ప్రపంచంలోని చాలా దేశాల్లో 13వ నెంబర్ అంటే టెర్రర్. 13 సంఖ్యను అపశకునంగా భావిస్తారు. ఇంటి నెంబర్ 13, ఫ్లాట్ నెంబర్ 13, 13వ ఫ్లోర్ అని పెట్టడానికి చాలా మంది వణికిపోతారు. ఈ వింత భయం ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అన్న సీక్రెట్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.

Continues below advertisement

రియల్ ఎస్టేట్ రంగంలో 13 నెంబర్ మాయం

పెద్ద భవనాల్లో, ముఖ్యంగా హోటళ్ళలో, అపార్ట్‌మెంట్లలో 12వ ఫ్లోర్ తర్వాత నేరుగా 14వ ఫ్లోర్ ఉంటుంది. లిఫ్టులలో కూడా 13వ బటన్ ఉండదు. అలాగే, విమానాల్లో కూడా 13వ నంబర్ సీటును దాటవేస్తుంటారు. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? 13వ నెంబర్ పెట్టాలంటే భయం. ఈ భయంతోనే డెవలపర్లు, బిల్డర్లు తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నుండి 13వ నెంబర్‌ను తొలగిస్తున్నారు. కస్టమర్ల మనోభావాలే ముఖ్యమన్నది వారి వాదన. 13వ నెంబర్ ఫ్లాట్ లేదా ఫ్లోర్ కొనడానికి కస్టమర్లు భయపడుతున్నారని, దీని వల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందనే ఆ నెంబర్ వాడటం లేదన్నది రియల్టర్లు చెప్పే మాట. ఓ నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 10 శాతం మంది అమెరికన్లు 13వ నెంబర్ అంటే వణికిపోతారట.

Continues below advertisement

13వ నెంబర్ భయానికి పెట్టిన పేరు ఇదే...

ఈ భయాన్ని ట్రిస్కైడెకాఫోబియా (Triskaidekaphobia) అంటారు. అమెరికన్ మానసిక వైద్యుడు, డా. ఆర్థర్ మాక్‌డొనాల్డ్ (Dr. Arthur Machen MacDonald) తొలిసారిగా 13వ నెంబర్ భయానికి 1911లో ప్రచురించబడిన అతని పుస్తకం "Fear: A Study in Superstition and Criminal Law"లో ఈ పదాన్ని అధికారికంగా ఉపయోగించారు. ట్రిస్కైడెకాఫోబియా అనేది 13వ సంఖ్య పట్ల ఉండే తీవ్రమైన భయాన్ని వివరించే పదం. ఈ పదం మూడు గ్రీకు పదాల కలయిక:

ట్రిస్ (Tris) అంటే మూడు (Three)

కైడెకా (kaideka) అంటే పది (Ten) (అంటే, 10+3=13)

ఫోబియా (Phobia) అంటే భయం (Fear)

ఈ మూడింటిని కలిపి ట్రిస్కైడెకాఫోబియా (Triskaidekaphobia) అని పిలిచారు.

13వ నెంబర్ పై భయం పుట్టుకకు కారణాలు ఇవే

13వ సంఖ్యపై ఉన్న ఈ భయం కొత్తగా ఇవాళ పుట్టింది కాదు. ఈ భయం తాలూకు మూలాలు పాత చరిత్రకు, పురాణాలకు లింక్ అయి ఉన్నాయి. ఈ భయం ప్రధానంగా వెస్ట్రన్ కంట్రీస్‌లో, ముఖ్యంగా యూరప్ దేశాల్లో ప్రారంభమై ప్రపంచం మొత్తం వ్యాపించింది. దీనికి ప్రధాన కారణాలు:

1. లాస్ట్ సప్పర్ (చివరి విందు) ద్రోహం

క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం, యేసుక్రీస్తు తాను సిలువ వేయబడే ముందు రోజు తనతో పాటు ఉన్న శిష్యులతో చేసిన చివరి విందులో (లాస్ట్ సప్పర్) మొత్తం 13 మంది ఉన్నారు. ఇందులో, 13వ వ్యక్తిగా పరిగణించబడిన ఇస్కరియోతు యూదా (జుడాస్ ఇస్కారియట్) యేసుక్రీస్తుకు ద్రోహం చేసి శిలువ వేయడానికి కారణమయ్యాడు. ఈ సంఘటన నుండి 13వ సంఖ్య అశుభకరమైనదిగా, ద్రోహానికి సంకేతంగా మారిందని పాశ్చాత్య దేశాల్లో చాలామంది నమ్ముతారు. క్రైస్తవం విస్తరించిన ప్రాంతాలలో ఈ నమ్మకం బలంగా ఉంది. ఈ కారణంగా 13వ నెంబర్ పట్ల వీరు విముఖత చూపుతారు.

2. నార్స్ పురాణాలు (Norse Mythology)

పురాతన నార్స్ పురాణాలు స్కాండినేవియన్ దేశాలకు (ప్రధానంగా నార్వే, స్వీడన్, డెన్మార్క్ మరియు ఐస్‌ల్యాండ్) చెందినవి. ఈ పురాణాలలో చెప్పిన ప్రకారం వాల్హాల్లాలో జరిగిన ఒక విందుకు 12 మంది దేవతలను మాత్రమే ఆహ్వానించారు. అప్పుడు, అల్లర్లకు, విధ్వంసానికి కారకుడైన 'లోకీ' అనే 13వ అతిథి బలవంతంగా విందులోకి ప్రవేశించి, అశుభాన్ని, చీకటిని సృష్టించాడని చెబుతారు. ఈ పురాణ కథ కూడా 13వ సంఖ్యను దురదృష్టంగా భావించడానికి ఒక కారణంగా మారింది. ఆ దేశాల్లోని చాలా మంది ప్రజలు 13వ సంఖ్య అంటే భయపడతారు.

3. పరిపూర్ణ సంఖ్యగా 12కు గుర్తింపు

చాలా దేశాల్లోని చరిత్రలో, వివిధ సంస్కృతులలో, 12 సంఖ్యను 'పరిపూర్ణత' (Completeness) లేదా 'పూర్తి' సంఖ్యగా భావించారు. సంవత్సరంలో 12 నెలలు, రోజులో గడియారంలో 12 గంటలు, రాశిచక్రంలో 12 రాశులు, గ్రీకు ఒలింపస్‌లో 12 మంది దేవతలు వంటి అంశాలు ఉన్నాయి. ఈ పరిపూర్ణ సంఖ్య 12ను దాటి వచ్చే 13వ సంఖ్య అశాంతిని, లోపాలను సూచిస్తుందని, అశుభాన్ని తీసుకొస్తుందని ప్రజలు భావించడం మొదలుపెట్టారు. ఈ కారణంగా 13వ నెంబర్ అంటే భయం, అయిష్టత ప్రజల్లో మొదలవడానికి కారణం అయింది.

4. శుక్రవారం 13 (Friday the 13th) భయం

పశ్చిమ దేశాలలో, శుక్రవారం రోజు 13వ తేదీ వస్తే దానిని అత్యంత అశుభకరమైన రోజుగా భావిస్తారు. చారిత్రక నమ్మకాల ప్రకారం, యేసుక్రీస్తును శుక్రవారం రోజున శిలువ వేశారని చరిత్ర చెబుతోంది. అందుకే శుక్రవారం దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఈ దురదృష్టపు రోజు (శుక్రవారం), అశుభ సంఖ్య (13) కలవడం వల్ల ఆ రోజున కీడు లేదా ప్రమాదాలు తప్పక జరుగుతాయని పాశ్చాత్య దేశాల్లోని చాలా మంది ప్రజలు గట్టిగా నమ్ముతారు. దీనిని పరస్కేవైడెకాట్రియోఫోబియా (Paraskevidekatriaphobia) అని కూడా పిలుస్తారు.

భారతీయుల్లో మాత్రం 13వ నెంబర్ పై భిన్నమైన అభిప్రాయం

పాశ్చాత్య దేశాలలో 13వ సంఖ్యపై భయం ఉన్నప్పటికీ, భారతీయ సంస్కృతిలో దీనికి భిన్నమైన అభిప్రాయం ఉంది. హిందూ చాంద్రమాన పక్షంలో 13వ రోజును త్రయోదశిగా పిలుస్తారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు. ఇది శివునికి చెందినదిగా భావిస్తారు మరియు దీర్ఘాయువు, శాంతి మరియు అదృష్టాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.

ఇలా ఆయా దేశాల్లో నెంబర్ 13 అంటే ఓ భయం, మన దేశంలో భక్తి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది 13వ నెంబర్ అంటే భయపడటం వల్ల ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కారణంగా ఇంటి నెంబర్ గాని, ఫ్లాట్ నెంబర్ గాని, లేదా 13వ ఫ్లోర్ అనేది లేకుండా చాలా మంది జాగ్రత్త పడతారు. అయితే ఇది కేవలం నమ్మకం మాత్రమేనని, ఈ నెంబర్ వల్ల నష్టపోయినట్లు ఎక్కడా రికార్డు కాలేదని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు.