

రిషభ దేవ ఇక్కడే మోక్షం పొందాడని జైనుల విశ్వాసం

కైలాస పర్వతం విశ్వానికి కేంద్ర బిందువు అంటారు బౌద్ధులు

కైలాస మానస సరోవర యాత్ర కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు.. ప్రతి భక్తుడు దీనిని తమ అంతిమ గమ్యంగా భావిస్తారు. అందుకే.. ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ  సాహసయాత్ర చేసేందుకు ఆరాటపడతాడు

2020లో కరోనా కారణంగా కైలాస మానస సరోవర యాత్రను నిలిపేశారు. చైనా ప్ర‌భుత్వం వైపు నుంచి యాత్ర ఏర్పాట్ల గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మాన‌స స‌రోవ‌ర యాత్ర‌ను ఆపేశారు. తిరిగి ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది యాత్రను ఈ ఏడాది పునరుద్ధరించారు. జూన్ మూడో వారంలో ప్రారంభమైన కైలాస మానస సరోవర యాత్ర ఆగష్టు 25న ముగుస్తుంది. ఈ సంవత్సరం 720 మంది భక్తులు యాత్రకు బయలుదేరారు. వీరితోపాటూ 30 మంది ప్రత్యేక ఆఫీసర్లు ఉంటారని విదేశాంగశాఖ వెల్లడించింది. ఈ యాత్రకు వెళ్లేవారిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్దతిలో ర్యాండమ్ గా సెలెక్ట్ చేశారు.  ఉత్త‌రాఖండ్‌, సిక్కిం ఈ రెండు మార్గాల్లోనూ మానస సరోవర యాత్ర సాగుతుంది. అన్ని రూట్లు క‌లిపి మొత్తం 720 మంది యాత్రికుల‌ను మాత్ర‌మే ఈ ఏడాది అనుమతించారు. కైలాస ప‌ర్వ‌తంతో పాటు మాన‌స స‌రోవరం టిబెట్‌లో ఉన్నాయి. ఉత్త‌రాఖండ్ మార్గంలో 5 బ్యాచ్‌ల‌ను పంపిస్తారు.. ఒక్కో బ్యాచ్ లో 48 మంది ఉంటారు. సిక్కింలో నాథులా పాస్ మీదుగా కూడా 48 మందితో కూడిన 10 బ్యాచ్‌ల‌ను పంపిస్తున్నారు. ఈ ఏడాది మానస సరోవర యాత్ర కోసం మొత్తం 5384 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు వీరిలో 3 వేల 898 మంది పురుషులు, 1486 మంది మ‌హిళ‌లు ఉన్నారు. 65 ఏళ్లు దాటిన వారు 404 ఉన్నారు. వీరిలో హిందువుల‌ు, బౌద్దులు, జైనుల‌ు ఉన్నారు.  

అప్పట్లో 24 రోజులు ఉన్న యాత్రను ఈ ఏడాది నుంచి 10 - 15 రోజులకు తగ్గించారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారు, ఆరోగ్య పరీక్షలో ఉత్తీర్ణులు అయినవారే ఈ యాత్రకు అర్హులు. ఈ యాత్ర చేయడానికి ముందు ఢిల్లీలో శిక్షణ ఉంటుంది. ఈ యాత్ర పూర్తిచేసేందుకు దాదాపు 3 లక్షల వరకూ ఖర్చవుతుంది.

గతంలో ఉత్తరాఖండ్ లిపులేఖ్ పాస్, సిక్కిం  నాథులా పాస్ ద్వారా మాత్రమే యాత్ర సాగేది. కానీ ఈ ఏడాది కొత్త రూట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఉత్తరాఖండ్ పిథోరాగఢ్ నుంచి నేరుగా చైనా సరిహద్దుకు వెళ్లేందుకు రూట్ ఉంది. ఈ రూట్ ప్రస్తుతానికి 85% పూర్తైంది.. వచ్చే ఏడాదికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. మరోవైపు లడఖ్‌లో  డెమ్‌చాక్ రూట్ తెరవాలనే డిమాండ్  ఎప్పటి నుంచో ఉంది కానీ ఇంకా తెరవలేదు.

ఈ ఏడాది  మరో ప్రత్యేకత ఏంటంటే..ట్రెక్కింగ్ లేకుండా తొలిసారిగా పూర్తిస్థాయిలో రోడ్ ద్వారా ఈ యాత్ర చేసే అవకాశం కూడా సుసాధ్యం చేశారు. ఉత్తరాఖండ్ రూట్ నుంచి వెళ్లేవారు ముందుగా ఢిల్లీ నుంచి పిథోరాగఢ్  చేరుకుని లిపులేఖ్ పాస్ ద్వారా చైనాలో టిబెట్‌కు వెళ్తారు. సిక్కిం రూట్  లో వెళ్లేవారు గ్యాంగ్‌టక్ నుంచి నాథులా పాస్ ద్వారా టిబెట్‌ లోకి ఎంటరవుతారు. కొన్ని ప్రైవేట్ టూర్స్ కొన్ని ఏజెన్సీలు ఖాఠ్మండు నుంచి హెలికాప్టర్ లేదా ఏరియల్ దర్శనం కూడా ఏర్పాటు చేశాయి.