Mahashivratri 2026: శివాలయంలో ప్రదక్షిణ మిగిలిన ఆలయాల్లో చేసినట్టు కాదు! ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి!
Pradakshina: నిత్యం శివాలయానికి వెళతారు కొందరు..మరికొందరు ప్రతిసోమవారం దర్శించుకుంటారు..ఇంకొందరు పర్వదినాల్లో శివాలయానికి వెళతారు. మరి అక్కడ ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసా?

Mahashivratri 2026: ఏ ఆలయానికి వెళ్లినా భక్తులు ముందుగా ప్రదక్షిణ చేస్తారు. మూడుసార్లు, 11 సార్లు, 108 సార్లు..ఇలా ఎవరు మొక్కులకు అనుగుణంగా వాళ్లు ప్రదక్షిణ పూర్తిచేసి గర్భగుడిలో కొలువైన స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటారు. అయితే మిగిలిన ఆలయాలకు శివాలయానికి ప్రదక్షిణ విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయం తెలియక చాలామంది మిగిలిన ఆలయాల్లానే శివాలయం చుట్టూ తిరిగేస్తారు.
శివాలయంలో చేసే ప్రదక్షిణ విధానాన్ని చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం అంటారు
శివాలయంలో ప్రదక్షిణ చేసే విధానం
సాధారణంగా శివాలయంలో 1½ (ఒక్కటిన్నర) ప్రదక్షిణలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమపక్కగా మొదలుపెట్టి, గర్భాలయానికి వెనుకనున్న 'సోమసూత్రం' (శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం) వరకు వెళ్లాలి. సోమసూత్రం దాటకూడదు..అక్కడి నుంచి వెనక్కు తిరిగి అప్రదక్షిణంగా (anti-clockwise)ధ్వజస్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకూ రావాలి. ఇలా చేస్తే ఓ ప్రదక్షిణ పూర్తైనట్టు.
ఎందుకు ఇలా చేయాలి?
శివుని శక్తి లింగం నుంచి నిర్మలి ( సోమసూత్రం) ద్వారా బయటకు ప్రవహిస్తుంది అందుకే దానిని దాటకూడదు. శివాలయంలో ప్రదక్షిణ ఇలా చేస్తే శరీరం, వాక్కు మనస్సుతో చేసిన పాపాలు నశిస్తాయని నమ్మకం. ప్రదక్షిణ అనేది దైవం మని ఉనికికి కేంద్రంగా సూచిస్తుంది.
శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది మంత్రాన్ని స్మరించుకోవాలి
ఓం తత్పురుష ముఖాయ నమః
ఓం అఘోర ముఖాయ నమః
ఓం సద్యోజాత ముఖాయ నమః
ఓం వామదేవ ముఖాయ నమః
ఓం ఈశాన ముఖాయ నమః
ఈ ఐదు ఈశ్వరుడి రూపాలు.. ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టత ఉంది. ఒక్కో రూపాన్ని పూజించే భక్తులు వేర్వేరు ఉంటారు.
తత్పురుషం
పరమేశ్వరుడు ప్రశాంతంగా తూర్పు ముఖంగా కూర్చుని ఉండే రూపం ఇది. ఈ రూపాన్ని దేవతలు మాత్రమే చూడగలరు. ఈ రూపాన్ని పూజించేది కూడా దేవతలే
అఘోరం
అత్యంత భయంకరంగా ఉండే అఘోర రూపాన్ని దర్శించుకునేది, పూజించేది కేవలం అఘోరాలే. భూతప్రేతాలను అదుపులో ఉంచి మనల్ని కాపాడే ఈ రూపం భయంకరంగా ఉంటుంది
సద్యోజాతం
నిత్యం ఆలయాల్లో పూజలందుకున్న లింగరూపమే సద్యోజాతం. ఈ రూపాన్ని యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారు. ఈ రూపంలో శివుడు అభిషేకప్రియుడు
వామదేవం
బూడిద పూసుకుని స్మశానంలో తిరగడమే కాదు..శంకరుడు కూడా అలంకార ప్రియుడే అని చెప్పే రూపం ఇది. కుటుంబంతో సహా సర్వాలంకార భూషితుడిగా దర్శనమిస్తాడు. సకల సౌభాగ్యాలు, సంపదను ప్రసాదించే రూపం ఇంది..ఇంట్లో దేవుడి మందిరంలో ఉండే శివ కుటుంబం ఈ రూపమే
ఈశానం
ఐదో ముఖంగా చెప్పే ఈశానం అత్యంత ప్రియమైన భక్తులకు మాత్రమే కనిపిస్తుందట
ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఈ ఐదు రూపాలను స్మరించడంలో భాగంగా పేర్కొన్నదే పైన శ్లోకం...
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
























