Navaratri Utsavams In Indrakeeladri In Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి (Annapurnadevi) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజులుగా అమ్మవారి మూల విగ్రహానికి భక్తులు సమర్పించిన వజ్రాల కిరీటం, సూర్యచంద్రాలను అలంకరించారు. ఈ క్రమంలోనే అమ్మవారికి భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తున్నారు.


ప్రకాశం జిల్లా (Prakasam District) కొండెపి నివాసి అయిన కల్లగుంట అంకులయ్య అనే వ్యక్తి రూ.18 లక్షలు విలువైన బంగారు మంగళసూత్రాన్ని దుర్గమ్మకు బహూకరించారు. దీన్ని ఆలయ ఈవో రామారావుకు అందించారు. అలాగే, గుంటూరుకు చెందిన మరో భక్తుడు సుమారు ఆరున్నర కేజీలకు పైగా వెండితో చేసిన హంస వాహనాన్ని అమ్మవారికి బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కానుకలు అందించిన భక్తులకు అభినందనలు తెలియజేశారు. దాతలపై అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. దాతలకు దర్శనం అనంతరం శేషవస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కాగా, ఈ నెల 12వ తేదీ వరకూ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.


భక్తులకు కీలక సూచనలు


ఉత్సవాల్లో భాగంగా గత రెండు రోజుల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా మార్పులు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. వీఐపీ భక్తులు టైమ్ స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలని అన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆదివారం నుంచి రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఉత్సవ కమిటీ సభ్యులకు కూడా ఇబ్బంది లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. కాగా, తొలిరోజు అమ్మవారిని 49 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 'రెండో రోజు 65 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం వరకూ 36 వేల మంది దర్శనం చేసుకున్నారు. మూలా నక్షత్రం రోజును భారీగా భక్తులు తరలివస్తారు. 2 రోజుల్లో 28 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. 3,952 మంది తలనీలాలు సమర్పించారు. 1,39,906 లడ్డూలు కొనుగోలు చేశారు. లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చూస్తున్నాం. 6 లడ్డూలు కలిపి ఒక ప్యాకింగ్ రూపంలో అందిస్తున్నాం.' అని పేర్కొన్నారు.


'అదే లక్ష్యం'


అటు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలనేదే తమ లక్ష్యమని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. 'వీఐపీలు టైమ్ స్లాట్ ప్రకారమే దర్శనం చేసుకోవాలి. రూ.500 దర్శనం ఆలస్యమవుతోంది. క్యూలైన్లలో పద్ధతి పాటించకుండా ప్రవేశించే భక్తులను నియంత్రిస్తున్నాం. పోలీస్ యూనిఫాంలో ఎవరు దర్శనానికి వెళ్లినా ఊరుకునేది లేదని హెచ్చరించాం. వీఐపీ దర్శనాలకు యాప్ అందుబాటులోకి తెచ్చాం. ట్రాఫిక్ విషయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ నియంత్రిస్తున్నాం. మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ దృష్ట్యా పటిష్టం ఏర్పాట్లు చేస్తున్నాం. మా దృష్టికి వచ్చిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం.' అని సీపీ వివరించారు.


Also Read: Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!