Bijli Mahadev Shivling : తన విలయ తాండవంతో ప్రకృతినే గడగడలాడించే పరమశివుడికి పిడుగులు ఓ లెక్కా? పంచభూతాలను తన అదుపులో ఉంచకునే పరమేశ్వరుడిపై ప్రకృతి ప్రతాపం చూపించగలదా? అంటే కానేకాదు. కానీ అలాంటి శివయ్యపై అదో దైవకార్యంలా ఏడాదికోసారి పిడుగుపడుతుంది. హిమాచల్ ప్రదేశ్‌ లోని ప్రకృతి అందాల మధ్య కొలువైన ‘బిజిలీ మహాదేవ్’ ఆలయం విశిష్ఠత ఇదే.

ముక్కలై తిరిగి అతుక్కుంటుంది

హిమాచల్ ప్రదేశ్‌ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కులు-మనాలి. ఆ కులుకు 22 కిలో మీటర్ల దూరంలో ఉంది  ‘బిజిలీ మహాదేవ్’ ఆలయం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు కిలో మీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సిందే.‘బిజిలీ మహాదేవ్’ ఆలయంలో ఏడాదికి ఓసారి పిడుగు పడుతుంది.  పిడుగు కూడా ఏమాత్రం గురి తప్పనట్లుగా డైరెక్టుగా శివలింగం పైనే పడుతుంది. దీంతో శివలింగం చీలిపోయి ముక్కలైపోతుంది. అలా ముక్కలైపోయిన శివలింగాన్ని ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒకచోటకు చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో తిరిగి అతికిస్తారు. కొన్నాళ్లకు పగుళ్లు మాయమై సాధారణంగా మారిపోతుంది. అందుకే ఇక్కడ శివయ్యను పిడుగుల శివయ్య అని పిలుస్తారు భక్తులు.

Also Read: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

పిడుగు ఎందుకు పడుతుందంటే!

ఏటా పిడుగుపాటుకు గురికావడం వల్ల ఈ ఆలయానికి ‘బిజిలీ మహాదేవ్’ అని పేరు వచ్చింది. హిందీలో బిజీలీ అంటే విద్యుత్ లేదా పిడుగు. ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుపాటును పరమేశ్వరుడు తనమీదకు రప్పించుకుంటాడని స్థానికులు నమ్మకం

ఇప్పటికీ మిస్టరీనే!

పిడుగు పాటుకు విరిగిన శివలింగం మళ్లీ తిరిగి అతుక్కోవటానికి గల కారణం గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కానీ సరైన సమాధానం తెలుసుకోలేకపోయారు. సాధారణంగా పిడుగు పడితే రాయి ముక్కలైపోయి చెల్లా చెదురవుతుంది. జిగురుతో అతికించినా అది పూర్తిస్థాయిలో అంటుకోదు. కానీ ఈ బిజిలి శివయ్యకు పూజర్లు పిండి, తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుంది అనేది మాత్రం ఇప్పటికీ  మిస్టరీగానే మిగిలిపోయింది. 

కులు అనే పేరు ఏలా వచ్చింది

కులు ప్రాంతంలో కులాంతా అనే రాక్షసుడు ఉండేవాడు. ఓ విషపూరితమైన పాముగా లాహౌల్-స్పితీలోని మాథాన్ గ్రామానికి చేరుకుంటాడు. బియాస్ నదికి గండిపెట్టి ఆ గ్రామాన్ని వరదతో ముంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు.  బియాస్ నదిలో ఈదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు ప్రయత్నించగా పరమశివుడు పాము రూపంలో ఆ రాక్షసుడిని అంతం చేశాడు. ఆ రాక్షసుడు మరణం తర్వాత పెద్ద పర్వతంగా  మారాడని అందుకే కులాంత పేరుమీద కులు అని పిలవడం మొదలెట్టారని స్థలపురాణం

Also Read: మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!

ఆలయం చిన్నదే కానీ..!

ఈ పిడుగుల శివాలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. కళ్లు తిప్పుకోలేని ప్రకృతిశోభ కనువిందు చేస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ పిడుగుల శివయ్యను దర్శించుకోవటానికి భక్తులు శివరాత్రి రోజున భారీగా తరలివస్తారు. డిసెంబరు, జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు. ఈ పిడుగుల పరమేశ్వరుడి దేవాలయం చిన్నదే కానీ మహిమలగల ఆలయం.