Mata Kushmanda: బ్రహ్మాండంలో సకల వస్తువులలో, ప్రాణుల్లో తేజస్సు అంతా కూష్మాండ దుర్గ ఛాయే అని భక్తులు విశ్వసిస్తారు. 'అష్టభుజాదేవి' అని పిలిచే ఈ చల్లని తల్లి ఏడు చేతుల్లో కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలం, చక్రం, గద ఉంటాయి. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులు, నిధులను ప్రసాదించే జపమాల ఉంటుంది. కూష్మాండ దుర్గను పూజిస్తే బాధలు నశించిపోతాయని, ఆయు ఆరోగ్యం వృద్ధి చెందుతుందని చెబుతారు.
నవదుర్గ శ్లోకం
ప్రథమా శైలపుత్రీచ|ద్వితీయా బ్రహ్మచారిణీ|
తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|
పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|
సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|
నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||
"కు" అంటే చిన్న
"ఊష్మ" అంటే శక్తి
"అండా" అంటే విశ్వం
తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్ధం. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తీ లభిస్తాయని భక్తుల విశ్వాసం.
ఇంకా చెప్పాలంటే ఈ లోకాన్ని సృష్టించిన తల్లి అని ఈ పేరుకి అర్థం.అమ్మవారి తేజస్సే సూర్యుడు అని అంటారు. అందుకు ప్రతీకగా కూష్మాండ దేవి ఆ సూర్యుని ధరించి కనిపిస్తుంది. ఈ దేవిని కొలిచినవారికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి
Also Read: ఈ రాశులవారిపై మహాలక్ష్మి కటాక్షం, అక్టోబరు 18 రాశిఫలాలు
కూష్మాండ దుర్గ... పులిని వాహనంపై కూర్చుని ఉంటుంది. అమ్మవారి శక్తికి నిదర్శనంగా కనిపించే ఎనిమిది చేతుల్లో విల్లు , బాణం, చక్రం, గద, తామరపువ్వు, జపమాల, కమండలం,అమృత కలశం ఉంటుంది. అష్ట భుజాలు కలిగి ఉన్నందున అష్ట్భుజాదేవిగా పిలుస్తారు. ఈదేవికి (గుమ్మడి కాయ) కూష్మాండ బలి ఎంతో ప్రీతిదాయకమైనది. అందుకే కూష్మాండ దుర్గగా పూజిస్తారు.
కూష్మాండ రూపం
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '
దుర్గా ధ్యాన శ్లోకం
ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |
సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥
Also Read : శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!
త్రిమూర్తులు, త్రిమాతల సృష్టి మహాకాళీ కుష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జన్మించింది. ఈమెకు కూష్మాండ దేవి మాహాకాళి అని పేరు పెట్టింది. చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి పది తలలు, పది చేతులు, పది కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతి వేళ్ళు, 30 కాలి వేళ్ళు, చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయట పెట్టి కనిపిస్తుంది. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం, త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్త గుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది కాళీ.
కుష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఉద్భవించిన రూపం... బంగారు వర్ణంలో 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, ఘంట, ఉచ్చు, బల్లెం, కొరడా, ధనువు, డాలు, మధుకలశం, నీటిపాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి, గట్టిగా గర్జించిందిట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండా దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది.
కుష్మాండాదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయిన తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. ఈమెకు మహాసరస్వతి అని పేరు పెట్టింది అమ్మ. తెల్లటి వస్త్రాలు ధరించి తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న ఢమరుకం, నత్తగుల్ల, ఘంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది.
Also Read: దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!
కుష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే.. ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, ఢమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి, నాలుగు చేతుల్లో పాశం, జపమాల పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. ఇలా కలసి పుట్టిన శివుడు, శక్తి(సరస్వతీదేవి)లు అన్నాచెల్లెళ్ళు అని అంటారు.
బ్రహ్మ/లక్ష్మీ
కూష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. నాలుగు ముఖాలతో, నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామరపువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకుని ఉన్నాడు. తనకి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా, లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామరమొగ్గలు, కింద రెండు చేతులూ అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది అమె. కుష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.
ఇంత శక్తివంతమైన కూష్మాండ దేవిని నవరాత్రుల్లో నాల్గవరోజు ఆరాధిస్తే కీర్తి , ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తుందని పండితులు చెబుతారు.