Ayodhya Ram Mandir Latest News: ప్రపంచం మొత్తం అయోధ్య రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టవైపు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని గడియలే మిగిలి ఉన్నాయి. జగభిరాముడిని కొలువు తీర్చేందుకు అయోధ్య ముస్తాబైంది. ఆలయంలో ప్రతి మూల, దీపాలు, పూలతో సర్వాంగసుందరంగా అలంకరించబడ్డాయి. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న శుభ తరుణాన్ని పురస్కరించుకొని దేశమంతా రామ నామ స్మరణతో మార్మోగుతోంది. ఈ శుభ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. పేరులో ‘రామ్’ అని ఉన్నవారికి గోరఖ్‌పూర్‌లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21 ఆదివారం జూపార్క్ ఎంట్రీ టిక్కెట్‌లో 50 శాతం రాయితీ ఇచ్చారు. 


కండిషన్లు అప్లై..!
గోరఖ్‌పూర్‌లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్‌లో ఈ ఆఫర్‌ అందుకోవాలంటే  రామ్ పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. దీనిపై జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడారు. జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్‌ పెట్టినట్లు తెలిపారు. ప్రతి సోమవారం జంతు ప్రదర్శనశాలకు సెలవు అని కానీ ఈ సోమవారం అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జూపార్క్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జూపార్కు ప్రవేశ ద్వారం దగ్గర అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ వేడులను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


ప్రాణప్రతిష్ట వేడుకలకు 50 దేశాల నుంచి ప్రతినిధులు
అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ విశ్వ పండగైంది. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. సుమారు వంద మంది ప్రముఖులు అయోధ్యను సందర్శించి కార్యక్రమాన్ని తిలకించనున్నారు. ఉదయం 11.00 గంటలకు ఆలయానికి చేరుకోనున్నా ప్రధానమంత్రి మోదీ దాదాపు మూడున్నర గంటల పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరువాత బహిరంగ సభలో పాల్గొంటారు. 


రెండు గంటల పాటు మంగళవాయిద్యాలు
మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం 25 రాష్ట్రాలకు చెందిన మంగళవాయిద్య బృందాలు ఇక్కడకు చేరుకున్నాయి. వారంతా సుమారు రెండు గంటల పాటు మంగళవాయిద్యాలతో ఆ ప్రాంతాన్ని మరింత అహ్లాదకరంగా మార్చబోతున్నారు. అయోధ్య నగరాన్ని 2,500 క్వింటాళ్ల పూలతో అలంకరించారు.


27 నుంచి వస్తే మంచిదని సూచన 
'ప్రాణ్‌ప్రతిష్ఠ' అనంతరం భక్తుల కోసం ఆలయం తలుపులు తెరవబోతున్నారు. ప్రస్తుతానికి రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ నెలాఖరు నుంచి రద్దీ సాధారణ స్థితికి రాబోతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంచనా వేస్తోంది. అందుకే జనవరి 27 తర్వాత మాత్రమే ఆలయ సందర్శనకు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తోంది. 


టైట్ సెక్యూరిటీ
దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్న టైంలో ఈ వేడుకు టైట్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఎన్‌ఎస్‌జీ స్నిపర్‌ల రెండు బృందాలు, ATS కమాండోల ఆరు బృందాలు యాంటీ డ్రోన్ టెక్నాలజీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, పారామిలటరీకి చెందిన 15,000 మంది పోలీసులు అయోధ్య కోసం కాపలాగా ఉంటున్నారు. 


11 భాషల్లో సైన్ బోర్డులు 
విభిన్న ప్రాంతాల నుంచి భక్తులు, వీఐపీలు వస్తున్న వేళ భారీ సంఖ్యలో సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు. 11 ప్రధాన భాషల్లో అయోధ్య నలువైపులా సైన్‌ బోర్డులు పెట్టారు. 400 సైన్ బోర్డులు ల్యాండ్‌మార్క్‌ల వద్ద ఉంచారు. సాధారణ ప్రజలు చలిని తట్టుకునేందుకు 300 చోట్ల గ్యాస్‌తో నడిచే హీటర్లు ఉంచారు. ఇప్పటికే హోటళ్లు, ఇతర పర్యాటక ప్రదేశాలు, విడిది కేంద్రాలు కిటకిట లాడుతున్నాయి. వీటితోపాటు 25,000 పడకలతో అతిపెద్ద ఎనిమిది తాత్కాలిక టెంట్ సిటీలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు.